చిగురుమామిడి, సెప్టెంబర్ 02 : యూరియా కోసం రైతన్నలకు తిప్పులు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. కొంతమంది రైతులు నిన్న టోకెన్లు తీసుకొని వచ్చి యూరియా బస్తాలు తీసుకెళ్లారు. ముందస్తుగా రైతులకు టోకెన్లు అందజేసి యూరియా అందుబాటులోకి రాగానే టోకెన్ ద్వారా యూరియాను అధికారులు పంపిణీ చేస్తున్నారు.
యూరియా కోసం వచ్చిన రైతుల క్యూలో ఎలాంటి తోపులాటలు జరగకుండా ఎస్సై సాయికృష్ణ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పలుమార్లు కేంద్రాలకు వచ్చి పరిస్థితిని ఎస్ఐ పరిశీలించారు. కాగా, చిరుమామిడి సింగిల్ విండో కార్యాలయంలో మంగళవారం 450 యూరియా బస్తాలు, రేకొండలో 230 యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ తెలిపారు.