పోరాటాల గడ్డ జగిత్యాల జనసంద్రమైంది. సోమవారం మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అంచనాలకు మించి జనం రావడంతో జిల్లాకేంద్రం కిక్కిరిసిపోయింది. సాయంత్రం 5గంటల వరకే సభాస్థలి నిండిపోగా, జగిత్యాలకు వచ్చే దారుల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం 7గంటలకు సభా వేదికపైకి చేరుకోగా, అప్పటికే సభికులు ఒక్కసారిగా ‘జై కేసీఆర్’ అంటూ జైకొట్టారు.
కేసీఆర్ ఆద్యంతం తన స్పీచ్‌తో కట్టిపడేశారు. తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటం, రాష్ట్ర ఆవిర్భావం, ఆ తర్వాత పదేళ్లలో తెలంగాణను ప్రగతి పథంలో నిలిపిన విధానం, తద్వారా సాధించిన ప్రగతి, సబ్బండ వర్గాల సంక్షేమాన్ని వివరిస్తూనే.. నేటి సర్కారు పాలన తీరును ఎండగట్టారు. రెండున్నరేళ్లలో తెలంగాణ తిరోగమంలో పయనించడం, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం, హామీల అమలులో వైఫల్యాలు వంటి అంశాలను కండ్లకు కట్టినట్టు వివరించారు. తిరిగి తెలంగాణ బాగు పడాలంటే పునరేకీకరణ కోసం యజ్ఞం చేయాలని పిలుపు నివ్వగా, సభికులు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఇది ఇలా ఉంటే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జీవన్‌రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని స్వాగతించారు. మొత్తంగా సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ప్రతిపక్షాల గుండెళ్లో రెళ్లు పరుగెత్తగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొన్నది.

Kcr
కరీంనగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ): జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అధ్యక్షతన సోమవారం మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ సభకు లక్షకుపైగా తరలివచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి స్వచ్ఛందంగా కదిలారు. మధ్యాహ్నం 5గంటల వరకే జగిత్యాల కిక్కిరిసిపోయింది. జిల్లాకేంద్రానికి నాలుగు వైపులా ట్రాఫిక్ స్తంభించింది.
సభాస్థలి కిక్కిరిసిపోయింది. దీంతో జనం సభా ప్రాంగణానికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. స్టేడియం చుట్టూ నాలుగువైపులా కిలోమీటర్‌పైగా పొడువునా కిక్కిరిసిపోయారు. ఎక్కడిక్కడే రోడ్లపై బారులు తీరారు. అయితే సభా స్థలి చుట్టుతోపాటు ప్రధానచౌరస్తాల్లో కేసీఆర్ స్పీచ్ ప్రజలు వినేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో మెజార్టీ ప్రజలు అక్కడే ఉండి విన్నారు. అంతేకాదు, కేసీఆర్ దాదాపు యాభై నిమిషాలు మాట్లాడగా, ప్రతి విషయాన్నీ చివరి వరకు విన్నారు. ప్రసంగం పూర్తిగా ముగిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే సభాస్థలి వద్ద కూడా ఇదే సీన్ కనిపించింది. ప్రసంగం చివరి వరకూ ఆసక్తిగా విన్నారు.

Kcr
ఆకట్టుకున్న కేసీఆర్ ప్రసంగం
జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకున్నది. యాభై నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడినా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వినడం కనిపించింది. తన దైన శైలిలో మాట్లాడుతూ.. సందర్భాన్ని బట్టి సామెతలు చెబుతూ.. చలోక్తులు విసురుతూ.. నవ్విస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తాను చెప్పే విషయాలు అందరూ బాగా వినాలంటూ మొదలు పెట్టిన కేసీఆర్.. గత అసెంబ్లీ సమయంలో మోసపోతే గోస పడుతామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడు జరుగుతున్నది ఏమిటీ అంటూ ప్రశ్నించగా.. అందరం గోస పడుతున్నామంటూ సభికులు వాపోయారు. ఇదే సమయంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఆనాడు శాసనసభ సాక్షిగా తెలంగాణ అనే పదం వాడినందుకు ఎదురైన అవమానం, వాటిన్నింటినీ ఛేదించి తెలంగాణ సాధన కోసం ఎదురొడ్డి చేసిన పోరాటం, ఆ క్రమంలో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేయడంతో ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితి, ఆ సమయంలో సబ్బండ వర్గాలు అందించిన సహకారం చివరకు తెలంగాణ సాధించిన తీరు, ఆ తర్వాత పదేళ్లు సాగిన పాలన, ఆర్థిక పరంగా ఆరంభంలో ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించి తెలంగాణను సుభిక్షంగా మార్చిన తీరు, అన్నింటిలో నవంబర్ వన్ చేయడానికి పడిన కష్టం వంటి అంశాలను కులంకుషంగా కండ్లకు కట్టినట్టు వివరించారు.
తెలంగాణ తొలి పదేళ్లలో సాధించిన ప్రగతిలో మిషన్ కాకతీయ, తొలగిన కరెంటు కష్టాలు, రైతు బంధు, పంటల కొనుగోళ్లు, గొర్రెల పంపిణీ, నేతన్నలకు సహకారం, ఉద్యోగులకు పీఆర్సీ, సబ్బండవర్గాలకు కల్పించిన సంక్షేమ సౌకర్యాలు గురించి వివరించారు. ఇదే సమయంలో గడిచిన రెండేన్నరేళ్లలో తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం, దిగజారిన ఆర్థిక పరిస్థితి, ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు, అమలు చేయని తీరు, ప్రాజెక్టుల పనుల్లో మందగమనం, కరెంటు కోతలు, రైతులు గోసలు, ముఖ్యంగా యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు, పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన డబ్బుల కోసం చేస్తున్న పోరాటం, హైడ్రాతో పేదల ఇండ్లు కూలగొడుతున్న తీరును వివరించారు. ప్రతి అంశాన్నీ వివరిస్తుండగా.. సభికులు ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నప్పుడు చేతులెత్తి మద్దతు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ రావాలని చెప్పినప్పుడు మద్దతు ప్రకటించారు.

శ్రేణుల్లో నూతనోత్సాహం
చాలా కాలం తర్వాత ఉమ్మడి జిల్లాలో అందులో జగిత్యాల కేంద్రంగా బీఆర్ఎస్ బహిరంగ సభ జరగడం అది కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. కేసీఆర్ జగిత్యాలకు చేరుకున్నప్పటి నుంచి అడుగడుగునా అధినేతకు స్వాగతం చెప్పేందుకు పోటీ పడిన శ్రేణులు.. సభ జరిగిన తీరు, అంచనాలకు మించి జనం రావడం, ఇదే సమయంలో కేసీఆర్ ప్రసంగం వంటివి తమ పార్టీ బలోపేతానికి బాగా పనిచేస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడం, ఆయనను వెంటనే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రకటించడం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరు చేయడంతోపాటు తెలంగాణ భవిష్యత్ కోసం పునరేకీకరణ యజ్ఞం జరగాలంటూ కేసీఆర్ పిలుపు నివ్వడం ఫుల్ జోష్ నింపింది.
పిల్లి శాపానికి ఉట్టి తెగుతదా.
పెట్టిన పొయ్యిలా రాష్ర్టాన్ని అప్పగిస్తే ఆగం చేసిన్రు. పొద్దున లేత్తే కేసీఆర్ చావాలె అని మాట్లాడుతున్నరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ కొడుకా.. నువ్వు ఏం అనుకుంటున్నవో ఏమో! పిల్లి శాపానికి ఉట్టి తెగుతదా! మరి ఈ వెదవలు కేసీఆర్ చావాలె అంటే కేసీఆర్ సత్తడా. మీ దీవెనలు, ఆశీర్వాదం ఉంటే నాకేం కాదు.
యాప్‌లు పట్టుకొని తిరిగితే కాళ్లకు వాపులత్తన్నయ్
రెండున్నరేండ్లలో ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్క గొప్ప స్కీం లేదు. ఎవరిని మాట్లాడించినా గొడగొడ ఏడుస్తున్నరు. మా చెప్పుతో మేమే కొట్టుకున్నం అని బాధపడుతున్నరు. ఈ ప్రభుత్వానికి కనీసం యూరియా బస్తాలు ఇవ్వడం చేతనైతలేదు. బస్తాల కోసం యాప్ పెట్టినం అంటున్నరు. దుకాన్ల లేకపోతే యాప్లకెళ్లి వస్తయా..? దమ్ముంటే బస్తాలు తెచ్చిపెట్టాలె ఇయ్యాలె. రైతులు ఆ యాప్‌లు పట్టుకొని తిరిగితే కాళ్లకు వాపులు వస్తున్నయి. బస్తాలు మాత్రం దొరుకతలేవు. ఇది అసమర్థమైన ప్రభుత్వం.
హోరెత్తిన ‘కేసీఆర్ రావాలి.. రేవంత్పోవాలి’ నినాదం
జీవన్‌రెడ్డి చేసిన ప్రసంగంలో ప్రధానంగా ‘కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి’ నినాదం ఎత్తుకోవడంతో సభ మొత్తం మారుమోగిపోయింది. ఈ నినాదాన్ని ముందుగా జీవన్‌రెడ్డి చెప్పగా, ఆదే అంశాన్ని కేసీఆర్ చెప్పడంతో నలుదిశలా హోరెత్తింది. ఇదే సమయంలో తెలంగాణ పునరేకీకరణకు ఓ యజ్ఞంలా పనిచేయాలంటూ కేసీఆర్ పిలుపు నివ్వగా.. సకలజనం సంఘీభావం ప్రకటించింది.
మూడో కిస్తీ కోసం మళ్లో సభ పెట్టల్నా
ఓట్లు ఏసేటప్పుడు నేను చిలుకకు చెప్పినట్టు చెప్పిన. ఉల్టాపల్టా వేస్తే దెబ్బతింటరని చెప్పిన. నేను చెప్పినట్టే రైతు బంధుకు రాంరాం. దళితబంధుకు జై భీమ్ అంటున్నరు. ఇయ్యాల జీవన్‌రెడ్డి చెప్పిండు. కాంగ్రెసోళ్లు కాటారంలో సభ పెట్టిన్రట. ఆడ పైసలేస్తరట. ఒక్కతాపకు వేసే రైతుబంధు రెండు నెలలకో ఒకరానికి ఇస్తున్నరట. అంటే మూడో కిస్తీ రావాలంటే కేసీఆర్ మళ్లో సభ పెట్టాలె. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టింగుటింగు మంటూ ఫోన్లకు మెసేజ్ వస్తే టంగుటంగుమంటూ బ్యాంకులకు పోయి తెచ్చుకునేది. ఇప్పుడు ఏం రోగం అచ్చింది. ఎందుకు ఇస్తలేరు?
రాష్ర్టానికి పట్టిన శని, పీడ విరగడ కావాలె

Jeevanreddy
జగిత్యాల గడ్డ.. నేను ఏదో ఆశించి రావడం లేదు. నేను అన్నీ చూసిన. చూడంది ఏదీ లేదు. ఒక్కటే ఒక్కటి.. రాష్ర్టానికి పట్టిన శని, పీడ విరగడ కావాలె. ఆ శని, పీడ విరగడ కావాలంటే కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యం. ఇంతకాలం నాకు అండగా నిలిచిన మీకు నా శేష జీవితంలో కూడా సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేనిది. ఈ రోజు నా సుదీర్ఘ ప్రజా జీవితం ఓ మలుపుగా భావిస్తున్న. బీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కల్పించిన కేసీఆర్‌కు నా ధన్యవాదాలు. ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక్కడిగా కదిలిండు.
తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి, ఉద్యమించి రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిండు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిండు. కానీ, ఇయాలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తదని అనుకున్నం. అది తిరోగమనం పడుతున్నది. మళ్లీ తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం కావాలంటే కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమైతది. మీరు ఎక్కడైనా.. ఏ పల్లెకైనా వెళ్లండి ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం వినిపిస్తున్నది. ‘కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి’ అంటే ప్రతి గుండెల్లో ప్రతి నినాదం వినిపిస్తున్నది. మళ్లీ ఇదే సభ నుంచి చెబుతున్న. రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తం.. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తం.
– మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

