కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మోతె, ఇరుకుల్ల వాగులకు సాగు నీరు విడుదల చేయకపోవడంతో అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి ప్రతి యాసంగి సీజన్‌కు నీటిని విడుదల చేసేది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన రెండు యాసంగి సీజన్లకు సాగునీరు విడుదల చేయలేదు. ఫలితంగా రామడుగు మండలంలోని మోతె వాగుపై ఆధారపడిన షానగర్, రామడుగు, కొరటపల్లి, మోతె, గోలిరామయ్యపల్లి, కొక్కెరకుంట, వన్నారం గ్రామాల్లో, కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగుపై ఆధారపడిన నగునూర్, ఇరుకుల్ల, వల్లంపహాడ్, గోపాలపూర్, దుర్షేడు, నల్లగుంటపల్లి, ముగ్ధుంపూర్, మందులపల్లి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నారాయణపూర్, గొల్లపల్లి, సాంభయ్యపల్లి గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది.
వట్టిపోయిన బావులు, బోర్లు
పరిసర గ్రామొల్లోని చెరువులు, కుంటల్లో చుక్కనీరు కానరావడం లేదు. ఇప్పటికే నల్లగుంటపల్లి, ముగ్ధుంపూర్ తదితర గ్రామాల్లో అనేక ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తక్షణం సాగు నీరు అందకుంటే వందర ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. పంటను రక్షించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు.. బావుల అడుగులు తవ్వించుకుంటున్నారు. కొత్త బోర్లు వేయించుకుంటున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా, పాలకులకు విన్నవించుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు వాపోతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి కష్టాలను ఎన్నడూ చూడ లేదన్నారు.