కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 24 : హైకోర్టు తీర్పుతో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణ రాష్ర్టానికి జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టేనని ఉద్ఘాటించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి కేవలం మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టు నిర్మించారని, ఇది ప్రపంచంలోనే నంబర్‌వన్ ఎత్తిపోతల పథకం అని ప్రశంసించారు. కానీ, ఆ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
అపరభగీరథుడు కేసీఆర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేశారని, ఇది హైకోర్టుతో తీర్పుతో బయటపడిందని స్పష్టం చేశారు. ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని, ఇప్పటికైనా రేవంత్ కండ్లు తెరవాలని హితవు పలికారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కుంగిన రెండు పిల్లర్లను వెంటనే బాగు చేయించి, అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కోటి ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, రైతుల సాగునీటి కష్టాలు తీర్చారని కొనియాడారు. కానీ, మేడిగడ్డ వద్ద కేవలం రెండు పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కూలిపోయినట్టు రెండున్నరేళ్లుగా చిల్లర రాజకీయాలు చేస్త్తున్నారని మండిపడ్డారు. ఎంతసేపూ కేసీఆర్‌ను బద్నాం చేయాలని కుట్ర పూరితంగా ఆలోచించారే తప్ప రాష్ట్ర రైతుల భవిష్యత్‌పై ఆలోచన చేయలేదని ఆగ్రహించారు. ప్రాజెక్టుపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మాటలన్నీ ఉత్తమాటలేనని విమర్శించారు. రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేస్తున్న మంత్రులకు అసలు ఈ ప్రాజెక్టుపై ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
ఈ ప్రాజెక్టులో మొత్తం 17 రిజర్వాయర్లు ఉన్నాయని, అందులో 15 పెద్దవి, 2 చిన్నవి ఉన్నాయని, 530 మీటర్ల ఎత్తుతో మల్లన్నసాగర్ వరకు ఈ నీరు వెళ్తుందని వివరించారు. భూగర్భం నుంచి 203 కిలోమీటర్లు, 1531 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా సాగునీరందుతుందని చెప్పారు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టే కూలిందని చేస్తున్న అసత్య ప్రచారాలను ఆపాలని, ప్రాజెక్టు నిజస్వరూపం తెలుసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కు సవాల్ విసిరారు.
ఇరిగేషన్ మంత్రి, ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అంతా ఈ ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించడానికి వస్తే.. రెండు బస్సులు ఏర్పాటు చేయించి ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కల్పిస్తానని చెప్పారు. బాధ్యతారహితంగా చేస్తున్న విమర్శలు మానుకోవాలని, లేకుంటే కాళేశ్వరం శాపంతో కాంగ్రెస్ కాటికి పోవడం ఖాయమని హెచ్చరించారు. కాళేశ్వరం కూలిందని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నాయకులు విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో తారుపల్లి మాజీ సర్పంచ్ భైరం రమేశ్, బీఆర్ఎస్వీ నాయకుడు పడాల సతీశ్ తదితరులు ఉన్నారు.