land issues | సారంగాపూర్, మే 5: రైతులు భూసమస్యల పై రెవెన్యూ సదస్సు ల్లో దరఖాస్తులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని రంగపేట, బీర్ పూర్ మండలంలో నర్సింహులపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం–2025, భూభారతి నియమావళి–2025 అమలుకు సంబంధించి జూన్ 3నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు జగిత్యాల జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ లోని అన్ని మండలాల రెవెన్యూ గ్రామాలలో జూన్ 3, నుండి జూన్ 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులలో అధికారులు గ్రామాల వారీగా సందర్శించి, రైతుల భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారని రైతులు తమ భూ సమస్యల దరఖాస్తులతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను నేరుగా పరిశీలన చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ , సారంగాపూర్, బీర్పూర్ తహసీల్దార్లు వాహిదొద్దీన్, సుజాత, ఎంపీడీవోలు గంగాధర్, లచ్చలు, రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.