హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ) : దేవాదుల ప్రాజెక్ట్ వద్ద నీటి లభ్యత, మోటర్లు నడిపించే అవకాశం ఉన్నా ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ నిర్మించిన సమ్మక బ్యారేజీలో 3 టీఎంసీల నీటి నిల్వ ఉండి 22వేల క్యూసెకుల వరద వస్తున్నా పూర్తిస్థాయిలో మోటర్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు. మంత్రులు వెళ్లినప్పుడు ఏడు మో టర్లు, లేనప్పుడు మూడు మోటర్లు మాత్రమే నడుస్తున్నాయని విమర్శించారు.
తక్షణమే దే వాదుల పది మోటర్లు నడిపి 22 రిజర్వాయ ర్లు నింపి 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, లేకపోతే వరంగల్, నల్లగొండ, కరీంనగర్ రైతుల తో కలిసి ప్రజాపోరుకు సిద్ధమవుతామని హె చ్చరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, లక్ష్మారెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రేగా కాంతారావుతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 12న తాము నిలదీశాక, 13న మంత్రులు ఉత్తమ్, భట్టి, పొంగులేటి హెలికాప్టర్లో దేవాదులకు వెళ్లి హడావుడి చే శారని విమర్శించారు. ‘దేవాదుల కింద ఉన్న 22 రిజర్వాయర్లు నింపుతాం. 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం’ అని మంత్రులు మాట్లాడిన వీడియోను మీడియాకు చూపించారు. వారి మా టలు నమ్మి రైతులు నాట్లు వేస్తే, ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇది ఎల్ నినో, ప్రకృతి తెచ్చిన కరువు కాద ని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అసమర్థ కరు వు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎల్ నినో వస్తుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా మొద్దునిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. నిరుడు రూ.8 కోట్ల విద్యుత్తు బిల్లులు ఇవ్వకుండా 50 రోజులు ఆలస్యంగా దేవాదుల మోటార్లు ఆన్ చేయడం వల్ల రూ.700-800 కోట్ల విలువైన పంట ఎండిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. సమ్మక బ్యారేజీ కట్టి, 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు దేవాదుల మూడు ఫేజ్‌లు పూర్తిచేసి లిఫ్ట్ చేయడానికి కేసీఆర్ సిద్ధంగా పెట్టారని గుర్తుచేశారు.
కానీ ఈ ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయకుండా వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టిందని మండిపడ్డారు. 30నెలలుగా కాళేశ్వరం మీద పడి ఏడ్వటం తప్ప రేవంత్, ఉత్తమ్ చేసిందేమున్నదని మండిపడ్డారు. ‘కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టు రాష్ట్రానికి వరం. వైరా, బేతుపల్లికి నీళ్లు వస్తున్నాయంటే అది కేసీఆర్ కృషే. తాగు, సాగునీటికి ఢోకా లే కుండా చేశాం. అన్నారం, సుందిళ్లలాగే సమ్మ క బ్యారేజీ డిజైన్ చేశాం. దేవాదుల కోసం వాడుతున్నప్పుడు అదే నదిపై ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎందుకు వాడటం లేదు?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పెట్టి నీళ్లు ఇవ్వం, నాట్లు వేసుకోవద్దని ఇప్పుడు చెప్తున్నారని, కానీ, మంత్రులు మాత్రం 3లక్ష ల ఎకరాలకు నీళ్లు ఇస్తామని రెండు మాటలు చెప్పడమేమిటని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మంత్రులది ఒక మాట, కలెక్టర్‌ది ఒక మాట నా? అని ప్రశ్నించారు. రామప్ప కింద తూ ములు మూసేశారని, నార్లు పోసిన రైతుల పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు. గోదావరిలో బ్రహ్మాండంగా నీళ్లున్నా కలెక్టర్ ఎందుకు తూ ములు మూశారు? రైతులకు మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నిలదీస్తేనే ప్రభుత్వానికి సోయి వస్తున్నదని, తమ ప్రెస్‌మీట్ ఉన్నదని తెలిసి ఈరోజు పొద్దున మరో రెండు మోటర్లు ఆన్‌చేశారని హరీశ్‌రావు చెప్పారు. ఈ ప్రభుత్వానికి తిట్ల మీద ఉన్న ధ్యాస నీళ్లెత్తడంపై లేదని విమర్శించారు. ‘రోజుకు పావు టీఎంసీ ఎత్తే అవకాశం ఉన్నా ఇప్పటివరకు రెండు టీఎంసీలు కూడా ఎత్తలేదు’ అని దుయ్యబట్టారు. ‘జూన్ 1నుంచి ఇప్పటివరకు 50రోజులు ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదు? 22రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలు. 50రోజుల్లో అన్నీ నిండిపోయేవి.
ఇప్పుడు కూడా దేవాదుల వద్ద 78 మీటర్ల లెవల్లో గోదావరి ప్రవహిస్తున్నది. డై లాగ్‌లు దంచడమే తప్ప రిజర్వాయర్లు నింప రా?’ అని నిలదీశారు. కాంగ్రెస్ పదేండ్లలో 46వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. కేసీఆర్ హ యాంలో 3.17 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని తద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతటికీ దేవాదుల నీళ్లు పారాయని గుర్తుచేశారు. కేసీఆర్ నీళ్ల కోసం యుద్ధం చేస్తే.. కాంగ్రెస్ నీళ్లపై యుద్ధం చేస్తున్నదని దుయ్యబట్టారు.