కాలం కాకపోవడం.. వరద రాకపోవడం.. కాళేశ్వరం జలాలను సర్కారు ఎత్తిపోయక పోవడంతో ఎగువ మానేరు ప్రాజెక్టులో నీళ్లు అడుగంటాయి. గతేడాది వరకు నిండుకుండను తలపించిన ఈ జలాశయంలో ఇప్పుడు నాలుగో వంతు కూడా నీళ్లు లేకపోవడం.. పోసిన నార్లు ముదిరిపోతుండడంతో రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. తరలివచ్చిన గోదావరి జలాలతో గత మూడేళ్లు మత్తడి దుంకగా, ఈసారి వానకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా చుక్క నీరు రాక వెలవెలబోతున్నది.
గంభీరావుపేట, ఆగస్టు 5 : రెండు టీఎంసీల సామర్థ్యమున్న ఎగుమానేరు గతంలో దారుణంగా ఉండేది. కేవలం ఎగువ నుంచి వరద వచ్చినప్పడే నిండేది. ఏ ఐదేళ్లకో.. పదేళ్లకో మత్తడి దుంకేది. వానకాలం తప్ప ఎప్పుడు చూసినా ఖాళీగా దర్శనమిచ్చేది. ప్రాజెక్టుకు ఎప్పుడూ అరకొర నీళ్లు రావడంతో గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సుమారు 12 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారేది.
ఇక్కడి రైతుల కష్టాలను కండ్లారా చూసిన నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును గోదావరి జలాలతో అభిషేకిస్తామని మాట ఇవ్వడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని తరలించి నెరవేర్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 2020 ఏప్రిల్లో నట్టెండకాలంలోనే మొదటిసారిగా మల్లన్నసాగర్ నుంచి కూడవెళ్లి వాగుద్వారా ఎగువ మానేరుకు గోదావరి జలాలను తరలించి మత్తడి దూకించి ఇక్కడి రైతుల కళ్లల్లో ఆనందం నింపారు. అప్పటి నుంచి గతేడాది జూన్ వరకు మూడేళ్లకు పైగా 365 రోజులూ ఈ ప్రాజెక్టును నిండుకుండలా ఉంచడమే ఏకాకుండా ఆయకట్టుకు జీవం పోశారు. అప్పటి నుంచి రైతులు రెండు సీజన్లలో రందీ లేకుండా పంటలు పండించారు.
ఉన్నది 0.48 టీఎంసీలే
గతేడాది ఎగువమానేరు నిండుగా కళకళలాడింది. కాళేశ్వరం జలాలకు తోడు వర్షాలు పడడంతో జూన్ నుంచి దాదాపు 45 రోజులపాటు మత్తడి దుంకింది. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చింది. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేకుండా పోయింది. గోదావరి జలాలను ఎత్తిపోయకపోవడం, వానకాలం మొదలై రెండు నెలలు గడిచినా సరైన వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోయింది. రెండు టీఎంసీలకు 0.48 టీఎంసీలు మాత్రమే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టులో నార్లు పోసుకొని ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. అదును దాటిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
నార్లు ముదిరిపోతున్నయ్
ఆయకట్టు రైతులందరం ఆరుద్ర కార్తెలో వట్టి వరి నార్లు పోసుకున్నం. వానకాలం సురువై రెండున్నెళ్లు గడచినా పెద్ద వాన ఇప్పటికి పడలేదు. దీంతో మా మానేరుకు కూడెల్లి, పాల్వంచ వాగుల నుంచి పెద్దగా వరద రాలేదు. గతంల ఎర్రటి ఎండకాలం ఏప్రిల్ నెలలో యాసంగి వరి పంటలు కోసేటప్పుడు కూడా కాళేశ్వరం నీళ్లు వచ్చి మత్తడి దుంకినయ్. ఇప్పుడు మానేరుకు కాళేశ్వరం నీళ్లు ఇడ్తలేరు అంటే బాధనిపిస్తున్నది. వానలు లేవు, కాళేశ్వరం నీళ్లు లేవు, మానేరు కింద పోసిన నార్లు ముదిరిపోతున్నయ్. ఆయకట్టు రైతులను కాంగ్రెస్ సర్కారు పట్టించుకొని న్యాయం చేయాలె
– శాత్రబోయిన రాజయ్య, రైతు (నర్మాల)
మూడేళ్లు రందీ లేకుండా ఉన్నం
నాకు ఎగువమానేరు ఆయకట్టు కింద నాలుగు ఎకరాల భూమి ఉన్నది. అందులో ఉన్న బోరు మీద ఆశపెట్టుకుని ఈ వానకాలం నాటేసిన. మొన్నటి యాసంగి లెక్కనే మానేరుల వానకాలం నీళ్లు లేకపోతే పంటలు ఎండుతయో.. పండుతయో తెల్వదు. కేసీఆర్, కేటీఆర్ సారు దయతో మూడేళ్లు మానేరు కాల్వ నీళ్లతో రెండు పంటలు రంది లేకుండా పండించుకున్నం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
– పిట్ల నర్సయ్య, రైతు (నర్మాల)
కాళేశ్వర జలాలతో నింపాలి
కేసీఆర్ ప్రభుత్వం గతంలో గోదారి నీళ్లను మానేరుకు తీసువచ్చినట్టు ఇప్పుడు కూడా ఎత్తిపోయాలి. వానలు పడుతలేనందున వారం రోజుల్లో కాళేశ్వరం నీళ్లు మానేరుకు వస్తేనే వానకాలం వరి పంట వేసుకుంటం. మా బంగారు భూములను బీడు పెట్టుకుని విత్తనాలు, పెట్టుబడి నిండా మునిగే కాలం వచ్చింది. రైతులను కష్టపెట్టకుండా మానేరును కాళేశ్వర జలాలతో నింపాలి
– గొర్రె వెంకటి, రైతు, నర్మాల