Peddapalli | రామగిరి, మార్చి 18 : రత్నాపూర్ శివారులో గల మేడిపల్లిలో తమ భూములను ఇండస్ట్రీయల్ పార్క్‌కు ఇచ్చేదే లేదని స్థల పరిశీలన కోసం వచ్చిన కంపెనీ ప్రతినిధులను, మంథని ఆర్డీవో సురేష్, ఇండస్ట్రీయల్ జోనల్ మేనేజర్ మహేశ్వర్ రావు, తహసీల్దార్ సుమన్ అధికారులను, పోలీసులను రైతులు అడ్డుకున్నారు.
స్థల పరిశీలనకు అధికారులు వస్తున్నట్లు ముందుగా సమాచారం అందుకున్న రైతులు రత్నాపూర్ గ్రామ ప్రధాన కూడలిలో బైఠాయించి అధికారులను అడ్డుకున్నారు. వెంట ఉన్న మంథని సీఐ రాజు, ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రైతులను వారించారు. అయినప్పటికీ రైతులు ససేమీరా అన్నారు. తమ ప్రాణాలు తీసిన భూములు ఇవ్వమని, అధికారులు వెళ్లిపోవాలని ఆందోళనకు దిగారు.
గోదావరిఖని ఏసీపీ రమేష్ రైతులను చెదరగొట్టేందుకు యత్నించగా, స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు నాలుగు గంటల పాటు రైతులు రోడ్డుపై మండుటెండలో బైఠాయించి అధికారులు స్థల పరిశీలనకు వెళ్లకుండా ఆందోళన చేశారు. దీంతో హైరానా పడిన అధికారులు పోలీసులకు పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతో రైతులతో మాట్లాడి ఆందోళన ఆపాలని వెనుదిరిగి వెళ్లారు.