AISF | కమాన్ చౌరస్తా, జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎలా అని, ప్రజాపాలన వచ్చిన విద్యారంగంలో మార్పు ఏం లేదని, రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ‘హలో విద్యార్థి.. చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా భారీ ర్యాలీగా కలెక్టరేట్ చేరుకుని విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు.
ఇక్కడ మణికంఠ రెడ్డి మాట్లాడుతూ, ఫీజు రీయీంబర్స్మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని, ప్రభుత్వం మారినా పాలన మాత్రం అలానే ఉందని, విద్యార్థులపై వివక్ష చూపిన ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు ఉండడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పలుమార్లు నిర్వదిక బంద్ నిర్వహించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనలేకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ 19 నెలల పాలనలో విద్యార్థులకు ఒరిగిందే ఏమీ లేదని, ప్రజా పాలనలో విద్యార్థుల సమస్యలు పేరుకుపోయాయని సంక్షేమ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విద్యార్థులను పరామర్శించడం లేదని, చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి ఉద్యమించే పరిస్థితి తెలంగాణలో వచ్చిందని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి కేటాయించడం ద్వారానే సమస్యలు పరిష్కారం ఆవుతాయని డిమాండ్ చేశారు.
అలాగే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని, దీని ద్వారా ఉన్నత విద్య విద్యార్థులకు మరింత అందుబాటులో వస్తే యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామారా వెంకటేష్, మచ్చ రమేష్, జిల్లా ఆఫీస్ బేరర్స్ మామిడిపల్లి హేమంత్, కేశబోయిన రాము యాదవ్, కనకం సాగర్, లద్దునూరి విష్ణు, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోల్లి సాయికృష్ణ, బోయిన విష్ణు, శ్రావణ్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.