రేవంత్‌రెడ్డీ.. ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుపెట్టిన పోరంబోకు జాతైతే మాదికాదు. సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతైతే మాదికాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించి యాభై లక్షలతో దొరికిపోయిన లుచ్చాజాతైతే మాదికాదు. ప్రాజెక్టుల మీద వందల కేసులు వేసి ఆపాలని చూసిన దివానాగాళ్ల బ్యాచైతే మాదికాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజలను రెచ్చగొట్టి బతికిన చిల్లరజాతి మాదికాదు. ఇచ్చే అవకాశమున్నా నీళ్లివ్వలేని అసమర్థ జాతి కాదు మాది. ఉద్యోగాలడిగితే ఎండ్రిన్ తాగుమని, నీళ్లడిగితే రక్తం చల్లుకొమ్మని రాక్షసభాష మాట్లాడే జాతి మాదికాదు. ఎవరేందో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. – కేటీఆర్
మంచిర్యాల, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓట్లేసిన పాపానికి ఇయ్యాల రైతులను కాంగ్రెస్ కాటేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సొంత పిల్లల్ని పాము ఎైట్లెతే తింటదో.. అట్లా ప్రభుత్వ అధినేతగా ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని రైతులను చెప్పలేని కష్టాలు పెడుతున్నాడని, దుర్మార్గ, కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నదని నిప్పులు చెరిగారు. ఓవైపు యూరియా కష్టాలు, మరో వైపు కరెంటు కష్టాలు, ఇంకోవైపు సాగునీటి కోసం తండ్లాట.. ఇన్ని గండాలు దాటి పంటలు పండిస్తున్న రైతులు రేవంత్‌రెడ్డి అనే గండాన్ని దాటలేకపోతున్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించిన ‘రైతు సదస్సు’కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మే 5న కొనుగోలు కేంద్రాల్లో పంటను కాపాడుకునేందుకు వెళ్లి గోడ, షెడ్డుకూలి మృతిచెందిన నలుగురు రైతులు తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్, గుండారపు వెంకటేశ్, నెల్కి లచ్చన్నకు గతంలో ఒకొక్కరికీ ప్రకటించిన రూ.5 లక్షల పరిహారాన్ని కేటీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జోగురామన్న, ప్రశాంత్‌రెడ్డితో కలిసి బాధిత రైతు కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గోదావరిలో నీళ్లుండీ ఎల్లంపల్లికి ఎత్తిపోయలేని అసమర్థ ప్రభుత్వమిది అని దుయ్యబట్టారు. కావాలనే నీళ్లు ఎత్తిపోయకుండా రైతులను సతాయిస్తున్నారని, అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 32 నెలల్లో నాలుగుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎరువుల దుకాణానికి పోయే పని లేకుండా ఆటో అన్నకో తమ్ముడికో ఫోన్ కొడితే పొలం కాడికే యూరియా వచ్చేదని గుర్తుచేశారు.
పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా వచ్చిండ్రు
‘కాంగ్రెస్ బలవంతంగా రుద్దుతున్న కరువుతో అల్లాడుతున్నా.. వేసిన విత్తనాలు మొలకెత్తక పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా.. అన్నీ దింగమింగుకొని పెద్ద సంఖ్యలో రైతు సదస్సుకు తరలివచ్చిన రైతులందరికీ హృదయపూర్వక నమస్కారాలు’ అని కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. గోడ కూలి మృతి చెందిన రైతులను యాది చేసుకుంటూ ‘శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలను ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం వచ్చిందా? అని నేను అడిగిన. రెండున్నర నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. జరిగింది విషాదం. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నలుగురు రైతులు చనిపోతే ఒక్క రైతుకే రూ.5 లక్షలు వచ్చినయ్. ఆ 5 లక్షలు కూడా కేసీఆర్ పెట్టిన రైతుబీమా నుంచి ఇచ్చిండ్రు. మిగిలిన ముగ్గురికి ఐదు లక్షలో.. ఐదు వేలో కాదు గదా.. ఐదు పైసలు కూడా ప్రభుత్వం నుంచి సాయమందలేదు. ఇంత దుర్మార్గ, కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. పంటలకు కాపలా కాసి నలుగురు రైతులు చనిపోయినా రేవంత్‌రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదు’ అని నిప్పులు చెరిగారు.
కాళేశ్వరంపై ఆకట్టుకున్న ప్రజెంటేషన్
కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రాజెక్ట్‌పై రైతులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎట్లా తీసుకురావచ్చో, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ ఎట్ల్ల నీళ్లు తేవచ్చో వివరించారు. ‘మేడిగడ్డతో మొదలైన కాళేశ్వర జలధార.. దశలదశలుగా తెలంగాణ బీడు భూములను తడుపుతుంది. 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న మేడిగడ్డ బరాజ్‌లో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలో గోదావరి నీటి మట్టం 93.5 మీటర్లు ఉన్నప్పుడు మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయాల్సిన అవసరం లేకుండానే 17 మోటర్లతో నీటిని లిఫ్ట్ చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బరాజ్‌కు పంపింగ్ చేయొచ్చు. సీడబ్ల్యూసీ డాటా ప్రకారం 2026, జూలై 20 నాటికి కన్నెపల్లి వద్ద ఉన్న నీటి మట్టం 94.8 మీటర్లు. 119 ఎఫ్ఆర్ఎల్ ఉన్న అన్నారం బరాజ్‌లో 10.87 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు.. ఇక్కడి నుంచి సరస్వతీ పంప్‌హౌస్ ద్వారా 12 మోటర్లతో ఎత్తిపోసిన నీళ్లు, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్‌కు చేరుకుంటయ్. 130 ఎఫ్ఆర్ఎల్ ఉన్న సుందిళ్ల బరాజ్‌లో 8.83 టీఎంసీల నీటిని నిల్వచేయొచ్చు. ఇక్కడి నుంచి పార్వతీ పంప్ హౌస్ ద్వారా నీళ్లను 14 మోటర్లతో లిఫ్ట్ చేసి 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోయవచ్చు. అక్కడి నుంచి పంపుహౌస్‌లు, టన్నెళ్లు, గ్రావిటీ కాలువల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని తరలించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించవచ్చు’ అని వివరించారు.
గోదావరి 500 ఏండ్ల వరదను స్టడీచేసి కాళేశ్వరం కట్టిండ్రు
‘తెలంగాణ భౌగోళికంగా ఎలా ఉంటందంటే ఒక గుడిసె తీరు ఉంటది. ఒక ఒర్సుకేలి (తెలంగాణకు ఓ పక్క కింద నుంచి) 80 మీటర్ల నుంచి 100 మీటర్ల ఎత్తులో గోదావరి పోతది. ఇంకో ఒర్సుకేలి (తెలంగాణకు మరోవైపు కింద నుంచి) కృష్ణానది 120 మీటర్ల నుంచి 130 మీటర్ల ఎత్తులో పోతది. అక్కడి నుంచి పైకి నీళ్లు తీసుకుపోవాలి. భూములన్నీ పైనున్నయ్. నదులు కిందున్నయ్. అందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసిండ్రు’ అని కేటీఆర్ వెల్లడించారు. ‘ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏందంటే ఇందులోంచి నీరు మూడు రకాలుగా తీసుకోవచ్చు. మొత్తం కాళేశ్వరం అంటే ఒక్క బరాజే కాదు. ఒక రిజర్వాయరే కాదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల సహా 15 రిజర్వాయర్లు, 19 పంప్‌హౌస్‌లు, 21 సబ్ స్టేషన్లు, వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు, వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు’ అని వివరించారు. ‘మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో వంద భాగాలుంటే అందులో ఒకటి మేడిగడ్డ బరాజ్.. అందులో 25 పిల్లర్లు ఉంటే రెండు పిల్లర్లు కుంగిన మాట వాస్తవం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పని ఏందంటే.. మేడిగడ్డ బరాజ్‌కు, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు పద్దెనిమిదిన్నర కిలోమీటర్ల అంతరం ఉన్నది. అందులో 17 మోటర్లు మంచిగనే ఉన్నయ్.
అక్కడి నుంచి రోజుకు 3 టీఎంసీల నీరు ఎత్తిపోయొచ్చు. మూడు టీఎంసీల నీరు అంటే హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో పట్టేది 1టీఎంసీ. అంటే రోజుకు మూడు హుస్సేన్సాగర్లలో పట్టే నీళ్లు ఇక్కడి నుంచి ఎత్తిపోసేందుకు అద్భుతమైన బాహుబలి మోటర్లను కేసీఆర్ పెట్టించిండ్రు. ఈ మాట నేనో, మీరో చెప్పడం లేదు. రిటైర్డ్ ఇంజినీర్లు చెప్తున్నరు. సర్వీస్‌లో ఉన్న ఇంజినీర్లు చెప్తున్న రు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి 94.1/2 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నయ్. అక్కడ 93.1/2 మీటర్లు దాటి నీళ్లుంటే పంపులు చాల్ చేయొచ్చు. మేడిగడ్డ బరాజ్‌ను ముట్టకుండా, అక్కడ ఏం డేంజర్ లే కుండా నీళ్లు ఎత్తిపోయచ్చు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ పంప్‌హౌస్‌లు సమాంతరంగా సమన్వయంతో నడిపిస్తే బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఎత్తిపోయవచ్చు. ఈ మాట నేను చెప్తలేను. రిటైర్డ్ ఇంజినీర్ల బృందం.. శ్యామ్ ప్రసాద్‌రెడ్డి బృందం చెప్తున్నది. ఇవాళ ఎల్లంపల్లిలో ఏడు టీఎంసీల నీళ్లే ఉన్నయ్. కాళేశ్వరం గొప్పతనం ఏందంటే పైన మహారాష్ర్టలో బాగా వర్షం పడితే ఎస్సారెస్పీ మొత్తం నిండుతది. నిండి రెండు దిక్కుల పొంగుతది. ఇటు కడెం మీద నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వస్తయ్. ఇంకోవైపు వరద కాలువ నుంచి డైరెక్ట్ మిడ్ మానేరుకు నీళ్లు వస్తయ్.. బాగా వర్షాలు పడితేనే వస్తయ్. ఒకవేళ మోస్తరు వర్షం పడితే అప్పుడు కూడా ఎల్లంపల్లి నుంచి పైకి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ వర్షం పడితే ప్లడ్ ఫ్లో నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చు. మామూలుగా వర్షం పడితే ఎల్లంపల్లి నుంచి తీసుకోవచ్చు. వర్షం లేక కరువు ఉంటే.. దానికి పరిష్కారమే కాళేశ్వరం దగ్గర కన్నెపల్లి పంపులు. వాటిని చాల్ చేసి నీళ్లు ఎత్తిపోస్తే కరువులోనూ ఇబ్బందులు ఉండవు. అందుకోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. దాని గొప్పతనం ఏందంటే ఏ పరిస్థితుల్లోనైనా తెలంగాణకు కరువు రాకుండా 500 సంవత్సరాల గోదావరి ప్రవాహాన్ని మొత్తం స్టడీ చేసి ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకోవచ్చని దేవులాడి అక్కడ కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టిండ్రు’ అని రైతులకు వివరించారు.
దొంగనాటకం బయటపడుతుందనే
‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చి 32 నెలలైంది. ఇప్పటికీ మేడిగడ్డలో పిల్లర్లకు రిపేర్ చేస్తలేరు. ముఖ్యమంత్రి మాట్లాడేది ఫాల్తు మాట.. లక్ష కోట్లు కొట్టుకుపోయినయ్ అంటడు. వాస్తవం ఏంది? రెండు పిల్లర్లు కుంగినయ్. ఆ బ్లాక్ ఒక్కటి రిపేర్ చేయొచ్చు. మేడిగడ్డ బరాజ్ కడితే రూ.4 వేల కోట్లు అయినయ్. ఇప్పుడు పిల్లర్లు కుంగిన బ్లాక్‌కు రిపేర్ చేయాలంటే రూ.400 కోట్లు కావాలి. ఆ రూ.400 కోట్లు కూడా ఎల్ అండ్ టీ సంస్థ పెట్టుకుంటా అన్నది. మేమే కడుతం. మేమే పెడుతం. మీ పైసలు వద్దు అని ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి వినలే.. దొంగనాటకం ఎక్కడ బయటపడుతుందోనని ఎల్ అండ్ టీ కంపెనీని బెదిరించి ఎల్లగొట్టిండు.
ఒట్లు.. తిట్లు తప్ప ఏం తెల్వదు
‘కన్నెపల్లి దగ్గర నీళ్లు ఎక్కడున్నయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటే మేమందరం పోయినం.. పోయి చూపెట్టినం. నీళ్లు లేవా? ఇక్కడ కనపడుతా లేవా? రోజుకు 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నయ్. రోజుకు మూడు టీఎంసీలు పైకి ఎత్తిపోయొచ్చు. ఎందుకు ఎత్తుతలేవు? కింద మీ గురువు చంద్రబాబు ఎత్తుతున్నరు. నీకేం పుట్టింది రోగం అంటే.. ఉలుకూపలుకూ లేదు. ఒక రోజేమో నీరు లేదంటడు.. రెండో రోజేమో ఇంకో కథ చెప్పిండు.. ఎన్డీఎస్ఏ వాడు చెప్పిండు నేను ఎత్తిపొయ్య అంటడు. నేను అది కూడా అడిగిన. కన్నెపల్లి దగ్గర నీళ్లు తీసుకోవద్దని ఎన్డీఎస్ఏ ఎక్కడైనా చెప్పిందా? పైన అన్నారం మంచిగనే ఉన్నది. సుందిళ్ల మంచిగనే ఉన్నది. నీ ప్రభుత్వం వచ్చినంకనే అక్కడ గ్రౌటింగ్ వర్క్ కూడా చేసిండ్రు. రెండు బరాజ్‌లు మంచిగనే ఉన్నయని ఇంజినీర్లు చెప్తున్నరు. ఏం రోగమయ్యా నీకు? గలగలా గోదావరి ఏపీకి తరలిపోతా ఉన్నది. అక్కడ పట్టిసీమ నడుస్తనే ఉన్నది. ‘రైతులు చనిపోయినా సోయిలేదు. పంటలు కొనాలని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా బుద్ధి రాలేదు. సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు. రేవంత్‌రెడ్డి చెప్తున్నడు కదా? పొలాల మీద రక్తం చల్లుమంటున్నడు కదా? అని మేం రక్తం చల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణను రెచ్చగొడితే తరిమికొడుతరు
ఈ దుర్మార్గ, రాక్షస ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘పోరాటం ముగిసిపోలేదని ఢిల్లీలో చూశారు.. ఎవరు పిలిచారు ఆ పిల్లల్ని? ఢిల్లీలో వేలమంది పిల్లలు నిన్న పార్లమెంట్ ముందు ఏ రకంగా ప్రభుత్వాన్ని గడగడ వణికించిర్రో మీరే చూసిండ్రు. అదే తరహాలో ఈ కాంగ్రెస్, బీజేపీని తరిమితరిమి కొట్టేదాకా మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో మా తమ్ముళ్లు, రైతులు తిరగబడితే ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మె ల్సీ కూడా ఊర్లల్లో తిరుగలేరు’ అని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జోగురామన్న, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, నాయకులు జాన్సన్ నాయక్, రామ్మోహన్రావు, విజిత్‌రావు, జాన్సన్ నాయక్, కౌశిక్‌హరి,నారదాసు లక్ష్మణ్‌రావు, నల్మా సు కాంతయ్య, టీబీజీకేఎస్ నాయకుడు రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
డిక్లరేషన్ వీడియో.. ఏదీ రాలేదన్న రైతులు
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఆనాడు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు? ఏమేం కల్లబొల్లి కబుర్లు చెప్పిండో మీరే చూడుండ్రి’ అని వీడియోను కేటీఆర్ ప్రదర్శించారు. ‘జైసే హీ కాంగ్రెస్ పార్టీకి యహా సర్కార్ బనేగీ.. వైసే దోలాక్ రూపాయకే ఖర్చా మాఫ్ హోగా.. ఔర్ ఆప్కో సహీ ఎంఎస్పీ మిలీ షురూ హో జాయేగీ. ప్రతి ఎకర్‌కో పంద్రా హజార్ (15,000) డైరెక్ట్ బెనిఫిట్ హమ్ కిసాన్ కో దేనే జారహే హై.. ఏ సిరఫ్ ఏక్ డిక్లరేషన్ నహీ హై.. ఏ కిసాన్ కే లియే కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ హై.. ఏ ఖోఖ్లే శబ్ద్ నహీ హై.. ప్యాడీ కో హమ్ సాడే దో హజార్ (2,500) మే ఖరీదేంగే’ అని రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను చూపించారు. అనంతరం రేవంత్‌రెడ్డి అదే సభలో ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండో డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి, భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికీ రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తాం.
ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమిలేని రైతు కూలీలకు ప్రతి ఏడాదీ రూ.12,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి, చివరి గింజ వరకూ కాం గ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది’ అని ఇచ్చిన హామీ ల వీడియోను ప్లే చేసి చూపించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. నేను అడుగుతా.. మీరే సమాధానాలు చెప్పాలి’ అని సదస్సుకు వచ్చిన రైతులు, నాయకులను కోరారు. ‘రైతు బంధు రూ.15,000 పెంచుతామన్నరు.. ఇచ్చిండ్రా? (రైతులు : లేదూ!) కొద్దిగా గట్టిగా చెప్పాలె ఇచ్చిం డ్రా, లేదా? (రైతులు: లేదూ!) రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నడు, చేసిండా? (రైతులు: లేదూ!) కౌలు రైతులకు రైతుబంధు ఇస్తానన్నడు, ఇచ్చిండా? (రైతులు : లేదూ!) రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇస్తానన్నాడు, ఇచ్చిండా? (రైతు లు: లేదూ!) పత్తి, వరి, మిర్చి అన్నింటికీ బోనస్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? (రైతులు: లేదూ!) చివరి గింజ దాకా కొంటానన్నాడు, కొంటుండా? (రైతులు: లేదూ!) 24 గంటల కరెంట్ ఇస్తుండా? (రైతులు: లేదూ!)అని అడిగారు.
కేసీఆర్ పాలనలో 73వేల కోట్ల రైతుబంధు
కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్లలో బ్రహ్మాండంగా రైతులకు కరెంట్ ఇచ్చి, రూ.73 వేల కోట్లను రైతుబంధు రూపంలో ఇచ్చి, నీళ్లిచ్చి, చెరువులు బాగు చేసి, రైతు బీమా పెట్టి, పంటలు కొని దేశంలో పంజాబ్‌ను తలదన్నేలా తెలంగాణ రైతన్నను నిలబెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టిపోతే రేవంత్‌రెడ్డికి ఇష్టంలేక, ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తదోననే భయంతో నీళ్లెత్తడం లేదని పేర్కొన్నారు. ‘కాళేశ్వరం మంచిగనే ఉన్నది.. కన్నెపల్లి మోటర్లు మంచిగనే ఉన్నయ్.. నీళ్లు మంచిగనే పోతున్నయ్.. పంపులు చాల్ చేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పైకి ఎల్లంపల్లి దాకా వస్తయ్. అక్కడి దాకా నీళ్లు వస్తే నిన్నటి దాకా నేను చెప్పినవి ఫాల్తు మాటలని ప్రజలు అంటరన్న భయంతో ఇవాళ రేవంత్‌రెడ్డి పంపుల్ చాల్ చేస్తలేడు. ఎక్కడ తన దొంగనాటకం బయటడుతదోననే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేస్తలేడు’ అని ఎద్దేవాచేశారు.
సచ్చినా పట్టించుకోలే
మాది లక్షెట్టిపేట మండలం గంపలపెల్లి. ఐదెకరాల్లో వరి పండించిన. చేతికొచ్చిన వడ్లను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రానికి తీస్కపోయినం. 20 రోజులకు కాంటా పెట్టిండ్రు. కాంటా పెట్టిన వడ్లను రైస్‌మిల్లుకు తరలించకుండా జాప్యం చేసిండ్రు. ఆ నిర్లక్ష్యం వల్లే నా భర్త నాగరాజు, 24 ఏండ్ల కొడుకు అభిరామ్ సచ్చిపోయిండ్రు. వాన కొట్టింది. ఈదురుగాలులు వస్తే పరదాలు లేచిపోయినయ్. వడ్లు నానుతయని ఇంటి నుంచి పోయిండ్రు. గోడ కూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిండ్రు. నా కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. తూకం వేసిన ధాన్యం తరలించి ఉంటే నా భర్త, కొడుకు ప్రాణాలు దక్కేవి. అప్పుడు న్యాయం కావాలని కోరుతూ జీవన్‌రెడ్డి సారు, దివాకర్‌రావు సారుతో కలిసి రోడ్డెక్కినం. అయినా సర్కార్ పట్టించుకోలేదు. కేసీఆర్ సారు అండతో మాకిప్పుడు న్యాయం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చేసిన సాయానికి రుణపడి ఉంటం.
-తనుగుల మమత, గంపలపెల్లి
కేటీఆర్ సార్ అండగా నిలిచిండు
మాది లక్షెటిపేట మండలం కొత్తూరు. నా కొడుకు గుండారపు వెంకటేశ్ (23) ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సచ్చిపోయిండు. చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రంలో పోసినం. ఈదురుగాలుల వర్షం నుంచి కాపాడుకోవడం కోసం కల్లానికి వెళ్లినం. వర్షం భారీగా కురుస్తుండటంతో పక్కనున్న షెడ్డులోకి నా కొడుకు పోయిండు. షెడ్డు గోడ కూలీ నా కొడుకు అక్కడికక్కడే సచ్చిపోయిండు. న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కినం. 8 గంటల రాస్తారోకో చేసినం. అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు రూపాయి సాయం అందలేదు. ఈ రోజు కేటీఆర్ సార్ చేసిన సాయాన్ని ఎన్నటికీ మర్చిపోం.-గుండారపు సత్తయ్య, కొత్తూర్
ఒక్క రైతులకే కాదు..
‘ఒక్క రైతులకే కాదు, అన్ని వర్గాలకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిండు. ‘పిల్లలకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా’ అని రాహుల్ గాంధీ డైలాగులు కొడితే.. హైదరాబాద్‌లో వాళ్లెక్కడైతే మీటింగ్ పెట్టిర్రో, మేము అక్కడే నిన్నగాక మొన్న ‘యువ సంగ్రామ సదస్సు’ పెట్టినం. వరంగల్‌లో వాళ్లెక్కడైతే మీటింగ్ పెట్టిర్రో అక్కడే సదస్సు పెట్టి రైతులను అడిగినం. నిన్న కాక మొన్న పిల్లలను అడిగినం. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినయా? అని అడిగితే వాళ్లు ఎట్లా మాట్లాడిండ్రో మీరు చూసే ఉంటరు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడిండ్రో కూడా మీరు చూసే ఉంటరు. చూసిండ్రా, లేదా? (రైతులు: చూసినం!) ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున, పొట్టుపొట్టు కొట్టేటట్టున్నరు. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇవాళ రాష్ట్రంల. నేను అందుకే అంటా ఉన్నా.. ఒకరిని కాదు.. ఇద్దర్ని కాదు.. రాష్ట్రంలో అందర్నీ ముంచిండు, అందర్నీ మోసం చేసిండు. ముసలోళ్లను మోసం చేసిండు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
‘కేసీఆర్ ముసలమ్మకో.. ముసలయ్యకో రూ.2,000 పెన్షన్ ఇస్తుండు. అక్కా! నవంబర్‌లో తీసుకుంటే రూ.2,000.. అక్కా! డిసెంబర్లో అయితే రూ.4,000’ అన్నడా లేదా ? నవంబర్‌లో రూ.2,000, డిసెంబర్లో రూ.4,000… ఇంటికాడ బిచ్చపోళ్లు అడుక్కుంటరు చూడు, ’అక్కా అమ్మా’ అని, అట్లా అడుక్కున్నడు. అడుక్కుంటే నిజమేనేమో అని నమ్మి ఓట్లేసిండ్రు. అత్తకు రూ.4,000, కోడలికి రూ.2,500 అన్నడు, ఇచ్చిండా?’ అని ప్రశ్నించగా సదస్సుకు వచ్చినవారు ‘లేదూ!’ అంటూ బదులిచ్చారు. రూ.4,000, రూ.2,500 కోసం అత్తాకోడళ్ల పంచాయితీలు మొదలయ్యాయని కేటీఆర్ చెప్పారు. ‘ఏమాయె మరి నిరుద్యోగ భృతి? పిల్లలకు చెప్పితివి 40 లక్షల మందికి నెలకు రూ.4,000 చొప్పున ఇస్తామని, ఏమాయె నాయనా? అంటే, చడీచప్పుడు లేదు. రైతులకు రూ.15,000 ఏమాయె అంటే మాట్లాడడు. కౌలు రైతుల సంగతి ఏందయ్యా? అంటే మాట్లాడడు. రైతు కూలీలు, పొలంలేనోళ్ల సంగతి ఏంది, వాళ్లకు కూడా చెప్పితివి కదా నెలకు రూ.1,000 అని, వాళ్ల సంగతి ఏందంటే ఊ లేదు కై లేదు’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు.
కేసీఆర్ వస్తేనే మంచిరోజులు
‘దగాకోర్ కాంగ్రెస్‌ను ఉరికించి కొడితే తప్ప మంచిర్యాలలో మళ్లీ రైతుబంధు రాదు. గుర్తుపెట్టుకోండి.. తెలంగాణలో మళ్లీ రైతన్న కండ్లల్లో ఆనందం చూడాలంటే కేసీఆర్ మళ్లీ వస్తే తప్ప రాష్ట్రంలో మంచి రోజులు రావు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘30 నెలలు గోస పడ్డం.. ఇక మిగిలింది 29 నెలలే! ఈ కాంగ్రెస్ సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ దాకా చూసినం. ఇంటర్వెల్ వరకే తెలిసిపోయింది. సినిమాలో ఏం లేదు. తిట్లు, బూతులు తప్ప! వీళ్ల దగ్గర అయ్యేదేం లేదు. సెకండ్ హాఫ్ కూడా వీళ్లతోని ఏం కాదు’ అని ఎద్దేవాచేశారు. ‘మంచిర్యాల ఎమ్మెల్యేకు ఎట్లయితే కేసులు పెట్టుడు తెలుసో, రేవంత్‌రెడ్డికి కూడా అదే తెలుసు. ఇన్ని రోజులు కష్టపడ్డ మా తమ్ముళ్లు, చెల్లెళ్లకు నేను ఒక్కటే మాట ఇస్తున్నా.. మంచిర్యాలలో మిమ్మల్ని ఎవరెవరైతే సతాయిస్తున్నారో పేర్లు రాసి పెట్టుకోండ్రి’ అని సూచించారు. ‘ఎవ్వర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు! నేను కేసీఆర్‌లా మంచోడిని కాదు’ అని హెచ్చరించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడే మళ్లీ ఈ రాష్ర్టానికి నాయకత్వం వహిస్తాడని స్పష్టంచేశారు.
ఏం చేసినవ్? అని నేను అడిగితే.. ‘ఏ జాతి నీది? నీదేం జాతి?’ అని చిల్లర మాటలు మాట్లాడుతుండు. నేన్జెప్తున్న రేవంత్‌రెడ్డీ.. ఏ జాతోగూడ నీకు చెప్పాల్సిన టైమ్ వచ్చింది. ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుపెట్టిన పోరంబోకు జాతైదే మాదికాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతైదే మాదికాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూల్చేందుకు యాభై లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్సేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చాజాతైదే మాదికాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద వందల కేసులు వేసి ఆపాలని చూసిన దివానాగాళ్ల బ్యాచైతే మాదికాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజలను రెచ్చగొట్టి బతికిన చిల్లరజాతి మాదికాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అథమ జాతి మాదికాదు. నీళ్లున్నా.. ఇచ్చే వ్యవస్థ ఉన్నా.. జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్‌రెడ్డీ. ఉద్యోగాలడిగితే ఎండ్రిన్ తాగుమని, బాయిల దుంకుమని, నీళ్లడిగితే రక్తం చల్లుకొమ్మని రాక్షస మాటలు మాట్లడే జాతి మాదికాదు. అన్నీ బాగుచేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస, నికృష్ట జాతి మాదికాదు. తెలంగాణలో ఉన్నయ్ రెండేరెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి.. రెండోది రాష్ర్టానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో.. ఎవడు తెలంగాణను ఇయ్యాల వంచిస్తున్నడో.. ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నడో అందరికీ తెలుసు. -కేటీఆర్
రేవంత్‌రెడ్డి రాక్షసపాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నరు. పంటలు కొనరు.. యూరియా ఇయ్యరు.. సంచులు ఇయ్యరు.. సుత్లీలు ఇయ్యరు.. పొరపాటున పంట కొంటే మద్దతు ధర ఇయ్యరు. ఇస్తామన్న బోనస్ ఇయ్యరు. బోనస్ బోగస్ చేసిండ్రు.. యూరియా, విత్తనాలు, కరెంట్, సాగునీటి సమస్యలు రైతులను చుట్టుముట్టినయ్. కండ్ల ముందే గోదావరి పారుతున్నది. పై నుంచి ప్రాణహిత బ్రహ్మాండంగా పరవళ్లు తొక్కుతున్నది. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు ఉన్నది. పరిపాలించే పాలకుడికి సోయిలేనితనంతో ఇవాళ కరువుకు పరిష్కారంలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైంది. -కేటీఆర్
మేడిగడ్డ బరాజ్ కడితే రూ.4,000 వేల కోట్లు అయ్యింది. ఇప్పుడు పిల్లర్లు కుంగిన ఆ బ్లాక్ సెవెన్ ఏదైతే ఉన్నదో అది రిపేర్ చేయాలంటే రూ.400 కోట్లు కావాలె. ఆ రూ.400 కోట్లు కూడా మనకు ప్రభుత్వ పైసలు అవసరం లేదు. ఎల్ అండ్ టీ కంపెనీ ‘మేమే కడుతం. మేమే పెడుతం. మీ పైసలే వద్దు’ అని ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి వినలే.. ఎక్కడ దొంగనాటకం బయటపడుతుందోనని భయపడి ఆ ఎల్అండ్టీ కంపెనీని బెదిరించి ఎల్లగొట్టిండు. -కేటీఆర్

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు సదస్సు’కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించిన రైతుసదస్సు అనంతరం.. రంగంపేటలోని దళితబంధు లబ్ధిదారు ఇంటికి వెళ్లి చాయ్ తాగుతూ.. దాసరి రవి కుటుంబసభ్యులతో ముచ్చటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నా భర్త చనిపోయిండు. ప్రభుత్వం సాయం చేస్తదని ఆఫీసర్లు చెప్పిండ్రు. ఇంతవరకు రూపాయి రాలేదు. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నడు. ఇప్పుడు అదే మనసుతో కేటీఆర్‌ను పంపి రూ.5 లక్షలు ఇప్పించిండు. సార్ సాయానికి ఎంతో రుణపడి ఉన్నం. – నెల్కి సత్తవ్వ, ముత్యంపేట

లక్షెట్టిపేటలో రైతు గుంపుల వెంకటేశ్ కుటుంబానికి రూ.5లక్షల చెక్కు అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, బాల్కసుమన్, కోరుకంటి, దుర్గం చిన్నయ్య

బాధిత కుటుంబసభ్యురాలు తనుగుల మమతకు చెక్కును అందజేస్తున్న కేటీఆర్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
ఉద్యమకారుడి ఇంట్లో కేటీఆర్ భోజనం

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన ‘రైతు సదస్సు’కు హాజరైన కేటీఆర్, రంగపేటలోని దళిత నేత, తెలంగాణ ఉద్యమ కారుడు చిప్పకుర్తి నారాయణ ఇంటికి వెళ్లి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం చాయ్ తాగి దళితబంధు లబ్ధిదారులతో మాట్లాడారు. దళితులకు న్యాయం చేయాలనే కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు రూ.12 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. వృద్ధులతో మాట్లాడుతూ పెన్షన్ వస్తున్నదా? లేదా? అడిగి తెలుసుకున్నారు.