Oil Palm | సుల్తానాబాద్ రూరల్, జూలై 10: ఉద్యాన శాఖ పెద్దపల్లి జిల్లాలో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ పంటను సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జిల్లా ప్రత్యేక అధికారి టి.శేఖర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్లా, కాట్నపల్లి గ్రామంలో గురువారం అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా రైతు కొండపల్లి సత్యనారాయణ రావు క్షేత్రంలో 17 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ సందర్శించారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ పంటను రైతులు పెద్ద ఎత్తున సాగు చేయాలని ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ పంటలో అంతర పంటగా కూరగాయలు, పూల తోటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందాలని వివరించారు.
తదనంతరం బొంతకుంటపల్లి గ్రామంలోని రెండు సంవత్సరాల కిందట నాటిన ఆయిల్ పామ్ తోటలను పరిశీలించడం జరిగింది. అనంతరం ఎలిగేడు, జూలపల్లి మండలంలోని కూరగాయ పంటలను, శాశ్వత పందిర్ల నిర్మాణంపై సాగు చేసే ఉద్యాన పంటలను కూడా పరిశీలించడం జరిగింది. జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయములోని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో, ఆయిల్ ఫామ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్‌తో, డిప్ కంపెనీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 2025 -26 సంవత్సరంలో కేటాయించిన పండ్ల తోటలో విస్తీర్ణ పథకం ఎంఐడిహెచ్ స్కీం ద్వారా పండ్లతోటలైన మామిడి, జామ, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లతోటలు, కూరగాయ పంటలైన టమాట, మిరప, వంకాయ వంటి కూరగాయలను మల్చింగ్ పద్ధతి ద్వారా 50% రాయితీ, బిందు సేద్య పరికరాల పైన 90% రాయితీ జిల్లాలోని సాగు చేసే రైతులకు అందేలా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని సూచించడం జరిగింది.
ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసినందుకు గాను ఎకరానికి రూ. 4200 అంతర పంటలకి రాయితీ కల్పించడం జరుగుతుందని అన్నారు. రైతులు అందరూ ఈ వానాకాలంలో ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలని రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులు ఏ. జ్యోతి, ఎస్ .మహేష్, ఆయిల్ పామ్ కంపెనీ సీఈవో కేసు కళ్యాణ్, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్, శివ, అభిలాష్, డ్రిప్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్లు, రైతులు ప్రేమ సాగర్, రాజేశ్వరరావు, మండ మల్లేశం రామచంద్రం తదితరులు పాల్గొనడం జరిగింది.