జమ్మికుంట, ఫిబ్రవరి19 : సీజన్ ప్రారంభంలో పత్తి గింజల కోసం.. ఆ తర్వాత ఎరువుల కోసం రైతులు యుద్ధాలే చేశారు. అష్టకష్టాలు పడి సాగు చేశారు. జూలై, ఆగస్టులో కురిసిన అకాల వర్షాలు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల పత్తి చేతికొస్తుందని.. బాగా లాభం లేకున్నా నష్టమైతే ఉండదని భావించారు. పత్తి సేకరణకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ ధరలు క్వింటాల్‌కు 6వేల లోపే ఉండడంతో సీసీఐ కోసం ఎదురు చూశారు. అక్టోబర్ 24 నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోళ్లకు సిద్ధంకావడంతో మద్దతు దొరుకుతుందని రైతులు ఆశపడ్డారు. కానీ, నిబంధనలతో పరేషాన్ అయ్యారు. సీసీఐ.. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించింది.
ఎకరానికి కేవలం 7 కింటాళ్లే కొంటామని చెప్పింది. నాణ్యత లేదని సాకులు చూపెట్టింది. తేమ 8 నుంచి 12 శాతం ఉంటేనే దిగుమతి చేసుకుంటామంటూ అనేక ని‘బంధన’లు అమల్లోకి తెచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే పత్తి రైతును ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టింది. ఎటూ పాలుపోని అన్నదాతలు నిబంధనలపై రైతులు ఉద్యమించారు.
ఎట్టకేలకు కొన్ని నిబంధనల సడలింపులతో కొనుగోళ్లకు దిగింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 46 వేల 220 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా, ఎకరానికి సగటున 8 క్వింటాళ్ల చొప్పున 4 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు 7710 నుంచి 8110 (దూది పింజ పొడవు.. పొట్టి, తేమ శాతం 8 నుంచి 12ను బట్టి) కొనుగోలుకు రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు కరీంనగర్లో 71,437, జమ్మికుంటలో 1,35,381, గోపాల్రావుపేటలో 35,924, చొప్పదండిలో 34,828 క్వింటాళ్లు.. మొత్తంగా 14 మిల్లుల్లో 2 లక్షల 77 వేల 621 క్వింటాళ్ల పత్తిని మాత్రమే సేకరించింది.
వాటి విలువ 220 కోట్లుగా ఉందని డీఎంవో ఎండీ బషీరొద్దీన్ చెప్పుకొచ్చారు. ఇక ప్రైవేట్ ట్రేడర్లు కరీంనగర్లో 1803, జమ్మికుంటలో 36,645, చొప్పదండిలో 427 కింటాళ్లు.. మొత్తంగా 38,875 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇంకా రైతుల వద్ద లక్ష క్వింటాళ్ల పత్తి నిల్వలు ఉన్నట్టు తెలుస్తున్నది. సీసీఐ నేటి నుంచి కొనుగోళ్లు బంద్ చేస్తామని ప్రకటించడంతో అవసరాలకు అమ్ముకునేందుకు నిల్వ చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నెల పాటు కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎప్పటిలాగే పత్తి రైతుపై సీసీఐ కక్షకట్టింది. మద్దతు ధరతో పత్తి కొనాల్సిందిపోయి.. ఈ యాసంగి సీజన్లో అనేక ఇబ్బందులకు గురిచేసింది. ‘కపాస్ కిసాన్’ యాప్‌ను తెచ్చి, సవాలక్ష కొర్రీలు పెట్టింది. అంతంత మాత్రమే చదువుకున్న రైతులు ఈ యాప్‌తో స్లాట్ బుక్ చేసుకునేందుకు అష్టకష్టాలు పడినా చోద్యం చూసింది. మొదట ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని మెలిక పెట్టింది. ఆ తర్వాత ఇక 8 నుంచి 12 శాతం తేమ ఉండాలని కోతలు విధించింది.
కొనుగోళ్లకు వెనుకంజ వేసి, ప్రైవేట్ వ్యాపారులకు ‘మద్దతు’ పలికిందనే ఆరోపణలెదుర్కొన్నది. ఇంత చేసినా కరీంనగర్ జిల్లాలో సగం మాత్రమే కొని, చేతులెత్తేసింది. ఇంకా రైతుల వద్ద లక్ష క్వింటాళ్ల పత్తి నిల్వలు ఉన్నట్టు తెలుస్తుండగా, నేటి నుంచి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న నిల్వలను ఎక్కడ అమ్ముకోవాలని, ప్రైవేట్‌కు వెళ్తే ఎంతకో కొంత తెగనమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.