రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు మత్తడి దుంకాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి నీరు రావడంతో జనం రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
కరీంనగర్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో సోమవారం ఉదయం నాటికి సగటున 51.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.అత్యధికంగా చిగురుమామిడి మండలంలో 83.0 గంగాధర మండలంలో 82. 4 మిల్లీ మీటర్లు నమోదుకాగా రామడుగులో 58.2, చొప్పదండిలో 77.1, కరీంనగర్ రూరల్‌లో 38.8, కరీంనగర్/కొత్తపల్లిలో 35.8, గన్నేరువరం 52.4, మానకొండూర్‌లో 25.6, తిమ్మాపూర్‌లో 49.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ డివిజన్లో సగటున 55.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హుజూరాబాద్ డివిజన్లోని సైదాపూర్‌లో 42.2, శంకరపట్నంలో 58.2, వీణవంకలో 44.6, హుజూరాబాద్‌లో 39.2, జమ్మికుంటలో 48.6, ఇల్లందకుంటలో 35.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. డివిజన్లో సగటున 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది..
నగరపాలక సంస్థలో కాల్ సెంటర్ ఏర్పాటు
కార్పొరేషన్, సెప్టెంబర్ 2 : రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ చాలా అప్రమత్తంగా ఉందని కమిషనర్ చాహత్ భాజ్ పాయ్ అన్నారు. సోమవారం 5,27 వ డివిజన్‌తో పాటు నగరంలో పలుచోట్ల పర్యటించారు. నగరపాలక సంస్థ చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, అధికారుల ఆదేశాల ప్రకారం నగరపాలక సంస్థ చాలా అప్రమత్తంగా ఉందన్నారు.
వర్షాలకు నగర వ్యాప్తంగా ఎకడా ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. వర్షాలతో ఎకడైన సమస్యలు తలెత్తితే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 9849906694, 0878-2237700కు సమాచారం అందించాలన్నారు. అలాగే దోమలు పెరగకుండా చర్యలు తీసుంటున్నట్లు తెలిపారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ వేణు మాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ స్వామి, ఎస్ఐలు, జవానులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్‌కు 24 ఫిర్యాదులు
కలెక్టరేట్, సెప్టెంబర్ 2 : వర్ష బాధితుల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వివిధ సమస్యలపై సోమవారం సాయంత్రం వరకు 24 ఫిర్యాదులు వచ్చా యి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఈ ఫిర్యాదుల్లో అధికంగా వరద తీవ్రతతో పడుతున్న ఇకట్లు తొలగించాలంటూ కోరుతున్నట్లు సంబంధిత అధికారులు పేరొన్నారు. కాగా, కరీంనగర్ డివిజన్ పరిధిలో వర్ష ప్రభావంతో ఇబ్బందులు ఎదురొంటున్న వారు ఆర్డీవోకు కూడా సమాచా రం అందిస్తే, వెంటనే పరిషరించేందుకు అవసరమైన చ ర్యలు పడతామని ఆర్డీవో మహేశ్వర్ తెలిపారు.
మానకొండూర్, సెప్టెంబర్ 2 : వర్షాలతో మానకొండూర్ పెద్దచెరువులోకి వరదనీరు వచ్చి చేరడంతో నీటిమ ట్టం పెరుగుతున్నది. సోమవారం నుంచి పెద్దచెరువు మత్త డి పడుతుండగా, మత్స్యకారులు చేపలు పడుతున్నారు.
చిగురుమామిడి, సెప్టెంబర్ 2 : వర్షాలకు రేకొండ ఊర చెరువు మత్తడి దుంకుతున్నది. ములనూరు, చిగురుమామిడి, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి గ్రామాల్లో చెరువులు మత్తడి దుంకడంతో మత్స్యకారులు చేపలు పట్టారు.
మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 2 : దేవంపల్లిలోని పాల చెరువు, శ్రీనివాస్‌నగర్‌లోని బర్లాం చెరువు మత్తడి దుంకుతున్నాయి. వెల్ది-లింగాపూర్ మధ్య ఉన్న కల్వర్టు కుంగడంతో, ఈదులగట్టెపల్లి పంచాయతీ ఎదుట నీరు ప్ర వహించడంతో రోడ్‌పై వెళ్లేందుకు జనం ఇబ్బంది పడ్డారు. కొండపల్కల-మద్దికుంట గ్రామాల మధ్య సైతం నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అత్యవసరనిధి కింద ఆర్థిక సహాయం అందజేత
చొప్పదండి,సెప్టెంబర్ 2 : భారీ వర్షాలకు చొప్పదండి పట్టణ పిట్టల లక్ష్మి పెంకుటిల్లు కూలగా విపత్తు ఆర్థిక సహాయంగా రూ.3200, 25 కిలోల బియ్యాన్ని తహసీల్దార్ నవీన్ కుమార్ అందజేశారు. ఇక్కడ గిర్దావర్ నాగరాజు, రేషన్ డీలర్ రామ్మోహన్ ఉన్నారు.
గంగాధర, సెప్టెంబర్ 2: భారీ వర్షాలకు నారాయణపూర్ రిజర్వాయర్, గట్టుభూత్కూర్, సర్వారెడ్డిపల్లి, కురిక్యాల ఊర చెరువులు మత్తడి దుంకుతున్నాయి. సర్వారెడ్డిపల్లి చెరుకట్ట ప్రమాదకరంగా మారడంతో ఇరిగేషన్ శాఖాధికారులు పరిశీలించారు.
రామడుగు, సెప్టెంబర్ 2: వర్షాలతో రామడుగు సమీపంలోని మోతెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాత వంతెనకు ట్రాక్టర్‌ను అడ్డంపెట్టి రాకపోకలను నిలిపివేశారు. మోతె సమీపంలోని వంతెన పాక్షికంగా దెబ్బతిన్నది. విద్యానగర్‌లో మురుగు కాలువ మూసివేయడంతో వరదనీరు నివాస గృహాల్లోకి చేరి నిత్యావసర సరుకులు పాడయ్యా యి. ఇండ్లలోకి నీరుచేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు.
సైదాపూర్, సెప్టెంబర్ 2 : మండలంలో ఆదివారం ఉద యం నుంచి సోమవారం వరకు 42.2 ఎంఎం వర్షపాతం నమోదైంది. వరద నీటితో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వెన్కెపల్లి కారంకంటి రాజమ్మ ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వీణవంక, సెప్టెంబర్ 2 : వీణవంక, మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. మల్లారెడ్డిపల్లిలో నిమ్మల రాజయ్య ఇల్లు ఆదివారం రాత్రి కూలిపోగా ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మామిడాలపల్లి శివారులో కల్వర్టు వద్ద తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. వీణవంక-నర్సింగాపూర్, కనపర్తి-వీణవంక, ఘన్ముక్ల-మల్లన్నపల్లి గ్రామాల మధ్య నీటి ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి.
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 2: భారీ వర్షాలకు కరీంనగర్ మండలంలోని చామనపల్లి, చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్, జూబ్లీనగర్‌లో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చామనపల్లి, బహ్దూర్ఖాన్ పేటల మధ్య వాగు ఉధృకి రోడ్డు కల్వర్టు తెగిపోయి రెండు గ్రామాల మధ్య రవాణా నిలిచిపోయింది. పెద్ద చెరువు మత్తడితో చెర్లభూత్కూర్‌కు-ప్రశాంత్ నగర్ కాలనీ, గుజ్జుల పల్లికి రవాణా నిలిచిపోయింది. మానేరు వాగు, గుండి వాగుల ఉధృతితో మొగ్దుంపూర్, చెర్లభూత్కూర్ గ్రామాలు, చామనపల్లి వాగుల పరీవాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. దాదాపు వందల ఎకరాల్లో పంటనీట మునిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగునూర్‌లో వల్లంపాడ్ వద్ద పోల్స్ విరిగి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వాగులో కొట్టుకుపోయింది. గోపాల్‌పూర్‌లో కేసీఆర్ భవన్ వైపు రహదారిపై నీరు నిలిచి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. గోపాల్పూర్ చెరువు, నగునూర్ చెక్ డ్యాం, దుర్శేడ్, గోపాల్పూర్ చెక్‌డ్యామ్‌లు మత్తడి దుంకుతున్నాయి. గర్రెపల్లి చెరువు ఉధృతంగా ప్రవహిస్తుంది.
గన్నేరువరం, సెప్టెంబర్ 2: మండలంలోని గుండ్లపల్లి దేవుని చెరువును జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ పరిశీలించారు. ఇక్కడ ఆర్డీవో మహేశ్వర్, ఎఫ్ఏసీ నరసింహాచారి, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గన్నేరువరంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి పర్యటన
గన్నేరువరం, సెప్టెంబర్ 2: మండలంలోని గునుకుల కొండాపూర్, తుమ్మనిపల్లి, చీమలకుంటపల్లి గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లిసత్యనారాయణ పర్యటించారు. గునుకుల కొండాపూర్‌లో దళిత కాలనీలో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీని పరిశీలించారు.
వంతెనను అందుబాటులోకి తెస్తాం : ఎమ్మెల్యే సత్యం
రామడుగు, సెప్టెంబర్ 2 : నేటి సాయంత్రంలోగా రా మడుగు వాగుపై నిర్మించిన కొత్త వంతెనను మండల ప్రజలకు అందుబాటులోకి తెస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. వర్షాలతో రామడుగు పాత వంతెన పూర్తిగా దెబ్బతినడంతో మండల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎమ్మెల్యే దృష్టికి చేరాయి. సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి వరద తాకిడికి దెబ్బతిన్న పాత వంతెనను పరిశీలించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, సీఐ ప్రకాశ్‌గౌడ్, విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వరి, ఎస్ఐలు కాంగ్రెస్ నాయకులున్నారు.
ప్రాజెక్టులకు భారీగా వరద
తిమ్మాపూర్, సెప్టెంబర్ 2 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పడతున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తున్నది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎల్లంపల్లి బరాజ్‌కు పోటెత్తింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎల్లంపల్లికి ఎగువ నుంచి 2,92,815 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం ప్రాజెక్టు 62 గేట్లలో 32 గేట్లను ఎత్తి 2,64,787 క్యూసెక్కులు దిగువన సరస్వతీ బరాజ్‌కు వదులుతున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర జలాశయానికి సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగుల నుంచి 36,320 క్యూసెక్కులు, ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 5వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 41,320 క్యూసెక్కుల వదర నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
27.5టీఎంసీల సామర్థ్యం ఉన్న మధ్యమానేరు ప్రస్తుతం 19.78 టీఎంసీల సామర్థ్యానికి చేరింది. కరీంనగర్ జిల్లాలో మోయతుమ్మెద వాగు, ఇతర వాగు, శ్రీరాజరాజేశ్వర జలాశయం ద్వారా మొత్తంగా 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఎల్ఎండీ రిజర్వాయర్‌కు వస్తున్నది. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్ఎండీలో ప్రస్తుతం 15.652 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి.