గంభీరావుపేట, ఫిబ్రవరి 18: ఆన్లైన్ పేరిట తమను గోస పెట్టవద్దని, యూరియా కోసం తెచ్చిన యాప్ వద్దని గంభీరావుపేట మండల రైతులు స్పష్టం చేశారు. యూరియా బస్తాలను పూర్వ పద్ధతిలో నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గంభీరావుపేటలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. అన్నదాతలందరికీ స్మార్ట్ ఫోన్లు లేవని, బుక్ చేసుకుంటే ఓటీపీలు రావడం లేదని, నో స్టాక్ వస్తున్నదని, సర్వర్ డౌన్ అవుతున్నదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి యాప్‌ను తొలగించాలని కోరారు. ఈ నిరసనలో రైతులు చిట్టంపల్లి రాజు, కమలాకర్‌రెడ్డి, రాజయ్య, మల్లయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు.