హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): స్కూల్ ఆవరణల్లో క్షుద్రపూజలు జరిపిన ఘటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. జనగామ, వరంగల్, జగిత్యాల జిల్లాల్లో చోటుచేసుకున్న జంతు బలితో కూడిన క్షుద్రపూజలు ఓ పాఠశాల ఆవరణలో చోటుచేసుకున్న ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్టు తెలిపారు.
ఇటువంటి ఘటనలు పాఠశాల పిల్లల భద్రత, గౌరవం, మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నదని, అలాగే ప్రజా శాంతిభద్రత పరిరక్షణలో లోపాలు ఉన్నట్టు సూచిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జనగామ, వరంగల్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు, వరంగల్ సీపీ, జగిత్యాల ఎస్పీలు వాస్తవాలు, విచారణ పురోగతి, తీసుకున్న జాగ్రత్తలు, పాఠశాలల భద్రత కోసం చేపట్టే చర్యలపై నివేదికలను వచ్చేనెల 29లోపు సమర్పించాలని ఆదేశించారు.