తిరుపతి : తిరుమల ( Tirumala ) శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్ల పేరుతో నకిలీ వెబ్సైట్లు ( Fake Websites ) , వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు టీటీడీ ( TTD ) విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్లు ఇప్పిస్తామంటూ నమ్మించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్ , అధికారిక యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్మార్క్లను ఉపయోగిస్తూ నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీస్ తదితర విభాగాల సమన్వయం చేసుకుని ప్రత్యేక నిఘా ఉంచినట్లు స్పష్టం చేసింది. గత రెండేళ్లలో 259 ఫేక్ వెబ్ సైట్లను గుర్తించి తొలగించడంతో పాటు ఆ వెబ్సైట్లకు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని తెలియజేసింది.