కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తనుగుల చెక్ డ్యాం పేల్చివేత ఇసుక మాఫియాలోని కాంగ్రెస్ గూండాల పనేనని, తక్షణమే దోషులను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు కమీషన్లు పంచుకుంటున్నారని ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామాల మధ్య మానేరు వాగుపై ధ్వంసమైన చెక్ డ్యాంను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. మానేరు వాగులో 24 కోట్లతో కేసీఆర్ హయాంలో నిర్మించిన చెక్ డ్యాంను ఇసుక మాఫియా పేల్చేసిందన్నారు. నీళ్లుంటే ఇసుక తవ్వకాలకు ఆటంకమని రాత్రికి రాత్రే జిలెటిన్ స్టిక్స్‌తో కూల్చారని, దీని వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. రేవంత్ పాలనలో చెరువులు, చెక్ డ్యాంల విధ్వంసం నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న బ్లాస్టింగులు చూస్తుంటే కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కూడా జిలెటిన్‌స్టిక్స్ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. డ్యాంను పేల్చిన వారిపై చర్యలు తీసుకోకపోతే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మాఫియాకు సహకరించిన అధికారులను, పోలీసులను వదిలిపెట్టమని హెచ్చరించారు.
ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తి కాంగ్రెస్ అకృత్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా, పిల్ల కాలువలు తవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కడుపు కొడుతున్నదని ధ్వజమెత్తారు. యుద్ధాలు వచ్చినప్పుడు కూడా సాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోరని, కానీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం టెర్రరిస్టులను మించిపోయి ఇసుక తవ్వుకునేందుకు రైతులకు ఉపయోగపడే నీటి వనరులైన చెక్ డ్యాంను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వస్తున్న విషయం తెలుసుకుని ఇటు కరీంనగర్, అటు పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన రైతులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కూలిన చెక్ డ్యాంను పరిశీలిస్తున్న సందర్భంగా స్థానిక రైతులు హరీశ్ రావుకు జరిగిన విషయాన్ని వివరించారు. బాంబులతో పేల్చివేయడం వల్లే చెక్‌డ్యాం ధ్వంసమైందని, నీళ్లు లేక తమ భూముల్లో పంటలు పండే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో హుస్సేన్‌మియా వాగుపై చెక్ డ్యాంను కూల్చి వేసే ప్రయత్నం జరిగినప్పుడు చేసిన ఫిర్యాదు కాపీని అక్కడి రైతులు హరీశ్ రావుకు అందించారు. అందుకు సంబంధించిన సాక్షాలను కూడా ఇవ్వగా, హరీశ్ రావు విలేకరుల ముందు వాటిని ప్రదర్శించారు. జమ్మికుంట మున్పిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుతోపాటు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ జడ్పీటీసీలు గంట రాములు, వంగల తిరుపతి రెడ్డి, నాయకులు ఐరెడ్డి వెంకటరెడ్డి, మోహన్ రావు, ఉప్పుల సంపత్ కుమార్, కాంతాల సాదారెడ్డి, రాంరెడ్డి, లక్ష్మణ్, రాజ్‌కుమార్ ఉన్నారు.