సాగునీటి కొరత తీవ్రమవుతున్నది. వేసవికి ముందే చేను, చెలక తడారిపోతున్నది. ఇప్పటికే కరీంనగర్ రూరల్, గంగాధర, తిమ్మాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతుండగా, తాజాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని డీ-89 కాలువ చివరి భూములకు కటకట ఏర్పడింది. మొగ్దుంపూర్, మందులపల్లి, నల్లగుంటపల్లి, చేగుర్తి, ఇరుకుల్లలో చేతికందే దశలో పంటలు వళ్లిపోతుండగా, రైతులు తల్లడిల్లుతున్నారు. రెండ్రోజుల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కలిసిన విన్నవించిన కర్షకులు, బుధవారం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి తమ గోడును వెల్ల్లబోసుకున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేయకుంటే సుమారు వెయ్యి ఎకరాల్లో పంట ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోయారు.
కరీంనగర్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : సాగునీటి కటకట రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. పదేళ్ల పాటు ఏ రంది లేకుండా ఏటా రెండు పంటలు పండించిన రైతులు, గత రెండు సీజన్ల నుంచి అరిగోస పడాల్సి వస్తున్నది. ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని ప్రభుత్వం, అధికారులు చేసిన ప్రకటనను నమ్మి వరి నాట్లు వేసిన అన్నదాతలు ఇప్పుడు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కరీంనగర్ రూరల్, గంగాధర, తిమ్మాపూర్ మండలాల్లో పలు గ్రామాల్లో చివరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోతుండగా, పశువులకు వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎస్సారెస్పీ పరిధిలోని డీ-89 కాలువ చివరి ఆయకట్టు అయిన కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దుంపూర్, మందులపల్లి, నల్లగుంటపల్లి, చేగుర్తి, ఇరుకుల్ల గ్రామాలకు నీరందక తండ్లాడుతున్నారు. గడిచిన పదేళ్లలో సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు ఏటా రెండు పంటలు పండించుకున్నారు. ఇరుకుల్ల వాగు ఒడ్డుకు ఉండే ఈ గ్రామాలకు గతంలో గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు వచ్చేవి.
ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు వెళ్లే పైప్ లైన్‌కు సర్వారెడ్డిపల్లి వద్ద ఒక గేట్ వాల్వు ఉంది. ఇక్కడి నుంచి ప్రతి సీజన్లో నీటిని విడుదల చేసే వారు. అక్కడి నుంచి రామడుగు మండలం గుండి చెరువుకు నీళ్లు వెళ్లేవి. అక్కడి నుంచి కాట్నపల్లి, రేవెల్లి గ్రామాల మీదుగా గుండి వాగు నుంచి ప్రవహిస్తూ ఇరుకుల్ల వాగులోకి నీళ్లు వచ్చేవి. ఈ నీళ్లు ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, చేగుర్తి, మందులపల్లి, మొగ్దుంపూర్ మీదుగా నారాయణరెడ్డిపల్లి వరకు ప్రవహిస్తే ఈ ప్రాంతంలోని బావులు, బోర్లలో పుష్కలమైన భూగర్భ జలాలు ఊరి పంటలకు సరిపడా అందేవి. పదేళ్లుగా ఇదే పద్ధతిలో నీళ్లు వస్తున్నాయని, ఇపుడు సర్వారెడ్డిపల్లి వద్ద గేట్ వాల్వును ఓపెన్ చేయక పోవడంతో నీళ్లు రాక అటు గుండి వాగు, ఇరుకుల్ల వాగులు వట్టిపోయాయని రైతులు చెబుతున్నారు. ఈ కారణంగా భూగర్భ జలాలు ఇంకి పోయి మొగ్దుంపూర్లో 350, నల్లగుంటపల్లిలో 60, మందులపల్లిలో 25, చేగుర్తిలో 60, ఇరుకుల్లలో 150 ఎకరాల్లో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
ఇక డీ-89 ద్వారా కూడా ఈ గ్రామాలకు సాగు నీరు రావడం లేదు. గతేడాది డిసెంబర్ 25 నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ కాకతీయ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇప్పటికే నాలుగు సార్లు విడుదల చేశారు. కానీ ఈ ప్రాంతానికి మొదటి విడతలో నాలుగు రోజులు, రెండో విడతలో మూడు రోజుల పాటు నీళ్లు వచ్చాయని, మిగతా రెండు విడతల్లో ఒక్క చుక్క నీళ్లు రాలేదని రైతులు వాపోతున్నారు. ఈ కాలువ కింద ఒక్క మొగ్దుంపూర్ గ్రామంలోనే 300 ఎకరాల వరకు సాగవుతున్నదని చెబుతున్నారు. సాగునీరు అందని కారణంగా పంటలు ఎండిపోతుంటే పశువులకు వదిలేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నీళ్లు రావని చెబితే తాము పంటలు సాగు చేసే వారము కాదని, ఇస్తామని చెప్పి ప్రభుత్వం, అధికారులు తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని పార్టీల నాయకులను కలిసినం. మా గోస అందరికి చెప్పుకున్నం. ఇప్పిస్తం.. ఇప్పిమని చెప్తున్నరు. ఇపుడపుడు అంటున్నరు. కానీ ఒక్కలు సుతం పట్టింపు లేకుంట ఉన్నరు. కలెక్టర్‌తోనే మాకు న్యాయం జరుగుతదని ఇక్కడికి వచ్చినం. మా పంటలు ఎండి పోతున్నయి. రెండెకరాలు నాటేసిన రైతులకు ఎకరం పొలం ఎండిపోయింది. బోర్లు పోస్తలేవు.. బాయిల్ల నీళ్లు లేవు.. కాలువల నీళ్లు అస్త లేవు. పంటలు ఎట్ల పండాలే. కలెక్టర్ మేడమే మా మీద దయ తల్చాలే.. నారాయణపూర్ నుంచి నీళ్లియ్యాలే..
యాసంగి సాగుకు ముందు ప్రాజెక్టుల నీళ్లున్నయి. పంటలకు ఇస్తమని ప్రభుత్వం అంటేనే పంటలు ఏసుకున్నం. లక్షలకు లక్షలు పెట్టువడి అయ్యింది. రైతులు ఎట్ల బత్కాలే. పెట్టువళ్లు మీద పడితే ఉరేసుకునుడు తప్పా ఇంకో దారి లేదు. యాసంగిల నీటి ఎద్దడి ఉంటదని అధికారులు చెప్పితే పంటలు ఏసుకునేటోళ్లంగాదు. అపుడు ఎందుకు చెప్పిండ్రు.. ఇప్పుడు ఎందుకిస్త లేరు. నీళ్లు లేవని చెప్పితే మేం పంటలు ఏసుకునెటోళ్లంగాదు. అధికారులు పట్టించుకుంటరో, ప్రభుత్వం పట్టించుకుంటదో, మా పంటలు కాపాడాలే. లేకపోతే రైతులందరం రోడ్డెక్కాల్సి వస్తది.
పదేండ్లళ్ల ఇసొంటి నీటి ఎద్దడి చూడలే. నీళ్లు లేకుంటే తిప్పలగానీ ఉన్నంక ఎందుకిత్తలేరు. ఆఖరి ఆయకట్టు రైతులు గంగల వోనియ్యా. ఒక్కొక్కలు లక్షల పెట్టువడి వెట్టి నాట్లేసిన్రు. నీళ్లు రాకుంటే పంటలు మొత్తం పాడైపోతయి. రైతులు తిండి తిప్పలు మాని నీళ్ల కోసం అరిగోస వడుతున్నరు. డీ-89 కాలువ కింది మొకాన చుక్క నీరత్తలేదు. నీళ్లు ఎక్కువ ఇస్తేనే మాకు వస్తయి. ఎడ్డెమెడ్డెం ఇడ్తే అత్తయా..
ఇరుకుల్లకాన్నుంచి మొగ్దుంపూర్దాక వాగొడ్డుకు ఉన్న పంటలన్నీ ఎండిపోతన్నయి. నారాయణపూర్ చెరువు పైప్‌లైన్ కెళ్లి నీళ్లిస్తేనే మాకు ఆధారం ఉంటది. అది కూడా ఎంటనే ఇస్తేనే ఎండిపోయే పంటలను కాపాడుకోవచ్చు. నిరుటిదాకా ఇచ్చి ఇపుడు ఇవ్వకుంటే ఎట్ల. నీళ్లిస్తమని చెప్పితెనే మేం పంటలు ఏసుకున్నం. ఇపుడు నీళ్లు రాకుంటే పట్టించుకునెటోళ్లు లేరు. లక్షలకు లక్షలు పెట్టువడి పెట్టి పంటలేసినం. కండ్ల ముందటనే ఎండి పోతుంటే తట్టుకోలేక పోతున్నం. నీళ్లు ఇయ్యకుంటే ప్రత్యక్ష పోరాటం చేయ్యక తప్పది.