Jeevan Reddy | జగిత్యాల : రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలని, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ప్ల కార్డులు, బీఆర్ఎస్ జెండాలతో నిర్వహించిన ర్యాలీ పలువురిని ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో రైతుబంధు రైతు బీమా నీరుగార్చడంతో పాటు వరి ధాన్యం సేకరణలో తరుగు పేరిట కోత, వరి ధాన్యానికి బోనస్ ఎగవేత, అరకొర విద్యుత్ సరఫరాతో రైతాంగాన్నీ ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. కేసీఆర్ ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించి, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మరనే రాహుల్ గాంధీ తో వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేయించారని ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోవడంపై కేసీఆర్, కేటీఆర్ సూచనల మేరకు ప్రజలను చైతన్య పరిచేందుకు నిరసన చేపడుతున్నామన్నారు. నాల్గు దశాబ్దాల రాజకీయాల అనుభవంలో టీడీపీ పాలనలో రైతుల దోపిడీపై యుద్ధం చేయాల్సి వచ్చిందని, ఇటువంటి పాలన చూడలేదని, యూపీఏ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో రైతులకు విద్యుత్ భారం పడుతోందని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాలని కేసీఆర్ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారని చెప్పారు. కేసీఆర్ ఉద్యమ నేతగా పదవులు త్యాగం చేసి, ప్రజా క్షేత్రాన్ని ఎంచుకొని, రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 గంటల కరెంట్ ఇవ్వగా, కేసీఆర్ పాలనలో 24 గంటలు ఉచిత విద్యుత్ పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తిని కేసీఆర్ పాలనలో విద్యుత్ ఉత్పత్తిని నాలుగింతలు చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డిని రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దూరదృష్టితోనే కాళేశ్వర ప్రాజెక్టు నిర్మించారని, కరువులో ప్రాజెక్ట్ గొప్పతనం తెలుస్తుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా నీరు గార్చారని, ఎరువుల పంపిణీపై ఆంక్షలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా పండించిన ధాన్యం సేకరణలో సైతం ప్రతీ 40 కేజీల బస్తాకు 3 నుండి 5 కిలోల వరకు కోత పెట్టారని, ధర్మకాంట, ట్రాక్ షీట్ తూకం లో వ్యత్యాసాలు రావడమే నిదర్శనమన్నారు.
కోత రుజువు చేస్తే మంత్రి అడ్లూరి రాజీనామా చేస్తానని చెప్పారని, తన రాజీనామా అవసరం లేదని విజిలెన్స్ విచారణ చేపట్టి రైతులకు వ్యత్యాసాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంట్రాక్ట్, బిల్లుల కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని, బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయని, ఈ విషయం అందరికీ తెలుసుఅని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు కొబ్బరికాయలు కొట్టడం, బీఆర్ఎస్ మంజూరు చేసిన పనులను ప్రారంభించడం తప్పా చేసిందేమీ లేదని మండిపడ్డారు. మల్లాపూర్ చర్కర ప్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మళ్లీ మోసం చేసే మాటలు మాట్లాడుతున్నాడని, ఇచ్చిన ఏ ఒక్క మాటకు కూడా కట్టుబడి ఉండడం లేదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కేసీఆర్ పెట్టుబడి కింద రైతు బంధు ఇచ్చారని, రైతు బంధు రైతులందరికీ ఒకే రోజు అందరికి అందజేశారని గుర్తు చేశారు. కేసీఆర్ రైతుల కోసం ప్రాజెక్టులు నిర్మించారని, అన్ని రంగాలను అభివృద్ధి చేశారని, కేసీఆర్ అందరికీ రుణ మాఫీ చేశారని అన్నారు. రూ.రెండు లక్షలకు పైగా ఉన్న అప్పు ఉన్నవారికి, అప్పు చెల్లించిన వారికి ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. 42 లక్షల మందికి రుణ మాఫీ చేయాల్సి ఉండగా కేవలం 21 లక్షల మందికి మాత్రమే రుణ మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రావొద్దని అనుకున్న రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉండడం దురదృష్టకరమని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా సంజయ్‌కుమార్‌ను గెలిపిస్తే అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పని ఆయన రేవంత్ రెడ్డి పక్కన చేరి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు.