నాట్లు వేసి యూరియా కోసం ఎదురు చేస్తున్న రైతులకు నిరాశే మిగులుతున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో ఎక్కడ చూసినా అరిగోస పడాల్సి వస్తున్నది. మంగళవారం కూడా అన్నదాతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిగాపులు గాశారు. ఏ కేంద్రం వద్ద చూసినా పెద్ద సంఖ్యలో బారులు తీరారు. వర్షంలోనూ గొడుగులు పట్టుకొని, గంటల తరబడి నిరీక్షించారు.
అయినా యూరియా దొరక్క వందల మంది రైతులు సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌లో ధర్నాలు చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ ఎరువుల కోసం ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. కానీ, ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో సాగు పనులు వదిలి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన చెందారు.
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి తిరుగుతున్నా సరిపడా దొరకడం లేదు. మంగళవారం కూడా ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపించారు. ఎప్పటిలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పడరాని పాట్లు పడ్డారు. ఎల్లారెడ్డిపేటలో ధర్నా చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ముస్తాబాద్‌లోని సహకార సంఘానికి ఉదయమే రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. యూరియా పంపిణీ చేయకపోవడంతో ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
పనులు వదులుకొని తిరగాల్సి వస్తున్నదని మండిపడ్డారు. వ్యవసాయ అధికారులు సముదాయించడంతో ధర్నా విరమించారు. సాయంత్రం డీఏవో అఫ్జల్‌బేగం సమక్షంలో 240 బ్యాగులు పంపిణీ చేశారు. రుద్రంగి రైతు వేదిక వద్ద ఆగ్రో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేయగా, ఉదయం నుండే రైతులు బారులు తీరారు. 230 యూరియా బస్తాలు అందించడంతో ఎగబడ్డారు. ఒక్కరికి ఒక బస్తా పంపిణీ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి నిరీక్షించినా యూరియా దొరకలేదని కొందరు రైతులు ఆగ్రహించారు.
వేములవాడ సహకార సంఘానికి 444 యూరియా బస్తాలు రాగా, పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేశారు. 160 మందికి రెండు, మూడు చొప్పున అందించారు. బోయినపల్లి సొసైటీలో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలోనూ రైతులు ఇబ్బంది పడ్డారు. మానకొండూర్ మండలం కొండపల్కల, మద్దికుంట, చిగురుమామిడి మండలం చిగురుమామిడి, ఇందుర్తిలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని గంటల తరబడి నిరీక్షించారు.
గంగాధర మండలం కురిక్యాల సొసైటీకి 450 బ్యాగులు వచ్చిన విషయం తెలుసుకొని తెల్లవారుజామున 5 గంటల నుంచే బారులు తీరారు. రైతుకు రెండు బ్యాగుల చొప్పున ఇచ్చారు. గంగాధర సహకార సంఘానికి 450 బస్తాలు రాగా, రైతులు ఎగబడ్డారు. ఎకరాకు ఒక బస్తా మాత్రమే ఇవ్వడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రామడుగు, కొక్కెరకుంట సొసైటీల పరిధిలో రైతులు ఇబ్బందులు పడ్డారు.
రామడుగులో 450 బ్యాగులు, కొక్కెరకుంటలో 194 బ్యాగులు రాగా, విషయం తెలిసి రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రామడుగు సొసైటీ పరిధిలోని గోపాల్రావుపేటలో రైతులు చెప్పులను క్యూలైన్లో ఉంచారు. ఆయాచోట్ల సరిపడా అందకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలోనూ రైతులు ఇబ్బంది పడ్డారు. మంథనిలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బస్టాండ్ ఎదుట ఉన్న రాఘవులనగర్ బోర్డు వరకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు రోడ్డుపై క్యూలైన్లో ఉంచారు.
రాత్రివేళ పడిగాపులు
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 12 : తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని నేరెళ్ల సింగిల్‌విండో గోదాంకు మంగళవారం ఒక్క లోడ్ యూరియా (330 బ్యాగులు) వచ్చింది. బుధవారం ఉదయాన్నే అందిస్తామని సమాచారం అందించారు. దీంతో సుమారు వంద మందికి పైగా రైతులు మంగళవారం రాత్రే గోదాం వద్దకు చేరుకున్నారు. ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌లను ఉంచి, నంబర్లు వేయించుకున్నారు. వాటికి కాపలాగా పలువురు రైతులు గోదాం వద్దే పడిగాపులు కాస్తున్నారు.
వర్షంలోనూ తండ్లాట
చిగురుమామిడి/ మానకొండూర్ రూరల్, ఆగస్టు 12 : రైతులు వర్షంలోనూ యూరియా కోసం గోస పడ్డారు. చిగురుమామిడి పీఏసీఎస్ 444 యూరియా బ్యాగులు రాగా, 700 మంది ఉదయం నుంచే బారులు తీరారు. ఇందుర్తి పీఏసీఎస్‌కు 680 బ్యాగులు రాగా, సుమారు వెయ్యి మంది తరలివచ్చారు. లైన్లో చెప్పులు ఉంచా రు. ఆయాచోట్ల వాన పడగా, మహిళలు, రైతులు గొడుగులు పట్టుకొని నిల్చున్నారు. యూరియా సరిపడా అం దకపోవడంతో వందల మంది నిరాశగా వెనుదిరిగారు. మానకొండూర్ పీఏసీఎస్ పరిధిలోని కొండపల్కల, మద్దికుంట గ్రామాల్లోని సెంటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని గంటల తరబడి నిరీక్షించారు. ఈ రెండు గ్రామాలకు 460 బస్తాలు రాగా, ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. హుజూరాబాద్ జూపాక సింగిల్ విండో పరిధిలోని చెల్పూర్ సొసైటీ కార్యాలయం ఎదుట బారులు తీరా రు. వర్షంలోనే క్యూలో ఉన్నారు.
ఎల్లారెడ్డిపేటలో ధర్నా
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 12: ఎల్లారెడ్డిపేట మండల రైతులు రోడ్డెక్కారు. యూరియా కోసం ధర్నా చేశారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గోదాముల్లో యూరియా దొరకని రైతులకు మంగళవారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాంకు రావాలని సూచించారు. దీంతో ఉదయం 6 గంటల నుంచే తరలివచ్చారు. మొదట 300 మంది వరకు రాగా, గోదాం సిబ్బంది పేర్లను రాసుకున్నారు. ఇంకా రైతులు వస్తుండడం చూసి బందోబస్తు కోసం ముందస్తుగా పోలీసులను రప్పించారు. మొత్తం సుమారు 600 మంది రైతులు రాగా, ఉదయం 9.30గంటల నుంచి పోలీస్ పహారా మధ్యన పంపిణీ ప్రారంభించారు.
అయితే అక్కడ కేవలం ఒకే లోడు అంటే 440 యూరియా బ్యాగులు మాత్రమే ఉండడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. అవి ఎవరికి సరిపోతాయని ప్రశ్నిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ధర్నా చేస్తే కేసులవుతాయని పోలీసులు హెచ్చరించినా వినకుండా రోడ్డుపైకి చేరుకున్నారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధర్నాలో బైఠాయించారు. రైతులు అరగంట పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తం 600 మంది వస్తే కేవలం 212 మందికే యూరియా ఇచ్చారని, మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
పంటలకు సకాలంలో యూరియా వేయకపోతే నష్టపోతామని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించాలని, యూరియా సరిపడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏవో రాజశేఖర్ అక్కడకు వచ్చి, త్వరలోనే యూరియా అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆందోళనలో బీఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, గుల్లపల్లి నర్సింహారెడ్డి, నాయకులు నమిలికొండ శ్రీనివాస్, పిల్లి కిషన్, నర్సాగౌడ్, జబ్బార్, అజ్మీరా రాజునాయక్, సుధాకర్‌రావు, కళ్యాణ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తం
రైతులు యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నరు. ఒక రైతుకు ఐదెకరాలుంటే ఒక్క బస్తానే ఇస్తున్నరు. అవి ఏం సరిపోతయ్? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఇబ్బంది లేకుండె. కాంగ్రెస్ పాలనల మళ్లీ గోస మొదలైంది. చెప్పులు లైన్ల పెట్టుడు, పాస్‌బుక్కులు లైన్ల పెట్టే దుస్థితి వచ్చింది. అబ్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల బాధలు పట్టించుకుంట లేదు. మేం బీఆర్ఎస్ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నం. వెంటేనే యూరియాను అందించాలి. లేకపోతే బరాబర్ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తం.
-తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు