Viral News | హాస్టల్లో గజ్జెల శబ్దాలు.. ఎవరో నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టు వినిపిస్తున్న శబ్దాలు.. ఆపై ‘దెయ్యం’ ఉందంటూ ప్రచారం! దీంతో వందలాది మంది విద్యార్థులు భయంతో హాస్టల్‌ను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని ఓ ప్రభుత్వ వసతి పాఠశాలలో ఈ ఘటన కలకలం రేపింది. దాదాపు 608 మంది విద్యార్థులు హాస్టళ్ల నుంచి ఇళ్లకు వెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
హాస్టల్లోని కొందరు బాలికలు రాత్రి వేళల్లో అసాధారణ శబ్దాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు. ముఖ్యంగా గజ్జెలు మోగుతున్న శబ్దం, నవ్వులు, ఏడుపులను పోలిన శబ్దాలు వినిపిస్తున్నాయని వారు చెప్పినట్లు వివరించారు. ఈ విషయం మిగతా విద్యార్థులకు తెలియడంతో భయం క్రమంగా అందరికీ వ్యాపించింది.
‘హాస్టల్లో దెయ్యాలు సంచరిస్తున్నాయి’ అంటూ ప్రచారం జరగడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో 263 మంది బాలురు, 345 మంది బాలికలు.. మొత్తం 608 మంది హాస్టల్‌ను విడిచి ఇళ్లకు వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బాలికల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన పాఠశాల యాజమాన్యం వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి మానసిక వైద్య నిపుణులతో పరీక్షలు చేయించింది. విద్యార్థుల్లో కనిపిస్తున్న లక్షణాలు తీవ్రమైన హిస్టీరియా వంటి మానసిక పరిస్థితికి సంబంధించినవై ఉండొచ్చని వైద్యుడు తెలిపినట్లు ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తూ భయాందోళనలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
స్థానిక ఆరోగ్య అధికారి అభిషేక్ నాయుడు విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యగా భావించాలని, దీనికి దెయ్యాలు లేదా అతీంద్రియ శక్తులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వదంతులను ప్రచారం చేయవద్దని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు మహారాష్ట్రకు చెందిన అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి కూడా రంగంలోకి దిగింది. భయంతో ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్ అందిస్తూ, మూఢనమ్మకాలకు లోనుకాకుండా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల భయాన్ని తొలగించి, వారు తిరిగి పాఠశాలకు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.