Dharmaram | ధర్మారం, జూన్ 18 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి శివారులో ఎస్సారెస్పీ డీ 83-13 ఎల్ మైనర్ కాలువ లైనింగ్ ను ఆ గ్రామానికి చెందిన ముదాం శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ధ్వంసం చేసి నష్టం కలిగించాడని ఆ శాఖ అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. శ్రవణ్ కుమార్ కాలువ లైనింగ్ ను ధ్వంసం చేసి ఆక్రమించడం వల్ల కాలువ నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడి పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడుతుందని ఆ ఫిర్యాదులో ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ దాడి సదయ్య, ఈ భూమయ్య పేర్కొన్నారు. లిఖితపూర్వకంగా ఆశాఖ ఏఏఈ లక్ష్మణ్ కు వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఏఏఈ గురువారం కాలువ లైనింగ్ ప్రదేశాన్ని రైతులతో కలిసి పరిశీలించారు.
కాల్వ లైనింగ్ ధ్వంసం చేయడం వల్ల పంటలకు సక్రమంగా నీటి సరఫరా జరగదని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా సదరు ఇంజనీరింగ్ అధికారికి వివరించారు. విచారణకు ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్ హాజరై లైనింగ్ నష్టం గురించి వివరించారు. దీనిపై ఏఏఈ లక్ష్మణ్‌ను వివరణ కోరగా కాల్వ లైనింగ్ ను శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ధ్వంసం చేసింది వాస్తవమేనని దీనిపై సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేస్తామని ఆయన వివరించారు. ఆక్రమించాడని ఆరోపణ ఎదుర్కొంటున్న ముదాం శ్రావణ్ ను వివరణ కోరగా కాగా 3 కిలోమీటర్ల మేర ఈ కాలువ ధ్వంసం అయిందని కాగా తన సొంత పట్టా భూమి పరిధిలో కాలువ లైనింగ్ ను పునరుద్ధరిస్తానని ఆయన పేర్కొన్నారు.