టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న వ్యవహారంలో చర్యలు మొదలయ్యాయి. సంఘాలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎన్ నరసింహస్వామిని సస్పెండ్ చేస్తూ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖలో సంచలనంగా మారింది. అయితే, తన పరిధిలో కొన్ని అంశాలపై యాక్షన్ తీసుకోవాల్సిన ఇన్చార్జి డీఈవో మొండయ్య ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వస్తునాయి. ప్రస్తుతం ఆర్జేడీ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో డీఈవో కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగంలో పదో తరగతి జవాబు పత్రాల విక్రయ బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మొదట అక్టోబర్ 15న ‘టెన్త్ పేపర్స్ అమ్ముకున్నరు?’ శీర్షికన ప్రారంభించి, అక్టోబర్ 20న ‘విద్యాశాఖలో కదులుతున్న అవినీతిడొంక?’ ఈనెల 5న ‘విద్యాశాఖలో అవినీతి బట్టబయలు!’ ఈనెల 15న ‘విద్యాశాఖలో కదులుతున్న అవినీతి డొంక!’ శీర్షికలతో కథనాలు ప్రచురించిన విషయం విదితమే. నిజానికి ఈ కథనాలు అబద్ధమంటూ కప్పిపుచ్చేందుకు విద్యాశాఖలోని కొంత మంది అధికారులు ప్రయత్నాలు చేశారు. కానీ, ఆధారాలను కళ్లకు కట్టినట్టు ప్రచురించడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై, వివరాలు సేకరించడంతో ఒక్కో అక్రమం వెలుగు చూస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెల 21న ‘నమస్తే’ మరోసారి ‘తేలిన లెక్కలు.. చర్యలకు సిఫారసు’ శీర్షికన కథనం కూడా ఇచ్చింది.
నిజానికి ‘నమస్తే’ ప్రచురించిన కథనాలపై ముందుగా అధికారులు ఆరా తీస్తే.. వారినే పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ, వాస్తవాలు తెలుసుకున్న కలెక్టర్ పమేలా సత్పతి.. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు నిజనిజాలను వెలికి తీసేందుకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ అశ్విని తానాజీ వాకడేను విచారణ అధికారిగా నియమించారు. ఈ నెల 14న విచారణ జరిపిన అదనపు కలెక్టర్, అక్రమాల నిగ్గు తేల్చారు. జిల్లా ఇన్చార్జి డీఈవో మొండయ్య సమక్షంలో విచారణ చేయడంతోపాటు నివేదిక సమర్పించడంలోనూ ఏమాత్రం జాప్యం చేయలేదు. విచారణ ఇంత త్వరగా పూర్తి చేసి నివేదిక ఇస్తారని ఎవరూ అంచనా వేయలేదు. కానీ, అదనపు కలెక్టర్ నిక్కచ్చిగా విచారణ జరిపి, గుర్తించిన అక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలు, అందుకు సంబంధించిన ఆధారాలను జతపరుస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. జిల్లా విద్యాశాఖలో ఒక విషయంలో ఇంత త్వరగా విచారణ చేసి, సమర్పించిన దాఖలాలు లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అదనపు కలెక్టర్ వ్యవహరించిన తీరుపై విద్యాశాఖలోనే ప్రశంసలు కురుస్తున్నాయి.
అదనపు కలెక్టర్ నివేదికను పరిగణలోకి తీసుకొన్న కలెక్టర్, పూర్తి స్థాయి వివరాలు పరిశీలించి చర్యలు తీసుకోవడానికి జిల్లా ఇన్చార్జి డీఈవో మొండయ్యకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సూపరింటెండెంట్‌పై చర్యల కోసం వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)కి ఫైలు పంపించారు. దాంతో ఆర్జేడీ రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకొని, సూపరింటెండెంట్ నరసింహస్వామిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి ఈ ఉత్తర్వులను ఆపేందుకు కొన్ని సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నాలు చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే అదనపు కలెక్టర్ చర్యలకు సిఫారసు చేసిన వాటిలో కొన్నింటిని జిల్లా విద్యాధికారి తీసుకోవాల్సి ఉంది. కానీ, ఆర్జేడీ నిర్ణయం తీసుకున్నా ఇంకా డీఈవో నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రధానంగా అదనపు కలెక్టర్ సిఫారసు చేసిన అంశాలను చూస్తే.. జవాబు పత్రాల విక్రయానికి సంబంధించిన ఫైలు మిస్ కావడంపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్న ఏ మధుసూదన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఆయనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా విద్యాధికారికి ఉన్నది. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ) అధికారిగా నరసింహస్వామి పనిచేసిన కాలంలో జరిగిన అన్ని అధికారిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవడం, ఫైలు మిస్ కావడం, నిధులు మళ్లించడం వంటి అంశాలపై పోలీసు కేసు నమోదు చేయడం, దుర్వినియోగమైన మొత్తాన్ని బాధ్యుల నుంచి రివకరీ చేయడం వంటివి సిఫారసు చేశారు. వీటిపై జిల్లా ఇన్చార్జి డీఈవోనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆర్జేడీ నుంచి వచ్చే ఆదేశాలు ఆలస్యం అవుతాయన్న ఉద్దేశంతో డీఈవో.. అదనపు కలెక్టర్ ఇచ్చిన సిఫారసులపై చర్యలు తీసుకోలేదని తెలుస్తున్నది. అయితే ఇప్పుడు ఆర్జేడీ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటారా..? లేదా..? అన్నది చూడాల్సి ఉన్నది.