– సీఐ చరమందరాజు
హుజూర్నగర్, ఫిబ్రవరి 23 : హుజూర్నగర్ పట్టణంలోని టౌన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్కిల్ పరిధిలోని సిమెంట్ పరిశ్రమల ట్రాన్స్పోర్ట్, లారీ అసోసియేషన్, ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్, క్యాబ్ డ్రైవర్లకు ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన సీనియర్ కంటి వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమగు వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కె.నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హాజరు కానున్నారని, ఈ అవకాశాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని సీఐ కోరారు. ఈ సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు పాల్గొన్నారు.