యూరియా కొరత లేదని యంత్రాంగం చెబుతున్నది. అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కొరత వెంటాడుతున్నది. ఎక్కడ చూసినా అరకొరగానే అందుతున్నది. సరిపడా యూరియా నిల్వలుంటే తామెందుకు ఆందోళన చేస్తామని రైతాంగం ప్రశ్నిస్తున్నది. అయితే కొరత ఏర్పడిందా..? లేక అంచనా తప్పిందా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తుండగా, యాసంగి సీజన్లో యూరియా వాడకం అధికంగా పెరిగిందని చెబుతున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాల వారీగా పంటల సాగు ప్రణాళిక సిద్ధం చేసినప్పుడే ఏ పంటకు ఎంత ఎరువు అవసరం అనేది అధికారులు లెక్కలు వేస్తారు. ఆ అంచనా మేరకు యూరియా, పొటాష్, కాంప్లెక్స్ తదితర ఎరువుల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ ఇస్తారు. ఆ ప్రకారమే విడతల వారీగా ప్రభుత్వం ఎరువులను సరఫరా చేస్తుంది. ఈ యాసంగి సీజన్‌కు కూడా ఇదే విధంగా కరీంనగర్ జిల్లాకు 42,416 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని ప్రభుత్వానికి నివేదించారు. ఏ నెలలో ఎంత అవసరమో కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
దాని ఆధారంగానే ప్రభుత్వం ఎరువులను సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ సీజన్లో కరీంగనర్ జిల్లా వ్యాప్తంగా 2.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అందులో 1.80 లక్షల ఎకరాల్లో విత్తన వరి సాగు చేస్తుండగా, దీనిలోనే యూరియా అధికంగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం పంట పెరుగుదల దశలో చలితీవ్రత అధికంగా ఉండడంతో వరి ఎదుగుల తగ్గినట్టు తెలుస్తున్నది. ఈ సమయంలో పంట ఎదగాలంటే యూరియా అధికంగా వినియోగించాల్సి వస్తుంది. అలాగే ఈ సారి జిల్లాలో 30 వేల ఎకరాల్లో మక్క సాగు చేస్తుండగా, ఈ పంటకు ఎకరానికి 6 నుంచి 8 బస్తాల యూరియా వినియోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్లో అంచనాకు మించి యూరియా వినియోగం పెరిగినట్టు వ్యవసాయశాఖ చెబుతున్నది.
కరీంనగర్ జిల్లాలో ఉన్న యూరియా నిల్వలు సరిపోకుంటే పొరుగు జిల్లాల నుంచి కూడా తెప్పించి రైతులకు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 42,416 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 38,255 మెట్రిక్ టన్నులు జిల్లా రైతులకు పంపిణీ చేశామంటున్నారు. డీలర్ల వద్ద 1,534 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని అంటున్నారు. జిల్లాలో యూరియా వినియోగం పెరగడంతో కలెక్టర్ పమేలా సత్పతి చొరవ తీసుకుని రెండు మూడు రోజులుగా 1,500 మెట్రిక్ టన్నులు ఇతర జిల్లాల నుంచి తెప్పించారని అధికారులు చెబుతున్నారు.
వచ్చిన యూరియా వచ్చినట్టు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకు సరఫరా చేస్తున్నారు. శనివారం 648 మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీలకు సరఫరా చేశారని డీఏవో భాగ్యలక్ష్మి తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో యూరియా సరఫరా చేస్తుంటే కొరత ఎందుకు వస్తోందనేది అర్ధంకాని ప్రశ్న కాగా, రైతులు తమ అవసరానికి మించి యూరియా కొంటున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ పరిస్థితులను నియంత్రించాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉంది.
ఏ రైతు ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో మక్క వేశారు? ఇతర పంటలు ఎంత సాగు చేశారు? అనేది అంచనా వేసి రైతులకు అవసరమైన మేరకే యూరియా ఇస్తే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందని యూరియా అందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులు ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనేది అధికారులు క్రాప్ సర్వే చేసినపుడే వారి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని, సొసైటీలకు సరఫరా చేసినపుడే రైతులు సాగు చేసిన విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు పంపిణీ చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని అభిప్రాయపడుతున్నారు.
క్రమం తప్పకుండా జిల్లాకు యూరియా సరఫరా అవుతున్నది. జిల్లాలో సరిపడా ఎరువులు ఉన్నాయి. అవసరం మేరకు ప్రతి రైతుకూ అందిస్తాం. యూరియా దొరకని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తొందరపడి అవసరానికి మించి కొనుగోలు చేయవద్దు. యూరియా ఎక్కువ మోతాదులో వినియోగిస్తే పంటకు నష్టం వాటిల్లుతుంది. వరిలో చీడ పీడలు పెరిగి దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
– భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి (కరీంనగర్)
ఎవుసం చేసుడా.. బంజేసుడా? కాంగ్రెస్ సర్కారే చెప్పాలి. రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఏమీ ఇస్తలేదు. సన్న వడ్లకు బోనస్, రుణమాఫీ, రైతు బంధు ఇవేవీ ఇవ్వలేదు. నేను మూడెకరాల్లో ఎవుసం చేస్తున్నా. ఎకరానికి ఒక యూరియా బస్తా సరిపోవడం లేదు. రైతులకు కావాల్సినంత అందించాలె. గతంలో ఆధార్ కార్డుతో యూరియా బ్యాగ్ ఇస్తుండె. ఇప్పుడు, ఆధార్ కార్డు, పాస్బుక్కు ఇచ్చినా గంటల తరబడి నిల్చుండబెడుతున్నరు. గత పదేళ్లలో ఇంత గోస ఎప్పుడూ లేదు. రైతులను గోస పెట్టుడు ఈ సర్కారుకు మంచిది కాదు.
– సిరికొండ వెంకటి, రైతు, లింగంపేట (జగిత్యాల రూరల్ మండలం)