Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 4 : సంప్ నిర్మాణం జరిగినా నీటి సరఫరాలో నిర్లక్ష్యం, రైల్వే స్టేషన్ ప్రధాన కాలువ నిర్మాణం సగంలో ఆపిన కాంట్రాక్టర్, చోద్యం చూస్తున్న అధికారులపై సత్వర చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ కోరారు. ఈమేరకు శనివారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ 26వ డివిజన్ రైల్వే స్టేషన్ ఏరియాలోని భరత్ నగర్, తబితా ఆశ్రమం, ఎస్టీ కాలనీ ప్రజల సౌకర్యార్థం మంచినీటి సమస్య తీర్చాలని సంప్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తూ మోటార్ పంపులు ఏర్పాటు చేసినా నీటిని ప్రజలకు సరఫరా చేయడం లేదనీ, ఎన్నిసార్లు చెప్పివా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని పేర్కొన్నారు.
గత ఏడాదిలోనే నీటి సరఫరా జరగాల్సి ఉండేదనీ, ఈ ఎండాకాలంలో కూడా నీరు అందించలేని దుస్థితికి కారణమైన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అదే ఏరియాలో ప్రధాన కాలువ నిర్మాణం చేపట్టి పనులను సగంలోనే ఆపివేసిన కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారని తెలిపారు. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. త్వరితగతిన ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రైల్వే స్టేషన్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం వెంటనే పూర్తి చేయించాలని కోరారు.