ప్రవేశ పరీక్షల పేరుతో ప్రభుత్వం ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రవేశ పరీక్షలు రాస్తుండగా, దీన్ని అవకాశంగా ఉపయోగించుకుంటూ నిరుద్యోగ యువత నుంచి వివిధ రుసుముల పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రవేశ పరీక్షల కీ పేపర్లో ఇచ్చిన సమాధానాలపై అబ్జెక్షన్ చెప్పాలంటే ప్రత్యేక రుసుం చెల్లించాలని నిబంధన తీసుకువచ్చింది. ప్రశ్నించాలంటే రూ.500 కట్టాల్సి వస్తున్నదని విద్యార్థులు, నిరుద్యోగులు వాపోతున్నారు.
– జగిత్యాల, జూన్ 14(నమస్తే తెలంగాణ)
“మణికృష్ణ.. ఓ దిగువ మధ్య తరగతికి చెందిన యువకుడు. ఉస్మానియాలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన అతడు, ఈ నెల 1న కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎడ్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. బాగానే రాశానన్న తృప్తితో ఉండగా, ఈ నెల 5న రెస్పాన్స్ షీట్‌ను బీఎడ్ పరీక్షల కన్వీనర్ విడుదల చేశారు. తనకు సంబంధించిన షీట్‌ను మణికృష్ణ పరిశీలించగా, మూడింటి సమాధానాలు సరైనవిగా కనిపించలేదు. విద్యార్థికి ఉపాధ్యాయుడు హోం వర్క్ ఇవ్వడం ఉద్దేశం ఏంటి? అన్నది ప్రశ్న! దీనికి విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్నదాన్ని అభ్యాసం చేయడం అన్న ఆప్షన్‌ను మణికృష్ణ ఎంపిక చేసుకున్నాడు. కానీ, విశ్వవిద్యాలయం జారీ చేసిన రెస్పాన్స్షీట్లో ఈ ప్రశ్నకు ఉపాధ్యాయుడి పనిభారం తగ్గించుకోవడం అనే ఆప్షన్‌ను సమాధానంగా ప్రకటించారు.
అలాగే, మరో రెండు ప్రశ్నలకు కీ పేపర్లో ఇచ్చిన సమాధానాలపై సైతం మణికృష్ణకు అభ్యంతరం ఏర్పడింది. ఎడ్‌సెట్‌కు సంబంధించిన మ్యాన్‌వల్‌ను తీసి చదివాడు. రెస్పాన్స్షీట్లో కన్వీనర్ ఇచ్చిన సమాధానాలపై అబ్జెక్షన్లు ఉంటే ఈ నెల 9 వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ నెల 21న తుది ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. మూడు ప్రశ్నల జవాబులపై ఫిర్యాదు చేసేందుకు మణికృష్ణ సిద్ధమయ్యాడు. అయితే, ప్రతి ప్రశ్నకు సంబంధించి రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనడంతో మణికృష్ణ ఖంగుతిన్నాడు.
రెస్పాన్స్షీట్లోని సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని పేర్కొనడం, ఫిర్యాదు కోసం ప్రశ్నకు రూ.500 చెల్లించడం ఏంటో అర్థం కావడం లేదని ఎడ్‌సెట్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాడు. అభ్యంతరానికి రూ.500 చొప్పున రుసుం కట్టాల్సిందేనని, మీరు ఉటంకించిన ప్రశ్న, జవాబు సరైనది అయితే మీకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని, లేకుంటే లేదని చెప్పడంతో మణికృష్ణ బిత్తరపోయాడు. మూడు జవాబులకు అభ్యంతరాలు చెప్పాలంటే రూ.1500 చెల్లించడం తన వల్లకాదని మిన్నకుండిపోయాడు. మణికృష్ణకు ఇది ఎందుకో దోపిడీలా అనిపించింది. ఇప్పటికే ఎంట్రెన్స్ పరీక్షకు రూ.750 వసూలు చేసిన కన్వీనర్, మళ్లీ ఇప్పుడు అభ్యంతరాల పేరిట డబ్బులు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆయన భావిస్తున్నాడు.” ఇది ఒక్క మణికృష్ణకు కలిగిన అనుభవమే కాదు.. రాష్ట్రంలో ఎంట్రెన్స్ రాస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురవుతున్నది.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న పలు ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన ఫీజులు చుక్కల్లోకి చేరాయి. ఏటా పది వరకు ప్రధాన ఎంట్రెన్స్‌లు జరుగుతున్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులను గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదివేందుకు సంబంధించిన టీజీ ఈఏపీ సెట్ అందులో ప్రధానమైంది. ఏటా ఈ ఎంట్రెన్స్‌కు దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది హాజరవుతారు. అయితే ఈ ఎంట్రెన్స్ ఫీజును పెంచేశారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ విభాగానికి సంబంధించిన వారికి రూ.500, ఓసీ, బీసీ విభాగాల వారికి రూ.900 ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక రెండు కాంబినేషన్లకు సంబంధించిన పరీక్షలు రాస్తే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.వెయ్యి, జనరల్, బీసీ విద్యార్థులు రూ.1800 చెల్లించాలని నిర్దేశించారు.
ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువ. పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరేందుకు టీజీఈసెట్ను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, జనరల్, బీసీ విద్యార్థులు రూ.900 చెల్లించాల్సి వస్తున్నది. రాష్ట్రంలో కీలకమైన ఎంట్రెన్స్‌లు అయిన టీజీ ఐసెట్ (ఎంబీఏ, ఎంసీఏ) ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన బీఎడ్ ఎంట్రెన్స్‌లు రాసేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. లాసెట్‌కు సంబంధించిన ఎంట్రెన్స్ రాసేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.900 చెల్లించాలని నిర్దేశించారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్లోని డీపెడ్, బీపెడ్ కోర్సు ఎంట్రెన్స్‌కు రూ.900, రూ.500 చొప్పున ఎంట్రెన్స్ ఫీజు చెల్లించాల్సిందే. డిగ్రీ తర్వాత పోస్టు గ్రాడ్యువేషన్ కోర్సుల కోసం నిర్వహించే సిపిగెట్ ఎంట్రెన్స్ పరీక్ష రాయాలంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.800 చెల్లించాల్సిందే. మళ్లీ ఎన్ని సబ్జెక్టుల్లో పీజీ ఎంట్రెన్స్ రాస్తే అన్ని సబ్జెక్టులకు రూ.400 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇక పీజీఇసెట్ (ఇంజనీరింగ్, ఫార్మసీ) పరీక్షకు సంబంధించి ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.600, జనరల్, బీసీ విద్యార్థులు రూ.1100 ఎంట్రెన్స్ ఫీజు కడుతున్నారు. ఇలా ప్రతి ఎంట్రెన్స్‌కు వందల రూపాయల చొప్పున ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తున్నారు.
ఒకప్పుడు ఎంట్రెన్స్ పరీక్షలు అంటే విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించి ఉన్నత చదువుల్లో ప్రవేశాలు కల్పించేవి. వీటి ఫీజులు సైతం నామమాత్రంగా ఉండేవి. అయితే, నేడు ఎంట్రెన్స్ పరీక్షల ఫీజులు తడిసి మోపెడు అవుతున్నాయి. దీనికి తోడు ఎంట్రెన్స్ నిర్వాహకులు అభ్యంతరాలు చెప్పవచ్చునంటూ పేర్కొంటూ, దానిని ఆదాయమార్గంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దం క్రితం వరకు మ్యాన్వల్గా నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్షలు పెరిగిన సాంకేతిక నైపుణ్యం నేపథ్యంలో అన్ని కంప్యూటరైజ్డ్ అయ్యాయి. ప్రతి ఎంట్రెన్స్ నిర్వహించిన తర్వాత నిర్వహణ చేస్తున్న కన్వీనర్ పేరిట రెస్పాన్స్ షీట్లు ఇస్తూ వస్తున్నారు. ఈ రెస్సాన్స్ షీట్లను విద్యార్థి ఆన్లైన్లో చూసుకోవచ్చు. రెస్పాన్స్షీట్లో విద్యార్థి రాసిన జవాబులు, సరైన సమాధానాలను ఉంచుతున్నారు.
ఈ సమాధానాలను చూసుకున్న విద్యార్థులకు తమకు ఎన్ని మార్కులు వస్తాయో ఫైనల్ రిజల్ట్స్ కంటే ముందే తెలిసిపోతుంది. అయితే, ఈ రెస్పాన్స్ షీట్‌లోని సమాధానాలు తుది ఫలితాలు కావని, కన్వీనర్ ఇచ్చిన సరైన జవాబులపై ఏమైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే నాలుగైదు రోజుల్లో ఫిర్యాదులు చేసుకోవచ్చునని పేర్కొంటున్నారు. అయితే, అభ్యంతరానికి రూ.500 చొప్పున విద్యార్థి చెల్లించాలని మెలిక పెడుతున్నారు. ఒకవేళ విద్యార్థి అభ్యంతరం సరైనదని తేలితే రూ.500 తిరిగి ఇస్తామని, లేకుంటే ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. ఇదే ప్రక్రియను అన్ని ఎంట్రెన్స్ పరీక్షలు చేపడుతున్నాయి. విద్యార్థుల వద్ద నుంచి అభ్యంతరాల పేరిట లక్షలాది రూపాయలను దండుకునే ప్రయత్నం నిరభ్యంతరంగా సాగుతూనే ఉందని విద్యార్థులు వాపోతున్నారు.
సాంకేతిక నైపుణ్యం పెరిగి రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాక, అభ్యంతరాలకు రూ.500 చొప్పున వసూలు చేయడం అన్యాయం అంటున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల బలహీనతలు గుర్తించి వారి వద్ద నుంచి ఇలా అభ్యంతరాల పేరిట డబ్బులు గుంజడం సరికాదంటున్నారు. మొన్నటి వరకు అబ్జెక్షన్లకు డబ్బులు వసూలు చేయలేదని, ఈ రెండేండ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాం, ఇంటర్ పాసైతే లక్ష రూపాయలు, డిగ్రీ పాసైతే ఐదు లక్షలు, పీజీ పాసైతే పది లక్షల పారితోషికం అంటూ మభ్యపెట్టారని, అలాగే ఓవర్సీస్ పథకాలకు ఇరవై లక్షల ఆర్థిక సాయం అంటూ ఊదరగొట్టారని, అవి చేసింది లేదు.. పోయింది లేదు.. కానీ, కనీసం ఎంట్రెన్స్ పరీక్షల రుసుములు, చాలెంజింగ్ ప్రశ్నలకు తీసుకునే ఫీజులనైనా మాఫీ చేయాలని యువత డిమాండ్ చేస్తున్నది.