Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 31 : మోంథా తుఫాన్ తో కెనాల్ లో నీటితోపాటు రాయిన్ చెరువు నీరు రావడంతో వరద ఉధృతికి కెనాల్ దిగిపోవడంతో చుట్టుపక్కల రైతుల పంట భూములలో ఇసుక బీటలు వారి పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. యాసంగి కాలంలో వరి పంటలు వేసిన రైతులకు మిడ్ మానేరు కుడికాలు ద్వారా 15 రోజుల క్రితం నీటిని విడుదల చేయడంతో ఓబులాపూర్ ఇందుర్తి సీతారాంపూర్ పీచుపల్లి వరకు వచ్చిన కెనాల్ నీటిని పర్లపెల్లి నుండి తిమ్మాపూర్ రైతులకు సాగునీటికి అందిస్తున్నారు. రేకొండ కెనాల్ తెగి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ పనులు చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలుమార్లు అధికార దృష్టికి తీసుకెళ్లారు. కాగా శనివారం అధికారులు వర్షానికి కెనాల్ తెగిన ప్రాంతాల్లో మట్టిని ట్రాక్టర్ల ద్వారా పూడ్చేందుకు రాగా రైతులు అడ్డుకున్నారు. ప్రతి ఏటా చెరువు నీటితో పాటు కెనాల్ లో నీరు ఎక్కువ కావడంతో కెనాల్ తెగుతుందని, ప్రతీ ఏటా పంటలకు నష్టం జరుగుతుందని రైతులు పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎగువ నుండి వస్తున్న చెరువు నీరు కెనాల్ లోకి రాకుండా పైపుల ద్వారా పంపించే ప్రయత్నం చేయాలని రైతులు పనులను అడ్డుకున్నారు.
విషయం తెలిసిన వెంటనే మిడ్ మానేరు డిఈ సదాశివ్, స్థానిక సర్పంచ్ అల్లెపు సంపత్ పనులు జరుగుతున్న స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పైపులను వేయించి ఎగువ నుండి వచ్చే వర్షపు నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఆందోళన చేసిన వారిలో రైతులు అరిగెల రమేష్, పిట్టల వెంకటరాజం, అరిగెల ధర్మయ్య, చందవేని వెంకన్న, అరిగెల రమేష్ తదితరులున్నారు.
వారం రోజుల్లో సైదాపూర్ మండలానికి నీటి విడుదల : సదాశివ్, డీఈ, మిడ్ మానేర్
వారం రోజుల్లోగా చిగురుమామిడి మండలం రేకొండ, బొమ్మనపల్లి తో పాటు సైదాపూర్ మండలానికి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తామని మిడ్ మానేరు డీఈ సదాశివ తెలిపారు. నాలుగు నెలల క్రితం వచ్చిన తుఫాన్ కారణంగా రేకొండ లోని పలు ప్రాంతాల్లో కాలువ దిగడం వల్ల దిగువన నీటిని విడుదల కాగా చేయలేక పోయామన్నారు. ప్రస్తుతం కెనాల్ కు మరమ్మత్తు పనులు నడుస్తున్నాయని వారం రోజుల్లోగా నీటిని విడుదల చేస్తామన్నారు. చిగురుమామిడి మండలంలోని పర్లపల్లి వరకు తిమ్మాపూర్ మండలానికి సాగునీటికి ప్రతిరోజు 280 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతీ రైతుకు నీరు అందుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఈ పేర్కొన్నారు.