Gangadhara | గంగాధర, మే 7 : ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు తీరుతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 40 రోజుల క్రితం కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు. గంగాధర మండలం వెంకటాయపల్లి, మంగపేట వద్ద కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రజిత, ఎస్సై వంశీకృష్ణ రైతులతో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు. గంగాధర సొసైటీ కార్యదర్శి రమేష్ తో వడ్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వెంకటాయపల్లి, మంగపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలకు నెల రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చినట్లు రైతులు తెలిపారు. కేంద్రాల వద్ద నిర్వాహకులు కనీస ఏర్పాట్లు చేయలేదని, త్రాగునీరు ఏర్పాటు చేయలేదని, గన్ని సంచులు, తార్పాలిన్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీలు కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. మంగపేటలో 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఒక్కరోజు మాత్రమే తూకం వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో రెండు కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని, ఏ గ్రేడ్ కు బదులుగా కామన్ కింద వడ్లు తీసుకుంటున్నారని, మిల్లులకు వెళ్లిన తర్వాత బస్తాలు కట్ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్న సంబంధిత అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.