సినిమా పేరు: విశ్వనాథ్ అండ్ సన్స్
తారాగణం: సూర్య, మమితాబైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్..
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య
నిర్మాణంలో ఉండగానే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా కంపల్సరీ హిట్ అని జనం కూడా నమ్ముతూ వచ్చారు. సర్, లక్కీభాస్కర్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, బ్లాక్‌బస్టర్ ‘కరుప్పు’ తర్వాత వస్తున్న సూర్య సినిమా కావడం.. నిర్మాణంలో ఏ మాత్రం రాజీపడని సితార వారి సినిమా కావడం.. సూర్య, మమితాబైజుల ఫ్రెష్ కాంబినేషన్, ప్రచార చిత్రాలు ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి. ఎట్టకేలకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మరి అందరి అంచనాలనూ అందుకొని ఈ సినిమా విజయాన్ని అందుకున్నదా? లేదా? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
విశ్వనాథ్ రామస్వామి ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు. గన్ షూటింగ్లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. వయసు 42ఏండ్లు. ఇంకా పెళ్లి కాలేదు. దానికి బలమైన కారణమే ఉంటుంది. తల్లి(రాధిక శరత్‌కుమార్) పెళ్లి చేసుకోమని ఎంత బతిమాలినా విశ్వనాథ్ మాత్రం అంగీకరించడు. వంశం నిర్వంశం అవుతుందని తల్లి బాధ పడుతుంటే చూడలేని విశ్వనాథ్ ఒక నిర్ణయానికొస్తాడు. సరోగసీ ద్వారా తండ్రి కావాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతాడు. ఆమె విశ్వనాథ్ బిడ్డను మోసే తల్లిని అక్కడే వెతికి పెడుతుంది. తొమ్మిది నెలల తర్వాత విశ్వనాథ్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి బిడ్డను తెచ్చుకుంటాడు. సరోగసీ ద్వారా పుట్టిన ఆ బిడ్డను విశ్వనాథ్ ఫ్యామిలీ అక్కున చేర్చుకొని ప్రేమగా పెంచుతుంటారు. ఇంతలో ఆ బాబు ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవుతాడు. డాక్టర్స్ పిల్లాడికి బోన్ మ్యారో ప్రాబ్లమ్ అని నిర్థారిస్తారు. తల్లి బోన్ మ్యారో మాత్రమే పిల్లాడికి సరిపోతుందని డాక్టర్స్ చెప్పడంతో బాబు కన్నతల్లి కోసం మళ్లీ విశ్వనాథ్ శాన్ ఫ్రాన్సిస్కో వెళతాడు. అక్కడ డాక్టర్ సహాయంతో తల్లి అడ్రెస్ కనుక్కొని అక్కడికి వెళాడు. అప్పుడు కథలో కీలకమైన మ్యాడీ(మమితాబైజు) పాత్ర రివీల్ అవుతుంది. సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మ్యాడీ. తనో అనాథ. అంతేకాదు మెడిసన్ ఫైనల్ ఇయర్ చదువుతుంటుంది. ఫీజ్ కోసం తాను అద్దె గర్భానికి ఒప్పుకుంది. విశ్వనాథ్ అసలు విషయాన్ని మ్యాడీకి వివరించి, ఆమెను ఇండియా తెస్తాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? విశ్వనాథ్-మ్యాడీల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అసలు విశ్వనాథ్ పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? చివరికి ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ
విశ్లేషణ
ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ కథలోని పాత్రలు, వారి మధ్య నెలకొన్న సమస్య ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతినిస్తుంది. అవసరాల కోసం అమ్మానాన్నలైన ఇద్దరు అపరిచితుల కథ ఇది. వారిమధ్య విడదీయరాని బంధంగా మారిన ఆ బిడ్ద. పసితనంలో ఏర్పడ్డ అభిప్రాయాలను వెనక్కి తీసుకోలేక సతమతమవుతూ కథానాయకుడు.. అనాథగా పెరిగి, అమ్మగా మారి, అనుకోకుండా ఏర్పడ్డ బంధాలను వదులుకోలేక ఉక్కిబిక్కిరి అవుతూ కథానాయిక. ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు.. తద్వారా వచ్చే అనుభూతులు ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. రెండున్నర గంటల భావోద్వేగప్రయాణం ఇది. సినిమా మొదలైన పదినిమిషాల్లోనే ఓ ఊహించని గమ్మత్తైన సమస్య కథలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ సమస్య కారణంగా కథలో వచ్చే మలుపులు ఆడియన్‌కి కట్టిపడేస్తాయి. ప్రేమకు వయసుతో నిమిత్తం లేదని, ఏ బంధాన్నయినా బతికించేది, గెలిపించేది స్త్రీ మాత్రమే అని, చాలా అందంగా చెప్పాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ ఎమోషనల్ జర్నీలో యాక్షన్‌కి కూడా కొదవలేదు. సూర్య అభిమానులకు కావాల్సిన మసాలాను కూడా కథానుగుణంగానే మిళితం చేశాడాయన. మొత్తంగా సినిమా ఫస్టాఫ్ సూపర్. సెకండాఫ్ కూడా సూపర్.
నటీనటులు
ఇక 42ఏండ్ల విశ్వనాథ్ రామస్వామిగా సూర్య విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఆద్యంతం తనదైన ైస్టెలిష్ పెరఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారాయన. కొన్ని సీన్స్‌లో ‘గజనీ’లోని సంజయ్ రామస్వామి గుర్తొస్తాడు. ఇక ఎమోషనల్ సీన్స్‌లో సూర్య నటనకు థియేటర్లలో అద్భుతమైన స్పందన కనిపించింది. ముఖ్యంగా తల్లి మరణం తర్వాత వచ్చే సీన్లో ఆయన నటన మనసుల్ని పిండేస్తుంది. ఓ అందమైన అమ్మాయి, అందునా తన బిడ్డకు తల్లి తన ప్రేమకోసం ఆరాటపడుతుంటే.. మనసులో దాగున్న ప్రేమ భావాలను మనసులోని అదిమిపెట్టి, పైకి మాత్రం గంభీరంగా కనిపించే విశ్వనాథ్ రామస్వామిగా సూర్య అభినయాన్ని అభినందించకుండా ఉండలేం. ఇక మమితాబైజు.. ‘గజనీ’లోని కల్పన పాత్ర ఆసిన్కి.. ‘బొమ్మరిల్లు’లోని హాసిని పాత్ర జెనీలియాకు ఎంతటి గుర్తింపునిచ్చాయో.. ఇందులోని మ్యాడీ పాత్ర మమితాబైజుకు అంత పేరు తెచ్చిపెడుతుంది. సూర్యకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా నటించింది మమిత. అల్లరితనం, కొంటెతనం, మంచితనం, అమ్మతనం, అమ్మాయితనం అన్నీ ఆమె పాత్రలో కనిపించాయి. రాధిక శరత్‌కుమార్ గురించి చెప్పేదేముంది? ఎప్పటిలాగే అదరగొట్టేశారు. మిగతా నటీనటులు సైతం పరిథిమేర తమ పాత్రలను రక్తికట్టించారు.
సాంకేతికంగా
దర్శకుడు వెంకీ అట్లూరి ముందు కథకుడిగా సక్సెస్ అయ్యాడు. దానికి అద్భుతమైన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ జోడించి రచయితగా సక్సెస్ అయ్యాడు. వినోదంతో కూడిన భావోద్వేగాలతో ఈ స్క్రిప్ట్‌ని తెరకెక్కించి దర్శకుడిగా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా కొన్ని సింగిల్ లైనర్స్ ఆడియన్స్‌ని ఆలోచింపజేస్తాయి. ఈ సినిమా విజయంలో విషయంలో ముందు అభినందించాల్సింది కచ్చితంగా వెంకీ అట్లూరినే. ఇక పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా, ఎడిటింగ్ అన్నీ అభినందనీయంగానే ఉన్నాయి. చూస్తున్నంతసేపు చెదరని చిరునవ్వూ, ఆనందభాష్పాలు.. ఈ రెంటినీ ఆడియన్‌కి గిఫ్టులుగా ఇచ్చాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఎమోషన్స్ ఆడియన్‌కి కనెక్టయితే.. సినిమా విజయాన్ని ఎవరూ అపలేరన్నది నిజం. అందుకే.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరు.
బలాలు
కథ, కథనం, నటీనటుల నటన, సంగీతం, కెమెరా
బలహీనతలు
సెకండాఫ్ కాస్త స్లో అయిన ఫీలింగ్..(అయినా బానేవుంది)
రేటింగ్ : 3.5/5