జయశంకర్ భూపాలపల్లి : మున్సిపల్ కార్మికుల జీతాలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 1181 జీఓను రద్దు చేసి, పాత జీతాల ప్రకారమే తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు.
మున్సిపల్ కార్మికులకు ప్రతి ఏట జీతాలు పెంచాల్సింది పోయి, తగ్గించడం సిగ్గుచేటన్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున జనాలు నిద్రలేవకముందే పట్టణంలోనీ రోడ్లన్నీ పరిశుభ్రం చేసి, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసే మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టొద్దని హెచ్చరించారు. కార్మికుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డ చరిత్ర లేదన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మున్సిపల్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.