ధాన్యం కొనుగోళ్లలో అధికారుల అంచనాలు మారుతున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలో దొడ్డు, సన్న రకం కలుపుకొని మొదట్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసిన అధికారులు, ఇప్పుడు 2.50 లక్షల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రాలు ప్రారంభించడంలో ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు దళారులకు అగ్గువకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు కేవలం 50,500 మెట్రిక్ టన్నులు దొడ్డు, 11,500 సన్న రకం ధాన్యాన్ని అధికారులు కేంద్రాల ద్వారా సేకరించినట్లు తెలుస్తోంది. మరో 2 లక్షలలోపు ధాన్యం సేకరించి ప్రభుత్వం చేతులు దులుపుకొనే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కరీంనగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా వాస్తవ పరిస్థితులు మరో విధంగా కనిపిస్తున్నాయి. కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా పెద్ద మొత్తంలో ధాన్యం దళారులపాలైంది. కరీంనగర్ జిల్లాలో ఈ పరిస్థితులు కండ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. నిజానికి అక్టోబర్ రెండో వారంలోనే జిల్లాలో వరి కోతలు పుంజుకున్నాయి. అప్పటికే కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఒక్క కేంద్రంలో కూడా కొనుగోళ్లు జరపలేదు. ఈ నెల మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభించే నాటికే రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాల్లోనే అడ్డగోలు అగ్గువ ధరకు దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. సన్న రకాలపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈసారి పెద్ద మొత్తంలో రైతులు సన్నాలు సాగు చేశారు. వారికి కూడా ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. కరీంనగర్ జిల్లాలో చూస్తే 1,51,982 ఎకరాల్లో దొడ్డు రకం, 1,21,415 ఎకరాల్లో సన్న రకాలను రైతులు సాగు చేశారు. ఈ లెక్కన 3,17,980 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 2,48,623 మెట్రిక్ టన్నుల సన్నరకం చొప్పున 5.66 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ నివేదికలు ఇచ్చింది. రైతుల అవసరాలకు ఉంచుకోగా 25 వేల మెట్రిక్ టన్నులకుపైగా దొడ్డు రకం, 10 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలను జిల్లాలోని మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేయవచ్చని, మిగిలిన 2,92,222 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1,07,778 మెట్రిక్ టన్నుల సన్న రకం కలిపి 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగానే కేంద్రాలు ఏర్పాటు చేయడం, గన్నీ సంచులు, వాహనాలు సమకూర్చుకోవడం వంటి ఏర్పాట్లు చేసుకున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించిన కారణంగా రైతులు పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా తమ ధాన్యాన్ని పెద్ద మొత్తంలో దళారులకు అడ్డగోలు ధరలకే అమ్ముకోవాల్సి వచ్చింది. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా రైతులు విశ్వసించనట్లు తెలుస్తోంది. కోతలు అలా ముగియగానే సన్న వడ్లను రైతులు నేరుగా మిల్లర్లకు, దళారులకు విక్రయించుకున్నారు. కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రోజుల తరబడి నిరీక్షించిన రైతులు దొడ్డు రకం వడ్లను రూ.1,800, రూ. 1,850 క్వింటాల్ చొప్పున అడ్డగోలు అగ్గువ ధరకు అమ్ముకున్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు ఏ గ్రేడ్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ. 2,300 ఎక్కడా వర్తించింది లేదు. కరీంనగర్ జిల్లాలో సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దళారులు అడ్డగోలు ధరకు కాజేసినట్లు తెలుస్తోంది. అధికారులు అంచనాలు మార్చుకోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. మొదట 4 లక్షల మెట్రిక్‌టన్నుల అంచనా కాగా, ఈ నెలకు వచ్చేసరికి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రావచ్చనే నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో 1.90 లక్షల వరకు దొడ్డు రకం, మిగతా 60 వేల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం ఉంటుందనే అంచనాకు వచ్చారు. ఇందులో కేవలం 50,500 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 11,500 మెట్రిక్ టన్నుల సన్న రకం మాత్రమే కొనుగోలు చేశారు.