వానకాలం సీజన్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఒక్క బస్తా కోసం రోజుల తరబడి తిరిగారు. సకాలంలో దొరకక దిగుబడులు నష్టపోయారు. ప్రస్తుతం అలాంటి భయమే వెంటాడుతున్నది. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూరియా కోసం గోస పడే పరిస్థితి కనిపిస్తున్నది. యాప్‌లో యూరియా బుకింగ్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడం, సీజన్ ప్రారంభంలోనే రైతులు బారులు తీరడం ఆందోళన కలిగిస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడాల్సి వస్తున్నది. వానకాలంలో ఒక్క బస్తా యూరియా కోసం ఏ విధంగా కష్టపడాల్సి వచ్చిందో.. ఇప్పుడు యాసంగిలోనూ అలాంటి గోసే ఎదురుయ్యేలా ఉన్నది. డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ వంటి ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ యూరియా తిప్పలు మాత్రం తప్పేలా లేవు. ప్రస్తుతం సొసైటీలు, డీలర్ల వద్ద యూరియా ఉన్నదా.. లేదా? తెలియని పరిస్థితి ఉన్నది. నాట్లు పడిన తర్వాత దొరకకపోతే నరకయాతన అనుభవించాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ శివారులోని దుర్షేడ్ సింగిల్ విండోలో నిల్వలు లేక ఐదు రోజులవుతుందని, ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా అలాట్ చేయ లేదని వాపోతున్నారు. మరిన్ని సింగిల్ విండోల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నదని తెలిసి కొందరు రైతులు ముందుగానే యూరియా తీసుకెళ్లినట్టు, వీరికి ఎంత అవసరం ఉన్నదనేది పరిశీలించకుండానే పంపిణీ చేశారనే ఆరోపణలు అధికారులపై వస్తున్నాయి.
నిజానికి ఎకరాకు 3 యూరియా బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఎకరంలోపు రైతులకు ఒకే సారి ఇస్తుంటే.. ఐదెకరాలు దాటిన రైతులకు రెండు దఫాల్లో, 10 నుంచి 20 ఎకరాలున్న రైతులకు మూడు దఫాల్లో, 20 ఎకరాలు దాటి ఉన్న రైతులకు నాలుగు దఫాల్లో యూరియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి జిల్లా యాప్ ద్వారా అందిస్తుండగా.. మిగతా కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఆధార్ కార్డుపైనే రైతులకు అందిస్తున్నారు. కానీ, కొద్ది రోజుల్లోనే యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే యూరియా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చాలా మంది నిరక్షరాస్యులైన రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవు. యూరియా బుక్ చేసుకోవాలంటే ఇతరులపైనే ఆధార పడాల్సి ఉంటుంది. యాప్‌లో బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్లి తీసుకోవాలో తెలియని పరిస్థితి కూడా రైతులకు సవాలుగా మారనున్నది. వచ్చే జనవరిలో నాట్లు మొదలైన తర్వాత రైతులకు యూరియా కోసం నరక యాతన తప్పేలా లేదు.
ఇదీ గోపాల్పూర్లోనే ఓ రైతు సాగు చేసిన మక్క పంట. యూరియా అందించకపోవడంతో ఒక చోట ఎత్తుగా.. మరో చోట తక్కువ ఎత్తుగా పెరిగింది. మక్క సాగు చేసినపుడు రైతులు సాదారణంగా దుక్కిలో డీఏపీ వాడుతారు. 120 రోజుల్లో చేతికి వచ్చే మక్క విత్తిన నెల రోజుల్లో పైపాటుగా ఒక సారి, పీచు జల్లు దశల్లో అంటే 50-60 రోజుల్లో ఒకసారి తప్పని సరిగా యూరియా అందించాల్సి ఉంటుంది. ఈ మక్క విత్తి నెలదాటింది. కానీ, ఇప్పటి వరకు యూరియా అందించ లేదు. ఫలితంగా చేను మొత్తం యూనిఫాంగా కాకుండా ఎగుడు దిగుడుగా కనిపిస్తున్నది. సకాలంలో యూరియా అందక ఒక్కో మొక్క ఎర్రబారుతున్నది. ఇప్పటికే మక్క సాగు చేసిన రైతులు చాలా మంది యూరియా కోసం వెతుకుతున్నారు. కానీ, అందుబాటులో లేక పోవడంతో ఏమీ చేయలేక పంటను అలా వదిలేస్తున్నారు. ఫలితంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు.

కరీంనగర్ శివారులోని గోపాల్‌పూర్‌లో క్యాబేజీ పంటను చూపుతున్న ఈ రైతు పేరు మంద తిరుపతి. 60 రోజుల్లో పంట చేతికి వస్తుందని వేశాడు. క్యాబేజీ విత్తిన సమయంలో నత్రజని, భాస్వరం పొటాష్ కోసం ఎన్పీకే వాడాడు. విత్తిన 25 రోజుల తర్వాత పంటకు నత్రజని కోసం పైపాటుగా యూరియా వాడాల్సి ఉన్నా.. దొరకక పోవడంతో నానో యూరియా పిచికారీ చేశాడు. అయినా ఆశించిన ఎదుగుదల కనిపించ లేదు. పంట విత్తి 45 రోజలవుతున్నా చుట్టలు రాలేదు. ఇంకో పదిహేను రోజుల్లో పంట కోయాల్సి ఉన్నా.. సరైన గ్రోతింగ్ రాలేదు. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా వచ్చింది. దీంతో మరోకొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒక్క తిరుపతే కాదు.. కూరగాయలుఏ సాగు చేసిన ప్రతి రైతు పరిస్థితి ఇలాగే ఉన్నది. పంటలు చలికి నత్రజని స్వీకరించే పరిస్థితి లేకపోగా.. ఈ సమయంలో పై పాటుగా యూరియా తప్పని సరిగా వాడాలి. కానీ, కొరత కారణంగా కూరగాయలు సాగు చేసిన రైతులు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
యూరియా సకాలంలో వినియోగించకపోవడంతో పంటలపై ప్రభావం పడుతున్నది. వానకాలంలో చాలా మంది రైతుల దిగుబడులు తగ్గాయి. వరి ఎకరానికి సగటున 25 -32 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ, ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. యాసంగిలోనైనా సకాలంలో యూరియా అందుతుందని ఆశిస్తే.. ప్రభుత్వం యాప్ పేరిట మరో కొత్త ప్రయోగం చేస్తున్నది. దీనిపై ఏ రైతుకు పూర్తి అవగాహన లేదు. చాలా మంది రైతులు నిరాక్షరాస్యులే. యాప్‌ను ఎలా వాడతరు? రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించగలిగితే పుష్కలంగా పంటలు పండిస్తారు. సొసైటీల వారీగా కాకుండా గ్రామాల వారీగా యూరియాను విక్రయిస్తే బాగుంటుంది.
కరీంనగర్ జిల్లాలో ఈ సారి 2.72 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో మక్క, 600 ఎకరాల్లో వేరుశనగ, 350 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 550 ఎకరాల్లో పొగాకు, 240 ఎకరాల్లో పప్పుదినుసు పంటలతోపాటు 12,040 ఎకరాల్లో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ పంటల కోసం 42,585 మెట్రిక్ టన్నుల యూరియా, 8,724 మెట్రిక్ టన్నుల డీఏపీ, 22,092 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 6,092 మెట్రిక్ టన్నుల ఎంవోపీ ఎరువులు అవసరం ఉంటాయని ఇండెంట్ ఇచ్చారు. ప్రస్తుతం మక్క, కూరగాయ పంటలకు పైపాటు వేసుకునేందుకు యూరియా అవసరం ఉంటుంది. కానీ, ఎక్కడా అందుబాటులో లేదని రైతులు వాపోతున్నారు. 4,238 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతుంటే రైతులు మాత్రం ఎక్కడా లేవని వాదిస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఫర్టిలైజర్ యాప్‌లో మాత్రం కరీంనగర్ జిల్లాలో స్టాక్ పొజిషన్ జీరోగా చూపుతున్నది. అందులో ఏది వాస్తవమో తెలియక రైతుల్లో అయోమయం కనిపిస్తున్నది.