కాంగ్రెస్ సర్కారు అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిందా..? పెద్దపల్లిలో వాహనాల రద్దీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు శ్రీకారం చుట్టిన 12 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం అటకెక్కించిందా..? స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి సభ నిర్వహించి అట్టహాసంగా ప్రారంభించిన పనులకు మంగళం పాడిందా..? 19 నెలలైనా తట్టెడు మట్టి తీయకుండా యంత్రాంగం కేవలం సర్వేలకే పరిమితమవుతూ.. తరచూ అలైన్మెంట్లు మారుస్తూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నదా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. తొలుత బైపాస్ రోడ్డు నిర్మాణం పెద్దకల్వల నుంచి అని, తర్వాత పెద్దపల్లి-కరీంనగర్ రోడ్డుపై మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన స్వాగత బోర్డు నుంచి చేపడుతామని ప్రకటించి, ఇప్పుడు ఈ రెండూ కాదని.. మరో ప్రాంతం నుంచి చేపడతారనే సంకేతాలతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. తమ విలువైన భూములిచ్చేదే లేదని తేల్చిచెబుతున్నది.
పెద్దపల్లి, జూలై 4(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలోని తెలంగాణ తొలి ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో రద్దీ ఏర్పడింది. పెద్దపల్లి పట్టణంలో నుంచే ప్రధాన రహదారులు ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024 డిసెంబర్ 4న సీఎం రేవంత్‌రెడ్డితో పెద్దకల్వలలో సభ నిర్వహించి, అక్కడే రూ.83 కోట్ల వ్యయంతో పెద్దపల్లి బైపాస్ రోడ్డు పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఇది జరిగి 19 నెలలైనా తట్టెడు మట్టి తీయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. రోడ్లు భవనాల శాఖ అధికారులు 12 కిలోమీటర్ల ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి రెండు అలైన్మెంట్లు ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇంకా సాంకేతిక అనుమతులే రాలేదు. అసలు భూ సర్వేలే పూర్తి కాలేదు. ఇంతలోనే రెండు నెలల క్రితం విప్ విజయరమణారావు రేవంత్‌రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పెద్దపల్లి మండలం పెద్దకల్వల వద్ద మరోమారు ఆవిష్కరించి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. అదే రోజు అక్కడికి కొంత మంది రైతులు వచ్చి ఇక్కడి నుంచి ఈ రోడ్డును వేయవద్దని వ్యతిరేకించారు. కానీ, అధికారులు మాత్రం భూ సేకరణ చేస్తాం.. పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి అక్కడ కొంత మేర భూమిని చదును చేశారు. రేపో.. మాపో పనులు ప్రారంభిస్తామన్న రీతిలో హడావిడి చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడం, ప్రభుత్వం నిర్మాణంలో ఆలస్యం చేయడం కారణంగా అసలు ఈ రోడ్డు నిర్మాణం ముందుకు సాగుతుందా.. లేదా..? శిలాఫలకానికే పరిమితమవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బైపాస్ రోడ్డును పెద్దపల్లి పట్టణంలో నుంచి కాకుండా పెద్దకల్వల నుంచి అప్పన్నపేట వరకు నిర్మిస్తామని అధికారులు తొలుత ప్రకటించారు. పెద్దకల్వల, చిన్నకల్వల, నిట్టూరు, నిమ్మనపల్లి, పెద్దపల్లి, చందపల్లి, అప్పన్నపేట భూముల శివారు నుంచి వెళుతుందని చెప్పారు. ఇందుకుగాను పెద్దబొంకూరు ఎక్స్‌రోడ్డు ఇవతల సీఎం ప్రారంభించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే రోడ్డు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. పైప్‌లైన్ వెంటే బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నట్టు సంకేతాలిచ్చారు. ఆ తర్వాత ఏమైందో కానీ పెద్దపల్లి-కరీంనగర్ ప్రధాన రహదారిపై పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన స్వాగత బోర్డు వద్ద నుంచి రోడ్డు నిర్మిస్తామని అధికారులు సర్వే చేపట్టారు. ఇదిలా ఉండగా మరో ప్రాంతం చిన్నకల్వల బ్రిడ్జి నుంచి ప్రారంభిస్తారని మరికొందరు అంటుండగా, రైతులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బైపాస్‌రోడ్డు ఎవరి భూముల్లో నుంచి వెళ్తున్నదని అధికారులు తెలియజేస్తున్నారో వారంతా.. తమ భూములు ఇచ్చేది లేదంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు సార్లు అలైన్మెంట్లు ఎందుకు మార్చారంటూ నిలదీస్తున్నారు.
బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు సరైన సమాధానాలు చెప్పడం లేదు. అసలు రోడ్డు నిర్మాణానికి భూమి ఎంత అవసరం?, ఎక్కడి నుంచి ఎవరెవరికి సంబంధించిన భూములు తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మిస్తున్నారనే విషయమై పెద్దపల్లి ఆర్డీవో గంగయ్యను వివరణ కోరగా, అదంతా ఆర్అండ్బీ అధికారులు చూసుకుంటున్నారని చెప్పగా, కాదు కాదు.. అది ఆర్డీవో పరిధిలోకే వస్తుందని ఆర్అండ్బీ ఈఈ భావ్‌సింగ్ తెలిపారు. అసలు ఇప్పటి వరకు రహదారి నిర్మాణానికి సంబంధించిన సర్వేలు పూర్తి కాలేదు. సాంకేతిక అనుమతులు రాలేదు. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం అయోమయం తప్పడం లేదు.
మా భూముల్లో సర్వేకు ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు రావద్దు. ఎక్కడి నుంచి పనులు ప్రారంభమవుతాయని శిలాఫలకం వేశారో.. అక్కడి నుంచే పనులు చేపట్టాలి. ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నం. ఎంత మంది వచ్చి అమ్ముమని చెప్పినా మేం అమ్మలేదు. ఈ భూమి పోతే నా ఇద్దరు ఆడపిల్లలతో నేను బజారున పడుతా. నా బతుకును ఆగం చేయకుండి. మా పొట్టకొట్టకండి.
– బొజ్జ సులోచన, పెద్దబొంకూరు, పెద్దపల్లి మండలం
మాకున్న ఈ భూమిని నమ్ముకొనే బతుకుతున్నం. మా జీవనోపాధిని లాక్కోవడం న్యాయం కాదు. పెద్దకల్వల నుంచి బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అక్కడ క్యాన్సల్ చేసి చిన్న కల్వల బ్రిడ్జి నుంచి అంటున్నరు. అధికారులు సర్వేలకు వస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే మేం మాత్రం మా భూములివ్వం. ఇది పూర్తిగా అన్యాయం. కాంగ్రెస్ రైతుల పక్షపాతి కాదు. కక్షపాతిగా మారింది.
– కుమార్, పెద్దబొంకూరు, పెద్దపల్లి మండలం