హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ రెండున్నరేండ్లుగా చేసిన పోరాటంతోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటు పడిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారని దెప్పిపొడిచారు. గెలిచిన పార్టీకి ద్రోహం చేసిన ఆయనకు ఓటమి తప్పదని హెచ్చరించారు. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సైతం వేటుతప్పదని, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాక తప్పదని జోస్యం చెప్పారు. మార్చి 14, 2024న దానం నాగేందర్ కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని మండిపడ్డారు.
మార్చి 18న స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, బీఆర్ఎస్ లీగల్‌సెల్ మార్చి 24, 2024 నుంచే న్యాయపోరాటం చేస్తున్నదని పేర్కొన్నారు. స్పీకర్ దానం నాగేందర్‌కు అనుకూలంగా వ్యవహరించడంతోనే హైకోర్టులో పిటిషన్ వేశామని పేర్కొన్నారు. హైకోర్టు అనర్హత వేటు వేసిన తర్వాత బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసినట్టు చెప్పా రు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ గురువారం దానం పిటిషన్‌ను తోసిపుచ్చినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఖైరతాబాద్‌లో 22-ఏ ప్ర భావం తప్పకుండా ఉంటుందని, ఉ ద్యోగులు సైతం అధికార కాంగ్రెస్‌కు వ్యతిరేకమేనని చెప్పారు. ఖైరతాబాద్‌లో దానం ఓటమి నుంచి తప్పించుకోలేరని స్పష్టంచేశారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. గణేశ్ నిమజ్జనోత్సవాల్లో కేసీఆర్ పాటలు పెట్టుకోవద్దని చెప్పడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎవరని ప్రశ్నించారు.
ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారా అని నిలదీశారు. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు చేయాలి..లంచ్ ఎప్పుడు ముగించాలనే విషయాన్నీ ఆయనే చెబుతారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, సజ్జనార్ ఎక్కడున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.