శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు తడారిపోతున్నది. వేసవికి ముందే నీరందక తల్లడిల్లుతున్నది. కాకతీయ ఎగువ ప్రధాన కాలువ ద్వారా సరిపడా నీరు రాకపోవడంతోనే మైనర్ కెనాళ్లలో పారక పొలాలు ఎండిపోయే దుస్థితి దాపురించిందని దిగువ కర్షకులు వాపోతున్నారు. పైన వాడుకోగా మిగిలినవే కిందికి సరఫరా అవుతున్నాయని, అవి కూడా కొద్ది మొత్తమే కావడంతో తమ వరకూ అందడం లేదని ఆందోళన చెందుతున్నారు.
చొప్పదండి మండలం వెదురుగట్ట వద్ద డిస్ట్రిబ్యూటరీ నుంచి తమకు సరిపడా నీళ్లు రాకుండా పైన గ్రామాల రైతులు అడ్డుకుంటున్నారని, పర్యవేక్షించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్న సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల రైతులు, ఇటీవల ఎగువన తూములు కట్టి నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకున్న స్థానిక రైతులతో గొడవకు దిగినట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించాల్సి ఉంది.
– కరీంనగర్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి నీళ్ల కోసం రైతులు గొడవలకు దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన కాలువలకు సరిపడా ఇవ్వడం లేదు. ఇచ్చిన నీటిని పైన ఉన్న రైతులు వాడుకోగా మిగిలినవి వదిలితే చివరి ఆయకట్టుకు చేరకపోవడం, కింది రైతులు కాలువలపై తిరుగుతూ గేట్లు మూసి వేయడం, తూములు కట్టేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలోని ఎగువ కాకతీయ కాలువకు గత డిసెంబర్ 25 నుంచి ఆన్ ఆఫ్ పద్ధతిలో డీ-54 నుంచి డీ-94 వరకు నీటిని విడుదల చేస్తున్నారు.
విడుదల చేసిన ప్రతిసారి 5,500 క్యూసెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నీళ్లు పైన ఉన్న డిస్ట్రిబ్యూటర్లు వాడుకోగా దిగువన డీ-86, డీ-94 వరకు 3,700 క్యూసెక్కులు రావాల్సి ఉంటుంది. కానీ చొప్పదండి మండలం రేవెల్లిలోని డిస్ట్రిబ్యూటరీల వరకు కేవలం 2,950 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అంటే 750 క్యూసెక్కుల నీటి కొరత ఏర్పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా డిస్ట్రిబ్యూటర్ల పరిధిలోని పిల్ల కాలువలకు విడుదల చేసే నీరు ఎటూ సరిపోవడం లేదు. నిజానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాలకు నీటిని తరలించే డీ-86 కాలువకు 1,100 క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంటుంది.
కానీ 960 క్యూసెక్కులు మాత్రమే కాలువల ద్వారా వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ నీటిని కాలువ పైన ఉన్న రైతులే ఎక్కువగా వాడుకుంటున్నారని, చివరి ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అయితే పైన ఉన్న గ్రామాల రైతులు కూడా తమకు సరిపోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో చివరి ఆయకట్టు రైతులు కాలువలపై తిరుగుతూ తూములు మూస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల కింద చొప్పదండి మండలం వెదురుగట్ట డిస్ట్రిబ్యూటరీ వద్ద ఇదే జరిగింది. సుల్తానాబాద్, ఓదెల మండలాల రైతులు ఈ గ్రామానికి వచ్చి తమకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని స్థానిక రైతులతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది.
చివరి ఆయకట్టు వరకు నీరు అందే విషయంలో అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. కానీ పై నుంచి సరిపడా నీళ్లు రాకపోవడంతో అధికారులను సైతం రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటికి ఎగువ ప్రాంతంలోనే గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన కాలువకు 5,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారా..? లేదా..? అనేది తేలడం లేదు. ఒక వేళ అంతే మొత్తంలో వదిలితే రేవెల్లి వరకు 3,700 క్యూసెక్కులు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రధాన కాలువకు, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీలకు సరిపడా నీరు వచ్చినప్పుడే పిల్ల కాలువలకు పూర్తి స్థాయిలో అందుతుందని రైతులు చెబుతున్నారు. అయితే చివరి ఆయకట్టుకు నీళ్లందించేందుకు చొప్పదండి మండలం కోనేరుపల్లి వద్ద గేట్లు మూసి హెడ్ బిల్డప్ చేస్తున్నారు. ఇక్కడ నీళ్లు ఆపి ఒక్కసారిగా వదిలితే ప్రవాహం పెరిగి చివరి ఆయకట్టుకు నీళ్లు వెళ్తాయనేది అధికారుల ఉద్దేశం. కానీ ఈ ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో సఫలం అవడం లేదని రైతులు పడుతున్న కష్టాలను బట్టి తెలుస్తోంది. అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపి, ఆయా కాలువల ఆయకట్టును, దూరాన్ని బట్టి నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు.
ఎగువ కాకతీయ కాలువ పరిధిలోని డీ-54 నుంచి డీ-94 వరకు ఈ యాసంగి సీజన్లో ఇంకా మూడు తడులకు మాత్రమే నీరు ఇవ్వాల్సి ఉంటుంది. గత డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు నాలుగు విడతలు ఇచ్చారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు ఒకటి, జనవరి 9 నుంచి 17 వరకు రెండు, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మూడు తడులు పూర్తయ్యాయి.
ఫిబ్రవరి 8 నుంచి నాలుగో విడత కొనసాగుతోంది. ఈ నెల 16 వరకు వస్తుంది. మిగిలిన మూడు తడులు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు, మార్చి 10 నుంచి 18 వరకు, మార్చి 25 నుంచి ఏప్రిల్ 2 వరకు ఇవ్వనున్నారు. అయితే, అప్పటి వరకు ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుతుందని, మిగిలిన మూడు తడులకు ఇంకా నీరు తగ్గించవచ్చని, ఈ నేపథ్యంలో తమ భూములకు నీరందే పరిస్థితి ఉండక పోవచ్చని చివరి ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపి రైతుల మధ్య సమన్వయం కొరవడకుండా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.