Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 11 : రామగుండం బల్దియాలో మళ్లీ కూల్చివేతల భయం మొదలైంది. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఈ రాత్రి బుల్డోజర్ ఎటు నుంచి దూసుకొస్తుందోనని నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నిన్నటికీ నిన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తా పోచమ్మ మైదానంలో గల ఓ బిల్డింగ్ ను అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని జేసీబీలతో వచ్చి కూల్చివేసేందుకు ఉపక్రమించగా బాధితులు అడ్డుకోవడంతో తోక ముడిచారు.
ఈ ఘటన మరవకముందే స్థానిక ప్రధాన చౌరస్తాలో గల రేడియం శ్రీను అనే వ్యక్తి ఇంటికి నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి ఇల్లు ఖాళీ చేయాలనీ, లేదంటే కూల్చివేస్తామని చెప్పడంతో ఆ కుటుంబం ఆందోళనకు గురవుతోంది. ‘మీది రేకుల ఇల్లు… చూడటానికి బాగాలేదు… అది కూల్చివేసి జీ ప్లస్ 1 బిల్డింగ్ కట్టుకోవాలనీ, లేదంటే తామే కూల్చివేస్తామని’ టౌన్ ప్లానింగ్ అధికారులు బెదిరిస్తున్నారని బాధితుడు రేడియం శ్రీను వాపోయాడు.
మున్సిపల్ సిబ్బంది ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామని చెబుతున్న సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. గతంలోనే ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నించగా బాధితులు ఎన్ హెచ్ఆర్ సీ తోపాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయగా విచారణకు తెలంగాణ సీఎస్ ను ఆదేశించారు. ఈ క్రమంలో ఇల్లు కూల్చివేతకు వచ్చిన సిబ్బందితో ఎన్ హెచ్ ఆర్ సీ లో కేసు విచారణలో ఉండగా ఏలా కూల్చివేస్తారని ఇంటి యజమాని ప్రశ్నించారు.
కమిషనర్ ఆదేశిస్తేనే తాము కూల్చివేసేందుకు వస్తున్నామని సిబ్బంది చెప్పడం గమనార్హం. మళ్లీ కూల్చివేతలు మొదలు కావడంతో నగరంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. శని, ఆదివారాల్లో అదను చూసి నగరంలో కూల్చివేతలు జరగవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏ క్షణంలో ఎటు నుంచి బుల్డోజర్ దూసుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.