ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మొదలైంది. వారం పది రోజుల నుంచి నీరు వచ్చి చేరుతుండడంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతున్నది. మొన్నటి వరకు డెడ్స్టోరీకి చేరువలో కనిపించినా.. ఇప్పుడు 40 టీఎంసీలకుపైగా నీటి నిల్వతో జలకళను సంతరించుకుంటున్నది.
జగిత్యాల, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతున్నది. 80 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు కింద తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రాజెక్టు నిండని ప్రతిసారి ఉత్తర తెలంగాణ రైతాంగానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు క్రమంగా వట్టిపోతుండడం, ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర వాళ్లు గోదావరిపై విచ్చలవిడిగా ప్రాజెక్టులు, బ్యారేజ్‌లు నిర్మించడంతో దిగువకు నీరందని దుస్థితి నెలకొన్నది.
గతేడాది సైతం ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైనా, కేసీఆర్ సర్కారు కాళేశ్వరం నీటిని ఎత్తిపోసింది. పోయినేడు జూలై ప్రారంభంలో ఎస్సారెస్పీలో నీరు కనిష్ఠానికి చేరుకోగా, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం జీవం పోసింది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి, రామడుగు గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలించి, వరద కాలువ ద్వారా రాంపూర్ పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌కు, తిరిగి అక్కడి నుంచి ముప్కాల్ పంప్‌హౌస్ వరకు తరలించి, ఎస్సారెస్పీలోకి నీటిని పంపించే ప్రక్రియను విజయవంతం చేశారు. దాదాపు మూడు టీఎంసీలు తరలించారు.
అయితే గతేడాది జూలై రెండో వారంలో వరుణుడు కరుణించడం, ఎగువన విస్తారంగా వర్షాలు పడడంతో వారం వ్యవధిలోనే ఎస్సారెస్పీ నిండుకుండలా మారిపోయింది. కానీ, ఈ యేడాది మొన్నటి వరకు ఆ పరిస్థితి లేదు. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణలోని ఎస్సారెస్పీ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు లేక ప్రాజెక్టు పూర్తిగా డెడ్‌స్టోరేజీకి చేరింది. జూన్‌లో చుక్క నీరు రాలేదు. జూలై ప్రారంభమమై రెండువారాలు గడిచినా నీటి జాడ కానరాలేదు. అయితే జూలై మూడో వారం నుంచి నీటి ప్రవాహం కొద్దిగా ప్రారంభమైంది. జూలై 13 నుంచి వందల క్యూసెక్కుల ప్రవాహం మొదలు కాగా, అది మెల్లగా పెరుగుతూ పోయింది.
జూలై 18 నాటికి 25వేల క్యూసెక్కులకు పెరిగి, ప్రాజెక్టులో నీటినిల్వ 14.450 టీఎంసీలకు చేరుకున్నది. అప్పటి నుంచి క్రమంగా ప్రవాహం పెరుగుతూనే ఉన్నది. సగటున రోజుకు 20వేల క్యూసెక్కులు వస్తుండగా, జూలై 28 నాటికి ప్రాజెక్టు 31 టీఎంసీలకు నీరు చేరింది. ఇరు రాష్ర్టాల్లోని ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో వాన సమృద్ధిగా పడుతుండడంతో ఆగస్టు ఒకటి నుంచి ప్రాజెక్టులోకి గతం కంటే ఎక్కువ నీటి ప్రవాహం రావడం ఆరంభమైంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు 28వేల క్యూసెక్కులు నమోదు కాగా, సాయంత్రం 6 గంటల వరకు 40వేల క్యూసెక్కులకు చేరుకున్నది.
శుక్రవారం సాయంత్రం వరకు ఇది మరింతగా పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 53 వేల క్యూసెక్కులు వస్తుండడంతో ప్రాజెక్టు క్రమంగా జలకళను సంతరించుకుంటున్నది. సాయంత్రం వరకు 40 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో అధికారులు, రైతులు సైతం ఊపిరిపీల్చుకున్నారు. ప్రాజెక్టు నిబంధనల ప్రకారం 40 టీఎంసీల నీరు చేరితేనే సేద్యానికి నీటి విడుదల చేయాల్సి ఉండగా, జగిత్యాల, నిజామాబాద్ రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కనీసం వానకాలం పంటకైనా నీరందుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి.