2023 అక్టోబర్ 21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి సమీపంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌లోని రెండు పిల్లర్లు కుంగాయి. దీని వెనుక విధ్వంస కుట్రలు దాగి ఉన్నాయని అప్పట్లోనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పరిసర ప్రాంత ప్రజలు కూడా పెద్దఎత్తున పేలుడు శబ్దంలాంటిది విన్నట్టు చెప్పారు.
2024 జనవరి 14: పెద్దపల్లి మండలం భోజన్నపేట హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కూల్చేందుకు కొంతమంది అగంతకులు కుట్ర చేశారు. అందుకోసం 11చోట్ల డ్రిల్లింగ్ చేసి ఆ రంధ్రాల్లో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు పెట్టారు. ఇక పేల్చేందుకు ప్రయత్నిస్తుండగా అదే సమయంలో అక్కడికి రైతులు చూడటం వల్ల కుట్ర భగ్నమైంది. పోలీసులు డ్రిల్లింగ్ మిషన్, డిటోనేటర్లు, కంప్రెషర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు గంటలు ఆలస్యమైతే ఈ చెక్‌డ్యాం ఆ రాత్రే నేలమట్టమయ్యేది.
2025 నవంబర్ 21 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల సరిహద్దులోని మానేరుపై రూ.19 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను దుండగులు పేల్చేశారు. ఇది ముమ్మాటికీ విధ్వంసకారుల పనేనని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ బృందం శాంపిళ్లను సేకరించింది.
ఇసుక రవాణాకోసం చెక్డ్యాములనే కూల్చివేస్తున్న ఉదంతాల నేపథ్యంలో..
మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు వెనుక కుట్ర కోణాలు? ముసురుకుంటున్న అనుమానాలు!!
కరీంనగర్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్ కుంగిపోవడం వెనుక విధ్వంసపు కుట్ర దాగి ఉన్నదా? స్వప్రయోజనాల కోసం బాంబులు పెట్టి కూల్చాలని పథకం వేశారా? బీఆర్ఎస్ను అభాసుపాలు చేసి, అధికారం కోసం అడ్డదారులు తొక్కారా? లక్షలాది ఎకరాలకు సాగు, ప్రజలకు తాగునీరందించే ప్రాజెక్టును కూల్చేశారా? బలమైన పునాదులతో నిర్మించిన బరాజ్ కుంగుబాటు వెనుక కుట్ర కోణంపై అప్పుడే అనేక అనుమానాలు వచ్చా యి. ప్రస్తుత వరుస ఘటనలు వాటికి బలం చేకూర్చుతున్నాయి. తాజాగా మానేరు నదిపై చెక్‌డ్యాం పేల్చివేత ఘటనలను నిశితంగా పరిశీలిస్తే మేడిగడ్డ బరాజ్ వెనుక కూడా వ్యూహాత్మక ధ్వంసరచన చేసినట్టు స్పష్టమవుతున్నది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల సరిహద్దులో మానేరుపై చెక్‌డ్యాంను 21న దుండగులు పేల్చేయడంతో మరోసారి మేడిగడ్డ(లక్ష్మి)బరాజ్ కుంగుబాటు తెరపైకి వస్తున్నది. కాళేశ్వరంలో భాగంగా జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి సమీపంలో గోదావరిపై 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బరాజ్ నిర్మించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 అక్టోబర్ 21న బరాజ్‌లో కుంగుబాటు కనిపించింది. ఏడో బ్లాక్‌లోని 20వ పియర్తోపాటు ఆ పక్కనే ఉన్న 19, 21 పియర్స్ కుంగినట్టు అధికారులు వెల్లడించారు. 28లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొన్న బరాజ్ రాత్రికిరాత్రే కుంగిపోవడంపై అప్పుడే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనుక పెద్ద ఉగ్ర కుట్ర దాగి ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పోలీస్స్టేషన్లోనూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మేడిగడ్డను రాజకీయం బద్నాం చేసే ప్రయత్నం చేసింది తప్ప.. దీని వెనుక విధ్వంస కుట్ర కోణంలో విచారణ జరిపిన దాఖలాలు లేవు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును, నాటి నుంచి నేటి వరకు హస్తం పార్టీ తన స్వప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటుందన్న విమర్శలున్నాయి. నిజానికి అధికారం కోసం ఆ పార్టీ వాళ్లే ఈ కుట్రలకు పాల్పడి ఉండొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
నిరుడు జనవరిలో హుస్సేన్‌మియా వాగుపై చెక్‌డ్యాం కూల్చివేతకు దుండగులు కుట్ర పన్నారు. దీని వెనుక కొందరు కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నదని విమర్శలు వచ్చాయి. నిజానికి రైతులు చూడడం రెండు మూడు గం టలు ఆలస్యమైతే చెక్‌డ్యాం నేలమట్టం అయ్యేది. పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, విచారణపై అడుగుముందుకు వేయలేదు. ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదు. కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగి ఫిర్యాదును మూలనపడేశారన్న విమర్శలున్నాయి. అప్పుడే పకడ్బందీ విచారణ చేసి ఉంటే.. గుంపుల- తనుగుల చెక్‌డ్యాంను పేల్చివేత జరిగేది కాదని స్థానికులు చెప్తున్నారు. మానేరుపై ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, పరీవాహక ప్రాంత రైతులకు అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు అనేక చెక్‌డ్యాంలను నిర్మించింది. కానీ, కాంగ్రెస్ హయాంలో చెక్‌డ్యాంలకు రక్షణ లేకుండా పోతున్నది. భారీ శబ్దం వచ్చిందని చెక్‌డ్యాంను మూమ్ముటికీ పేల్చివేశారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు కూడా ఇదే చెప్తున్నా రు. లీకేజీలు, లేదా ఇతర కారణాల వల్ల కూలిపోలేదని, కచ్చితంగా కూల్చడం లేదా పేల్చడం జరిగిందంటూ జమ్మికుంట ఠాణాలోనూ అధికారులు ఫిర్యాదు చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్ విభాగం చెక్‌డ్యాంను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పలు నమూనాలు సేకరించింది. విచారణ కొనసాగుతుందని, రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెబుతామని చెప్పారు.
చెక్‌డ్యాం పేల్చివేశారని గ్రామస్థులు, ఇంజినీరింగ్ అధికారులు నిగ్గు తేల్చుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా స్థానిక పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్ మాత్రం బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు తెరలేపారు. ప్రాజెక్టు నాణ్యత లోపించడం వల్ల కూలిందని ముందుగానే తేల్చేశారు. అందులో ఓ ప్రజాప్రతినిధి అయితే ఇరిగేషన్ అధికారులపై నిప్పులు చెరిగారు. పేల్చివేశారని మీరు మీడియాకు ఎలా చెబుతారంటూ ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా, నాణ్యతాలోపంతో కూలినట్టు రిపోర్టు రాయాలంటూ హుకూం జారీ చేసినట్టు తెలిసింది. అలాగే ప్రాజెక్టు నాణ్యతా లోపాల వల్లే కూలిందని బీఆర్ఎస్పై విమర్శలు చేసిన బండి సంజయ్.. మంగళవారం విచారణ జరుపాలంటూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖరాశారు. ఒకవేళ నిజంగానే నాణ్యతాలోపం ఉందని భావించినా.. ఈ చెక్‌డ్యాంను నిర్మాణం చేసింది ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీయే. ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ముం దుగా ఈ కంపెనీపై తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఎమ్మెల్యే విజయరమణారావు, మంత్రి బండి సంజయ్ మాట మారుతుందో? లేదో? చూడాలి.
చెక్‌డ్యాం పేల్చివేత వెనుక కాంగ్రెస్ ఇసుక మాఫియా హస్తం ఉన్నదని సమాచారం. జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాల్లో నివాసం ఉండే సదరు మాఫియా కొంతమంది ప్రథమ శ్రేణి నాయకులతో కలిసి ఈ ధ్వంసరచన చేశారని తెలుస్తున్నది. చెక్‌డ్యాం పేల్చి వేసి నీళ్లను బయటకు పంపిస్తే, కోట్లాది రూపాయల ఇసుక వ్యాపారం చేయచ్చన్న దురాశతో పూనుకున్నట్టు తెలిసింది. వారి పేర్లు బయటకొస్తే కాంగ్రెస్ పెద్దల అవినీతి బయట పడుతుందని, స్థానిక ఎన్నికల వేళ పార్టీకి చెడ్డ పేరొస్తుందన్న ఉద్దేశంతో విచారణ ముందుకు సాగనివ్వటంలేదని సమాచారం. మేడిగడ్డ కుంగిపోయాక ఆగమేఘాల మీద మేడిగడ్డ బరాజ్ మునక ప్రాం తంలో 92,77,343 టన్నుల ఇసుక ఉన్నట్టు టీజీఎండీసీ 2024 జూన్‌లో గుర్తించింది. ఆమేరకు 14 బ్లాక్‌లుగా విభజించి ఆ ఏడాది జూన్ 18 నుంచి 25వరకు టెండర్లు పిలువగా ఇసుక విక్రయాలు భారీగా జరిగాయి. ఇప్పటికీ నాలుగుకుపైగా క్వారీలు నడుస్తున్నాయి. ఏ కోణంలో చూసినా కుంగుబాటు, కూల్చివేతలపై ఇసుక ప్రభావం కనిపిస్తున్నది.
సింగరేణిలో ఉద్యో గం చేసిన అనుభవంతో చెప్తున్న. చెక్‌డ్యాంను ముమ్మాటికీ పేల్చినట్టు అనిపిస్తున్నది. మాది మానేరు వాగు పక్కన వావిలాల. రిటైర్డ్ అయిన తర్వాత ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటున్న. ఈ చెక్‌డ్యాం పేల్చడం వల్ల మా భూములు పడావు పడే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం మానేరు వాగులో చెక్‌డ్యాం కట్టడం వల్ల మాకు లాభమైంది. అసోంటిది ఇప్పుడు గిట్ల బాంబులతో పేల్చుడు ఎంతవరకు కరెక్ట్. పేల్చినోళ్లను పట్టుకొని శిక్షించాలి.
– కన్నెబోయిన ఓదెలు, సింగరేణి రిటైర్డ్
బాంబులతోటి పేల్చడం వల్లనే చెక్‌డ్యాం కూలింది. నేను శుక్రవారం సాయంత్రం వరకు అక్కడ చేపలు పట్టిన. చెక్‌డ్యాం మంచిగనే ఉండే. శనివారం తెల్లారి చూసేసరికే పేల్చినట్టు ఉండి నీళ్లన్నీ పోయినయ్. రాత్రికిరాత్రి ఎట్ల కూలుతది? తుఫాన్ వల్ల వచ్చిన భారీ వరదకు కూడా చెక్‌డ్యాంకు ఏమీకాలేదు. ఇప్పుడు వరద లేదు, ఏదీ లేదు. గిప్పుడెట్ల కూలుత ది. కచ్చితంగా ఇసుక దొంగలపనే. వాళ్లను పట్టుకోవాలె. చెక్‌డ్యాం మల్లా కట్టాలె.
– దావరవేయిన సారయ్య, వావిలాల