హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో పరిపాలనను బలోపేతం చేయడం, మెరుగైన సేవలు అందించడం, డిజిటల్ పాలనను ప్రోత్సహించేందుకు పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ)ను అమలు చేస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. పథకం కింద ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతోపాటు గ్రామ పంచాయతీ భవనాలు, కంప్యూటర్లు, సదుపాయాల కల్పనకు రూ.7,746 కోట్లకుపైగా విడుదల చేసినట్టు తెలిపింది. మంగళవారం లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ.. ఆర్జీఎస్ఏ కింద తెలంగాణకు 2014 నుంచి ఇప్పటివరకు రూ.135.29 కోట్లు విడుదల చేశామని, అందులో రూ.134.77 కోట్లు వినియోగమయ్యాయని పేర్కొన్నది. ఇన్సెంటివైజేషన్ ఆఫ్ పంచాయత్స్ పథకం కింద విడుదల చేసిన రూ.23.87 కోట్లలో రూ.11.37 కోట్లను మాత్రమే వినియోగించినట్టు స్పష్టం చేసింది.