తిమ్మాపూర్ రూరల్, ఫిబ్రవరి 18: యాసంగి వరి పంటలు ప్రస్తుతం కలుపు దశలో ఉన్నాయి. రైతులు కలుపుతీత పనుల్లో బిజీగా ఉన్నారు. కలుపు తీసిన వెంటనే యూరియా వేయడం వలన పంట బాగా ఎదుగుతుంది. అయితే ఇదే సమయంలో మండలంలో యూరియా కొరత(Urea shortage) ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
మండలంలోని పొల్లంపల్లిలోని దుద్దేనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మన్నెంపల్లిలోని పోరండ్ల ప్రాథమిక సహకార సంఘాలలో మంగళవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. సొసైటీలకు 230 చొప్పున యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయి. రైతులు మాత్రం ఎక్కువ మంది వచ్చారు. దీంతో అందరికీ అందలేదు. దీంతో చాలా మంది రైతులు నిరాశగా వెనుదిరిగారు. కొంతమంది రైతులు యూరియా కోసం సొసైటీల ఎదుట ఆందోళన చేశారు.
ఉదయం నుంచే బారులు..
యూరియా వేయడానికి ఇదే మంచి సమయం కావడంతో రైతులు నిత్యం ఉదయం నుంచే సొసైటీల ఎదుట క్యూ కడుతున్నారు. మంగళవారం కూడా 6 గంటలకే రైతులు సొసైటీల వద్దకు చేరుకున్నారు. అయితే ఒక్కో సొసైటీకి 230 బస్తాల చొప్పున మాత్రమే రావడంతో అధికారులు వాటినే పంపిణీ చేశారు. గతంలో సహకార సంఘాలలో రైతులకు సరిపడా నిల్వలు ఉండేవని, ప్రస్తుతం రైతులకు సరిపడా యూరియాను తెప్పించడంలో నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.