పల్లె పోరు మొదలైంది. తాజాగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదలైంది. మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించగా, మంగళవారం సాయంత్రం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల్లో మూడు దశల్లో నిర్వహించే గ్రామ పంచాయతీల పేర్లను యంత్రాంగం ఖరారు చేసింది. పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయడంతోపాటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. కాగా, దాదాపు 20 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి పార్టీ రహితమే అయినా, పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే ఇప్పటికే ఓసారి సర్కారు చేసిన హడావుడిని నమ్మి ఆశావహులు, భారీ ఖర్చు చేసి షెడ్యూల్ రద్దు కావడంతో నిరాశ చెందారు. ఇప్పుడు మరోసారి షెడ్యూల్ రావడంతో తమ ప్రయత్నాల్లో తలమునకలయ్యారు.
కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2024 ఫిబ్రవరి ఒకటితో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. రాజ్యాంగంలోని 243(3) (ఏ) ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతేకాదు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం.. పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి మూడు నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నది.
పాలకవర్గాల గడువు పూర్తి కావడంతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (లెటర్ నంబర్ 921/టీఎస్ఇసీ-పీఆర్/2023) గతేడాది డిసెంబర్ 14న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. కానీ, ఆచరణలో మాత్రం ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్లు, తదితర అంశాలను సాకుగా చూపి.. పంచాయతీ ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని భావించి, తాజాగా పంచాయతీ ఎన్నిలకు పచ్చజెండా ఊపడంతో దాదాపు 20 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి.
కోర్టులో కేసు ఉందని తెలిసినా సర్కారు చేసిన హడావుడిని నమ్మిన ఆశావహులు, ఇప్పటికే తమ ప్రయత్నాల్లో మునిగి తేలారు. ఆ మేరకు భారీగా ఖర్చు చేశారు. నిజానికి ఎన్నికల నిబంధనల ప్రకారం చూస్తే.. సర్పంచ్, వార్డు మెంబర్ల విషయానికొస్తే ఐదు వేలకు పైగా జనాభా ఉంటే అక్కడ సర్పంచ్ బరిలో ఉండే అభ్యర్థి 2.5 లక్షలు, వార్డుమెంబర్ అభ్యర్థి 50వేలు.. అలాగే ఐదు వేల లోపు జనాభా ఉంటే అక్కడ సర్పంచ్ అభ్యర్థి 1.5 లక్షలు, వార్డుమెంబర్ అభ్యర్థి 30వేలలోపు ఖర్చు చేయాలి. అయితే ఆచరణలో జరిగే ఖర్చులకు ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనలకు ఎప్పుడూ పొంతన ఉండదన్న విషయం తెలిసిందే.
అయితే సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థులు ఖర్చుకు మొగ్గుచూపుతారు. కానీ, గతంలోనే షెడ్యూల్ జారీచేయగా, అప్పుడు చాలా మంది అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టారు. తీరా ఆ షెడ్యూల్ రద్దుకావడంతో తీవ్ర నిరాశ చెందారు. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో మళ్లీ ఖర్చులకు తెరలేవనున్నది. ఇది ఇలా ఉంటే పల్లెల్లో పట్టు నిరూపించుకోవాలని ప్రధాన పార్టీలు తహతహ లాడుతున్నాయి. పార్టీ రహిత ఎన్నికలే అయినా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టాయి.
సైదాపూర్, నవంబర్ 25 : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాంచంద్రాపూర్, కుర్మపల్లి గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రాంచంద్రాపూర్కు అనుబంధంగా ఉన్న కుర్మపల్లి కొత్త పంచాయతీగా ఏర్పాటు కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని రాంచంద్రాపూర్ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల సంఘం ఈ రెండు గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేసింది.
మొదటి విడుత : గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్
రెండో విడుత : చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూర్, శంకరపట్నం
మూడో విడుత : వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుస్నాబాద్, సైదాపూర్(వీ)
మొదటి విడుత : మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్
రెండో విడుత : జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగాపూర్, రాయికల్, బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల
మూడో విడుత : ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి
మొదటి విడుత : మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, కాల్వశ్రీరాంపూర్
రెండో విడుత : పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, జూలపల్లి
మూడో విడుత : సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల
మొదటి విడుత : రుద్రంగి, వేములవాడ రూరల్, వేములవాడ, కోనరావుపేట, చందుర్తి
రెండో విడుత : బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట
మూడో విడుత : గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట
