
Kathalapur | కథలాపూర్, మే 18 : కథలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల విషయంలో జాప్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులో, తండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి సంఘీభావం ప్రకటించి రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతులను కావాలని కక్షపూరితంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారని రైతులు డిమాండ్ చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీలైనంత తొందరగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి పూర్తిచేసి రైతులకు సహకరించాలని కోరారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్ రమేష్ , ఆర్ఐ రవీందర్ చేరుకొని రైతులకు సమస్యను వివరించి త్వరగా కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గండ్ర కిరణ్ రావు, మంచాల మహేష్, పాలెపు రాజేష్, వర్దినేని నాగేశ్వరరావు, గంగం గంగారెడ్డి, ధరావత్ సీతారాం నాయక్, సర్పంచ్ రామోళ్ల రమేష్, ఆయా గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.