ఎల్లారెడ్డిపేట/ ఇల్లంతకుంట, ఫిబ్రవరి 5 : యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. నాట్లు వేసి రెండు నెలలైనా దొరక్క నిరీక్షిస్తున్నారు. ఎక్కడ యూరియా వచ్చిందని తెలిసినా అక్కడకు పరుగెత్తుతున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పడిగాపులు గాశారు. ఎల్లారెడ్డిటపేట పీఏసీఎస్ గోదాంకు లోడ్ వచ్చిందని తెలియగానే పోతిరెడ్డిపల్లి, రాగట్లపల్లి, నారాయణపూర్, బండలింగంపల్లి, హరిదాస్నగర్, దుమాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పరిస్థితిని గమనించిన అధికారులు పోలీసుల సాయంతో యూరియాను పంపిణీ చేశారు. పలుకుబడి ఉన్నోళ్లకే యూరియా ఇస్తున్నారని కొందరు రైతులు హమాలీలతో గొడవకు దిగారు. దీంతో మరో లోడు వస్తుందని చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అలాగే ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ పీఏసీఎస్ గోదాం వద్ద కూడా బారులు తీరారు. సిరికొండ, దాచారం, రామోజిపేట, చిక్కుడువాని పల్లి, అనంతగిరి, తెనుగువానిపల్లికి చెందిన రైతులు ఉదయం నుంచే పడిగాపులు గాశారు. రైతులకు సరిపడా లేకపోవడంతో కొందరు నిరాశతో వెనుదిరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఎరువులు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా కోసం నాలుగు రోజుల సంది తిరిగినా ఇయ్యలే. యూరియా వచ్చిందని చెప్పంగనే దుమాలకెయి ఆగమాగమచ్చిన. వచ్చె సరికి యూరియ అయిపోయిందంటరు. మల్ల లోడు వత్తుందంటుర్రు. లోడు వచ్చెదెప్పుడో, ఇచ్చుడెప్పుడో. రైతులను గోసగోస జేత్తుర్రు.
ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన్రు. ఒక్కరికీ ఎవుసంపై అవగాహన లేదు. పంటలకు ఏటైంల ఎరువులు ఇయ్యాలో తెల్వదు. అదనులో ఇయ్యకపోతే ఎట్ల పండుతయ్. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ ఎరువుల కొరతనే. అరకొరగా ఇస్తే రైతు నష్ట పోతడు. పెట్టిన పెట్టుబడులు ఎల్లక ఆగమైతడు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను పట్టించుకోవాలె. ఆత్మహత్యల బాట పట్టకుండా ఆదుకోవాలె.