Farmers protest | కోరుట్ల రూరల్, ఆగస్టు 21 : యూరియా బస్తాల కోసం రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ ముందు గల రహదారిపై యూరియా కోసం రైతులకు సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇప్పటికే వర్షాలు సరిగా లేకపోవడంతో పంటను లేటుగా వేయడం, సకాలంలో యూరియా అందక నానాతంటాలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
సహకార సంఘాల్లో రైతులకు సరిపోయే యూరియా బస్తాలు ఇవ్వక పోవడంతో పంటల సాగు పనులను వదిలేసి సహకార సంఘాల ముందు యూరియా కోసం రోజంతా ఉండాల్సి వస్తోంది. అయినప్పటికి యూరియా ముందున్న వారికే సరిపోతుంది. ఎకరానికి ఒక బస్తా చొప్పున అందించడంతో అది దేనికి సరిపోవడం లేదు. గంటల తరబడి సొసైటి వద్ద ఎదురు చూసి చూసి ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
ఇవ్వాలా … రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.. : వనతడుపుల అంజయ్య, మాజీ సర్పంచ్ కల్లూరు (బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు)
యూరియా కోసం సొసైటీ వాళ్లని అడిగితే ఇవ్వాళా రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్పా… రైతులకు అవసరమైన యూరియాను అందించడం లేదు. మాదాపూర్ సోసైటీ పరిధిలో మా గ్రామంలో ఎంత మంది రైతులున్నారు. వారికి ఎంత యూరియా అవసరం ఉంటుందన్న విషయం సోసైటీ వారికి తెలియదా… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముందుగానే యూరియాను అందుబాటులో ఉంచిన విషయం వారికి తెలియదా… కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఇబ్బందలుకు గురిచెయ్యాలనే ఉద్దేశంతో యూరియా కోరతను సృష్టిస్తుంది. రైతులు గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది. రైతులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడ్డ దాఖలాలు లేవు.