పంటల సాగు సమయంలో అన్నదాతకు భరోసాగా నిలుస్తున్న ‘రైతు బంధు’ కింద పదకొండో విడుత పంపిణీ సోమవారం నుంచే ప్రారంభమైంది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7.20 లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి సాయం అందనున్నది. ఇప్పటి వరకు పది విడుతల కింద 5,826 కోట్లు అందించగా, తాజాగా, వచ్చే మొత్తాన్ని కలుపుకుంటే ఆ సాయం ఏకంగా 6,504 కోట్లకు చేరనున్నది. దేశ చరిత్రలో ఎటువంటి పైరవీ లేకుండా నేరుగా రైతులకు అందుతున్న ఆర్థిక సాయం ఇదే కాగా, ప్రతి సీజన్లోనూ రైతులకు ధీమానిస్తున్నది. ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తుండడంతో వేలాది మంది కర్షకులు కొత్తగా ఎవుసం బాట పడుతున్నారు. గత సీజన్‌కు, ప్రస్తుత సీజన్‌కు పోల్చి చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56,743 మంది సేద్యం వైపు మళ్లారు. క్షేత్రస్థాయిలో రైతు బంధు ఎంతగా ప్రభావితం చేస్తున్నదో చెప్పడానికి ఏయేటికాయేడు పెరుగుతున్న రైతుల సంఖ్యే ప్రత్యేక నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.
– కరీంనగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాటి పాలనలో కుదేలైన రైతును రాజును చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్, అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు కదిలారు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల రీడిజైనింగ్, కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పథకాలను అనతి కాలంలోనే పూర్తి చేసి.. దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. ఇటు విద్యుత్, అటు సాగునీటిని పుష్కలంగా అందించిన సీఎం, పంటల పెట్టుబడికి సాయం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు 2018 మే 10న హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి- ఇందిరానగర్‌లో జరిగిన బహిరంగ సభా వేదికగా రైతు బంధు పథకానికి అంకురార్పణ చేశారు. ఆరంభంలో ఎకరాకు 4 వేల చొప్పున రెండు పంటలకు 8 వేలు ఇచ్చిన సర్కారు, 2019-20 నుంచి ఎకరాకు 5 వేల చొప్పున రెండు పంటలకు 10 వేలు చొప్పున ఇస్తున్నది. నిజానికి రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలాయి. ఇది అమలుకు నోచుకునే పథకం కాదని కొంత మంది, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మరికొంత మంది.. ఇది ఆరంభ శూరత్వమే అని మరికొంత మంది విమర్శలు చేశారు. ఆనాడు విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ప్రతి సీజన్లో వస్తున్న రైతు బంధును చూసి నోరెళ్ల బెడుతున్నారు. విజయవంతంగా అమలవుతున్న రైతుబంధు పథకాన్ని స్వయంగా ఐక్యరాజ్య సమితి కూడా అభింనందించింది.
ఆనందంలో రైతులు పదకొండు విడుతల్లో ఉమ్మడి జిల్లా రైతులకు అందిన పెట్టుబడి సాయం
లాగోడికి ఇబ్బందుండదు
కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక ఎవుసం పెట్టుబడికి ఇబ్బంది రాకుండా పైసలు ఏత్తండు. గట్లనే గిప్పుడు కూడా పడతయ్ అనుకున్న. అనుకున్నట్టే ఈరోజు నా బ్యాంకు ఖాతల పైసలు పడ్డట్టు ఫోన్‌కు మెస్సేజచ్చిందని నా కొడుకు చెప్పిండు. గందుకే బ్యాంకుకు అచ్చి పడ్డ పైసలను ఇడిపించిన. నాకు 38 గుంటల భూమి ఉంది. పొలం చేద్దామనుకుంటున్న. నాకు పెట్టుబడికి పైసలకు ఇబ్బంది రాకుంట కేసీఆర్ సార్ రూ.4750 ఏసిండు. నాలాంటి పేదోళ్లకు ఆయన దేవుడు. ఎవుసం చేసెటందుకు ఏ కట్టం రాకుండ అన్నీ మంచిగ చేసిండు. నీళ్లు, కరెంటు, లాగోడికి పైసలు ఇచ్చుడు, ఇత్తనాలు, పిండి(ఎరువులు) బత్తాలకు ఇబ్బందులు రాకుండ చూత్తండు. రైతులకు బీమా చేయించిండు. కేసీఆర్ సార్ శానా మంచి పనులు చేసిండు. రైతులం ఆయనను మరువం.
పదకొండు విడుతల్లో 6,504 కోట్లు
రాష్ట్ర సర్కారు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. పది విడుతల్లో 5,826 కోట్లకుపైగా ఉమ్మడి జిల్లా రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాగా, ఈ వానకాలం సీజన్‌ను కలుపుకొని చూస్తే 6,504 కోట్లు జమకానున్నది. ఉమ్మడి జిల్లా చరిత్రలో రైతులకు నేరుగా ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి కలిగిన పథకం ఇదే. పెట్టుబడి సాయం అన్నదాతలకు కొండంత భరోసాను ఇస్తున్నది. సీజన్ వచ్చిందంటే పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టే రైతులు, ఇప్పుడు ఎవరికీ చేయి చాపకుండా సగర్వంతో సాగు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినా ‘పెట్టుబడి సాయం వస్తుంది కదా..’ అన్న ధీమా రైతుల్లో కనిపిస్తున్నది. అంతేకాదు, పెట్టుబడి సాయం ప్రభావం క్షేత్రస్థాయిలో భారీగా కనిపిస్తున్నది. ఏయేటికాయేడు ఎవుసం చేసే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఉమ్మడి జిల్లాలో గత సీజన్‌కు, ఈ సీజన్‌కు మధ్య చూస్తే కొత్తగా 56,743 మంది రైతులు పెరిగారు. గడిచిన పది విడుతల్లో చూస్తే ఈ సంఖ్య లక్షలు దాటింది. చెప్పింది చెప్పినట్లుగా పెట్టుబడి సాయం వస్తుండంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. ఏమి ఇచ్చినా ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేమని రైతాంగం ఘంటాపథంగా చెబుతున్నది. కాగా, భూముల క్రయ విక్రయాలతోపాటు కొత్తగా సాగు చేసుకునే వారికి కూడా రైతు బంధు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సదరు రైతులకు వచ్చే నెల 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. రైతుబంధు కోసం సంబంధిత అధికారులను కలిసి, పత్రాలను సమర్పిస్తే ఈ సీజన్ నుంచే పెట్టుబడి సాయం అందనున్నది.
ఆయుటి గూనంగనే చేతికి పెట్టుబడి
వానలు సురువై ఆయుటిగూనంగనే పెట్టుబడికి నా బ్యాంకు ఖాతాల 2500 రూపాయలు పడ్డయ్. నాకు మా ఊరి శివారుల నా పేరు మీద 20 గుంటల భూమి ఉన్నది. పంట సాగుకు ఇత్తనాలు, ఎరువుల కొనడానికి ఈ పైసల్ పనిచేస్తయ్. సావుకారి దగ్గరికి పోయి చేయి చాపకుండ సీఎం కేసీఆర్ సారు సమయానికి రైతుబంధు పైసలు వేసిన్రు. గిట్ల ఆరుగాలం భూమిని నమ్ముకుని బతుకుతున్న మాలాంటి వాళ్లకు అండగ ఉంటున్న సర్కారుకు రుణపడి ఉంటం.
– ఉమ్మారెడ్డి విమల, గజసింగవరం(గంభీరావుపేట)
మంచి టైంల పైసలేసిండు
గిప్పుడు గిప్పుడే వానలు వడుతున్నయ్. ఎవుసం పనులు షురూ చేత్తన్నం. గీ టైంల ఎప్పటి లెక్కనే కేసీఆర్ సార్ ఎవుసం పెట్టుబడి కోసం ఈరోజు పైసలు ఏసినట్టు నా సెల్ ఫోన్‌కు మెస్సేజ్ అచ్చింది. నాకు 37 గుంటల భూమి ఉన్నది. దానికి రూ.4718 ఏసినట్లు మెస్సేజ్ అచ్చింది. టంఛన్‌గా పైసల్ పంపిన ఘనత కేసీఆర్ సార్కే దక్కుతది. సార్ మాట అన్నడంటే పని జరుగుతుదని తెలుసు. గట్లనే పైసల్ అచ్చినయ్.
– సామ మోహన్‌కుమార్, రైతు, కొలనూర్(ఓదెల)
రైతుల పాలిట దేవుడు కేసీఆర్ సారు
సీఎం కేసీఆర్ సారు రైతుబంధు పైసలు బ్యాంకుల జమ చేయడంతోని పెట్టుబడికి ఇబ్బంది లేకుంటైంది. బూరుగుపల్లి శివారుల నాకు 31 గుంటల భూమి ఉన్నది. దానికి రైతు బంధు కింద రూ 3,875లు ఖాతాల పడ్డయ్. ప్రతి సీజన్ లెక్కనే ఈసారి కూడా ముందుగాలనే పెట్టుబడికి పైసలు అచ్చినయ్. వీటితోని దుక్కి దున్నిస్త. కరెక్టు టైంల పెట్టుబడికి సాయం ఇచ్చిన కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడు.
– గడ్డం స్వామి, బూరుగుపల్లి(గంగాధర)
రైతుబంధు ఆదుకుంటంది
నేను చిన్నప్పటిసంది ఎవుసంజేస్తన్న. రెక్కల కట్టంమీద బతుకుడుదప్ప ఏ సర్కారోళ్లు సాయం జెయ్యలే. కేసీఆర్ సారు ఎకురానికి పదవేలిచ్చి రైతులను కాపాడుకుంటండు. నా పేర అక్కడక్కడ కలిపి ఐదెకరాలు ఎవుసం భూమి ఉన్నది. తెలంగాణ సర్కారు వచ్చినప్పటిసంది నా ఐదెకరాలకు పెట్టువడి సాయం అందుతంది. సోమారం ఎకురం 9 గుంటలకు 6,187 రూపాలు నా ఖాతల పడ్డయి. మిగితయి పడంగనే ఇత్తనాలు, మందులు కొంట. ఇప్పటికే పొలాలకు నీళ్లువారిచ్చి, దుక్కిని తడిపిన. ఇగ కిందిమీద దున్ని నాట్లేసుడే. పొలమేసుటానికి సర్కారోళ్లిచ్చిన పైసల్ సాలకపోతే, మొన్న అమ్మిన పంట పైసలు కొంత ఖర్చుజేత్త. ఈ సర్కారు అచ్చిన సంది మా రైతులకు ఢోకాలేదు. వరుద కాలువగుడ పక్కపొంటే ఉంది. మస్తు నీళ్లున్నయి. కొన్నేండ్లనుంచి వరిపంటలే సాగుజేత్తన్నం. కేసీఆర్ సారు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటండు.
-చిమ్మల్ల పోచయ్య, రైతు, కుర్మపల్లి, పందికుంట అనుబంధ గ్రామం, (రామడుగు)
లాగోడికే ఖర్చు పెడుత
మా ఊరు బోనాల. సిరిసిల్ల అర్బన్ మండలం మాకు అయిదెకరాల భూమి ఉంది. నాడు నీళ్లు, కరెంటులేక, ఏసిన పంట చేతికి రాక అప్పుల పాలయినం. అప్పుల తీర్చేందుకు మాఆయన లచ్చయ్యతో కలిసి అడ్డమీద కైకిలి పనిచేసినా బట్టపొట్టకు, పిల్లల చదువులకే అయినయ్. మళ్ల పంటకు విత్తులు, ఎరువులు కొనేందుకు పైసలు లేక పాలుకు ఇచ్చినం. అయినా అప్పులు తీరలే. కేసీఆర్ సార్ పుణ్యమా అని 24గంటలు కరెంటు ఉంటుంది. నీళ్లు కూడ పుష్కలంగా ఉన్నయ్. రైతుబంధు తీసుకుంటున్నం. మేమే సాగు చేసుకుంటున్నం. పంట దిగుబడి బాగా వచ్చింది. అప్పులు తీరినయ్. వచ్చిన రైతు బంధు లాగోడికే ఖర్చుపెడుతున్నం. విత్తనాలు, ఎరువులుకు కొంటున్నం. కేసీఆర్ సార్ వచ్చినంకనే అడ్డామీద కూలీ బంద్ పెట్టినం.
– లచ్చవ్వ, రైతు పెద్దూరు సిరిసిల్ల జిల్లా)
రైతుబంధు పైసలతోటి విత్తనాలు కొన్న
పెట్టుబడి టైంకు సర్కారు రైతుబంధు సాయం అందిస్తంది. నాకు 33 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. సోమవారం నా ఖాతాల రూ.4125 పడ్డయి. వాటిని బ్యాంకుల నుంచి తీసుకున్న. వరి విత్తనాలు కొనుక్కున్న. సీఎం కేసీఆర్ సార్ రైతుల బాగు కోసం అనేక పథకాలు తెచ్చిండు. రైతుబంధు సాయం మరువ లేనిది. వానకాలం, యాసంగి పంటల సాగు టైంల పెట్టుబడి సాయం ఇస్తున్నడు. కొన్నేండ్ల నుంచి పెట్టుబడి తిప్పలు తప్పినయి. సీఎం కేసీఆర్‌కు రైతులం రుణపడి ఉంటం.
– క్యాస శంకర్, రైతు, బతికపల్లి (పెగడపల్లి)
నాపేరున భూమైంది.. రైతుబంధు అస్తంది
గతంల మా బాపు నుంచి నాకు రావాల్సిన భూమిని నా పేరున ఎక్కియ్యాలని ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగిన కాలె. తహసీల్దార్ ఆఫీసుకు పోతే ఎవరూ పట్టించుకోలె. భూమి చేయాలని ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా కాలే. కానీ, ధరణి అచ్చినంక మా బాపు సర్టిఫికెట్ పెట్టి నా పేరు మీద భూమి చేయించుకున్న. ఆఫీస్‌కు పోయినంక ఎంటనే నా పేరు మీద అయింది. అప్పటి నుంచి నాకున్న 30 గుంటలకు రైతు బంధు అస్తంది. వీటితోటి పంట వేయడానికి ఎరువులు, విత్తనాలు కొంటున్న. మోదీ పైసలు నాకు ఇప్పటి వరకు రాలె. ఆన్లైన్ల దరఖాస్తు చేసినా అస్తలేవు. కేసీఆర్ సారు వేసే రైతుబంధుతోనే నాకు పెట్టుబడి ఎల్లుతంది.
– కులేరు హన్మండ్లు, మామిడిపల్లి (కోనరావుపేట)
ఖర్చులకు అయితున్నయ్..
నాకున్నది 24 గుంటల భూమే. ప్రతి గుంటకూ రైతు బంధు పైసలు వస్తున్నయ్. మొదటి రోజే పైసలు పడుతున్నయ్. వీటితోనే పెట్టుబడి ఖర్చులు ఎల్లదీసుకుంటున్న. మోదీ పైసల కోసం ఎన్నిసార్లు ఆైప్లె చేసుకున్న ఇప్పటికీ వస్తలేవ్. కేసీఆర్ ఇచ్చే పైసలకు వ్యవసాయాధికారులు జిరాక్స్‌లు అడిగితే ఇచ్చిన. ఎప్పటికప్పుడు పైసలు పడుతున్నయ్. ఏ గోసలేకుండ కేసీఆర్ సారు బ్యాంకులో వేస్తండు.
-కులేరు శంకర్, మామిడిపల్లి(కోనరావుపేట)