కాంగ్రెస్ పాలనలో రైతుకు భరోసా కరువైంది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన రైతుబంధు పదకొండు సీజన్లలో ఠంఛన్‌గా అందినా.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వస్తుందో.. లేదో? తెలియని పరిస్థితి ఉన్నది. పథకం పేరును రైతు భరోసాగా మార్చినా.. భరోసా మాత్రం కల్పించడం లేదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు వానకాలం సీజన్‌కు ముందు ఏప్రిల్‌లోనే మొదలై, జూన్ వరకు అన్నదాతలందరికీ అందినా.. ఇప్పుడా పరిస్థితి లేదు. సీజన్‌కు ముందే ఇవ్వాల్సిన పంట పెట్టుబడి సాయాన్ని ఇప్పటి వరకు అందించలేదు. అసలు దానిపై ఊసే లేకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తున్నది. దీంతో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
కరీంనగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని కాకుండా ఎకరానికి 10 వేలు కాకుండా ఏడాదికి 15 వేలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి మూడు సీజన్లు గడిచి పోయినా పట్టించుకోవడం లేదు. 2023-24 యాసంగి సీజన్‌కు గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. 2024 వానకాలంలోనైనా సరైన సమయానికి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందని ఆశించినా నిరాశే ఎదురైంది. అర్హులైన రైతులను తేల్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఆ సీజన్లో ఎగనామం పెట్టింది. రాష్ట్ర మంత్రివర్గంతో సబ్ కమిటీ వేసిన ప్రభుత్వం అర్హులైన వారికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించి క్షేత్ర స్థాయిలో సర్వే చేయించింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు జిల్లాలో 4 వేలకు పైగా ఎకరాలకు మాత్రమే రైతుభరోసా ఇవ్వరాదని తేల్చింది.
అర్హులు ఎంత మందో తేలడంతో 2024-25 యాసంగిలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ఎకరానికి ఏడాదికి 15 వేలు వస్తాయని రైతులు ఎదురు చూశారు. కానీ, ఏటా 12 వేలు మాత్రమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత వానకాలం సీజన్లో వీటినైనా సమయానికి ఇచ్చారా..? అంటే అదీ లేదు. సీజన్ మధ్యలో విడతల వారీగా ఇచ్చుకుంటూ వచ్చారు. అనర్హులు పోను చాలా మంది అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ కాలేదు. 2023-24 యాసంగిలో 1,90,820 మంది రైతులకు రైతుబంధు పద్ధతిలోనే ఒక్క సీజన్‌కు ఎకరాకు 5 వేల చొప్పున 177.61 కోట్లు పెట్టుబడి సాయాన్ని అందించిన ప్రభుత్వం.. 2024-25లో 1,65,850 మంది రైతులకు ఒక్క సీజన్‌కు ఎకరాకు 6 వేల చొప్పున 132.13 కోట్లు అందించింది. అది కూడా కేవలం 4 ఎకరాలలోపు ఉన్న రైతులకే ఇవ్వగా, అందులోనూ చాలా మందికి అందలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 వానకాలం సీజన్ నుంచి ప్రారంభమైన రైతుబందు పథకం ఏటా రెండు సీజన్లకు ప్రణాళికాబద్ధంగా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ వచ్చింది. వానకాలం సీజన్‌కైతే ఏప్రిల్ నెల నుంచే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమయ్యేవి. యాసంగిలో అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యేది. ఈ విధంగా ముందుగానే రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని అందించడం వల్ల రైతులు తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకుని సీజన్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యేవారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వ్యవసాయ సీజన్లు వస్తే ఒక సీజన్‌కు ఎగవేసింది. ఇచ్చిన రెండు సీజన్లకు కూడా సరైన సమయానికి ఇవ్వలేదు. ప్రస్తుత వానకాలం సీజన్లోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నది. సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నాయి.
అక్కడక్కడా పడిన వర్షాలకు రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. మార్కెట్లో విత్తనాలు, ఎరువుల విక్రయాలు వారం పది రోజుల నుంచే అమ్మకాలు జోరందుకున్నాయి. కానీ, ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి సాయం మాత్రం అందడం లేదు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడి కోసం రైతులు పడిన ఇబ్బందులు తిరిగి పునరావృతం అవుతున్నాయి. ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ప్రవేశ పెట్టిన తర్వాత ఆ పరిస్థితి కనుమరుగైంది. సకాలంలో పెట్టుబడి సహాయం అందిన కారణంగా వడ్డీ వ్యాపారాలు మూలన పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సీజన్‌కు కూడా అనుకూలంగా పెట్టుబడి సాయం అందక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 మే 10వ తేదీ నుంచి రైతుబంధు పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి 2023 వానకాలం సీజన్ వరకు ఏడాదికి రెండు సార్ల చొప్పున పదకొండు వ్యవసాయ సీజన్లకు పెట్టుబడి సాయం అందించింది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 1,735.26 కోట్ల పెట్టుబడి అందించింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సీజన్లకు సాయం ఇచ్చింది.
2023-24 యాసంగిలో 1,90,826 మందికి రైతుబంధు పద్ధతిలోనే 177.61 కోట్లు, 2024 వానకాలంలో చేతులెత్తేయగా 2024-25 యాసంగిలో 1,65,850 మంది రైతులకు 132.13 కోట్ల చొప్పున 309.74 కోట్లు అందించింది. రెండింటిలో ఏ ఒక్క సీజన్‌కు సరైన సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందక పోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా వచ్చే వరకు తమకు నమ్మకం లేదని చెబుతున్నారు. నాడు బీఆర్ఎస్ పాలనలో ప్రతి సీజన్‌కు ముందే పెట్టుబడి సాయాన్ని అందించారని, ఈ ఘనత అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని కొనియాడుతున్నారు.