హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని సత్యనారాయణ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతుల మంజూరుపై వివరణ ఇవ్వాలని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నివాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయొద్దన్న వినతిపై అధికారులు చర్యలు చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ ఆ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేయడంతో జస్టిస్ట్ బీ విజయ్ సేన్రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ తదితరులతోపాటు మద్యం దుకాణ లైసెన్సు పొందిన ప్రైవేటు వ్యక్తికి నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేశారు.