ఇది కేసీఆర్ పాలన
ఇది కాంగ్రెస్ పాలన!
దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పాలనలో భరోసా కరువైంది. కష్టం వస్తే కనీసం సాయం అందించే దిక్కులేకుండా పోయింది. నేలతల్లిని నమ్ముకొని జీవించే రైతన్న అదే నేలపై నేలరాలుతున్నాడు. మోసపోవడమే తప్ప మోసం చేయడం తెలియని ఆ రైతు.. కాంగ్రెస్ చేసిన మోసానికి తల్లడిల్లుతున్నాడు. వరంగల్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను నమ్మినందుకు అరిగోస పడుతున్నాడు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ రందీ లేకుండా ఎవుసం చేసినా.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేక ఒక్కొక్కరుగా నేలరాలుతున్నారు. సాగు సాగక, సర్కారు చూడక, సాయమందక.. పొలాల వద్దే ప్రాణాలు విడుస్తున్నారు. పదమూడు నెలల పాలనలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 39 మంది ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితికి అద్దంపడుతున్నది. ఈ మరణ మృదంగాన్ని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కదలని పక్షంలో ఆ బాధ్యతను బీఆర్ఎస్ భుజానికి ఎత్తుకున్నది. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాగు సంక్షోభాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడంతోపాటు అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ, నేడు జగిత్యాల జిల్లాకు రానున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట హామీల వర్షం కురిపించింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి ఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15 వేలు అందిస్తామని, భూమిలేని ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి 12వేలు ఇస్తామని, అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని, మూత పడిన చక్కెర కర్మాగారాలు తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఇంకా పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పంటల బీమా పథకం, రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతుబీమా పథకం వర్తింపు, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయవిక్రయాలతో అన్ని యాజమాన్య హక్కులు, ప్రతి ఎకరాకూ సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టుల పూర్తి, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెంలంగాణ వాతావారణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం- పంటల ప్రణాళిక అమలు.. ఇలా అనేక హామీలు గుప్పించింది. వీటిని నమ్మిన రైతాంగం ఇప్పుడు మోస పోయి గోస పడుతున్నది.
మాఫీ ఓ మాయే..?
కాంగ్రెస్ రుణమాఫీ ప్రక్రియ ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉమ్మడి జిల్లాలో సాగింది. ఒకేసారి అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట మార్చి నాలుగు విడుతల్లో రుణమాఫీ అమలు చేశారు. అయినా నేటికి ఇంకా దాదాపు లక్షన్నర పైచిలుకు మంది రైతులకు రుణమాఫీ జరుగలేదు. 2014లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 3,77,984 మంది రైతులకు 1,693 కోట్ల రుణంమాఫీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు విడుతల్లో కలిపి 2,67,824 మందికి 2,058 కోట్లను మాఫీ చేసినట్టు చెబుతున్నది. నిజానికి 2014తో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో రైతుల సంఖ్య రెట్టింపు కాగా, గడిచిన పదేళ్లలో సాగు మూడింతలు పెరిగింది. తాజాగా ప్రభుత్వం చెబుతున్న ఉమ్మడి జిల్లా లెక్కలను చూసినా.. 2014లో మాఫీ అయిన రైతులతో ప్రస్తుత మాఫీ రైతులను పోలిస్తే ఇంకా 1.10,160 మంది రైతులకు రుణమాఫీ కాలేదని స్పష్టమవుతున్నది. నిజానికి ఈ సంఖ్య ఇంకా అదనంగా ఉంటుంది. అంటే రెండు లక్షల పైచిలుకు రైతుల ముచ్చటే లేదు. ఉమ్మడి జిల్లాలోని ఏ గ్రామంలోనూ నేటికి వందశాతం రుణమాఫీ కాలేదని నూటికి నూరుపాళ్లు వాస్తవం!
ఏదీ భరోసా..?
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, సాగు కోసం కల్పించిన మౌలిక సదుపాయాల వల్ల వ్యవసాయ సాగు విస్తీర్ణం రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి జిల్లాలోనూ గణనీయంగా పెరిగింది. అన్నదాతకు అండగా నిలిచేందుకు రైతుబంధును అమల్లోకి తెచ్చిన కేసీఆర్ సర్కారు.. పథకం అమలు నుంచి 11 విడుతలుగా పెట్టుబడి సాయాన్ని అందించింది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9.25,343 మంది రైతులకు 11 విడుతల్లో 7,750.68 కోట్ల చిలుకు మొత్తాన్ని పెట్టుబడి కింద అందించింది. ఈ లెక్కన ఒక సీజన్లో చూస్తే సగటున 700 నుంచి 800 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందింది. అంటే ఏడాదికి 1400 నుంచి 1600 కోట్ల వరకు రైతు ఖాతాల్లో పడింది. కానీ, తాము అధికారంలోకి వస్తే రైతు బంధును రైతు భరోసాగా మార్చి, ఎకరాకు 15వేలు ఇస్తామని హామీల వర్షం కురించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం ఒక్కసారి మాత్రమే ఇచ్చింది. పోయిన ఖరీఫ్ సీజన్లో పూర్తిగా ఎగనామం పెట్టింది. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పి, ఇప్పుడు సాగు చేస్తున్న భూముల వివరాలు తీస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నది. అంటే ఉమ్మడి జిల్లా రైతాంగం రెండు సీజన్లకు కలిపి దాదాపు 1400 నుంచి 1600 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
రైతుల ఆత్మహత్యలు
కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఫలితంగా సదరు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 13 నెలల్లోనే 39 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో 9 మంది, కరీంనగర్లో 14, పెద్దపల్లిలో 6, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 10 మంది ఉసురు తీసుకున్నారు. బలవన్మరణాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో పెరిగిన వ్యవసాయ భూముల ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా కూనరిల్లాయి. బిడ్డల పెళ్లిళ్లకు లేదా సాగు కోసం చేసిన అప్పులు తీర్చడానికి అమ్ముదామంటే కొనేవారు లేక అప్పులు తడిసి మోపడవుతున్నాయి. రైతు భరోసా అందడం లేదు. సకాలంలో ప్రాజెక్టు నీళ్లు రావడం లేదు. కరెంటు కష్టాలు కమ్ముకున్నాయి. ఇలా అనేక కారణాలు వ్యవసాయాన్ని భారంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వెంటాడుతున్న అప్పులు.. సాగు కష్టాలు రైతులను బలవర్మణంవైపు నెడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో రైతు మరణ మృదంగం కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా రైతన్న కుటుంబాలకు అండగా నిలువడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కనీసం పాలకులు పరామర్శించడం లేదు. చేయూత నివ్వకపోయినా బాధిత కుటుంబాల్లో భరోసా నింపే ప్రయత్నాలు చేయడం లేదు. కనీసం అధికారయంత్రాగాన్ని పంపి, కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు.
కేసీఆర్ పాలనలో సాగు పండుగ
Kcr
రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే 2014లో అన్ని పంటలు కలిపి ఉమ్మడి జిల్లాలో 11,79,013 ఎకరాలు సాగు చేస్తే.. 2023 నాటికి అది 22,41,066 ఎకరాలకు చేరింది. అంటే 10,62,053 ఎకరాల్లో సాగు పెరిగింది. అలాగే 2014లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి సాగు 3,63,776 ఎకరాల్లో ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అది 12,35,223 ఎకరాలకు చేరింది. అంటే 8,71,447 ఎకరాల్లో వరి విస్తీర్ణం పెరిగింది. కాళేశ్వరం జలాలు రావడంతో ఇది సాధ్యమైంది. 2014లో ఆనాడు వ్యవసాయం చేసిన రైతుల సంఖ్య 3,57,725 మంది ఉంటే 2023 నాటికి ఆ సంఖ్య 9,25,343కు చేరింది. అంటే 5,67,618 లక్షల మంది పెరగడం గమానార్హం. రైతుబంధు కింద 11 విడుతల్లో 7,750.68 కోట్లు ఇచ్చింది. అలాగే 2014లో వ్యవసాయ విస్తర్ణ అధికారులు 69 మంది ఆ సంఖ్యను 258కు పెంచింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 189 మందిని అదనంగా నియమించింది. 2018కి ముందు అంటే రైతుబంధుకు ముందు ఉమ్మడి జిల్లాలో 14,29,562 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే.. రైతుబంధు అమలు తర్వాత ఆ సాగు విస్తీర్ణం 22,41,066కు చేరింది. అంటే 8,11,504 ఎకరాలు పెరిగింది. రైతుబంధు రావడం, ఇదే సమయంలో కాళేశ్వరం జలాలు అందడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. 2014లో ఉమ్మడి జిల్లాలో 53,247 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే 2023నాటికి వాటిని 78,958కి పెరిగాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 25,711 ట్రాన్స్ఫార్మర్లు ప్రభుత్వం పెంచింది. ఇవి మచ్చుకు మాత్రమే! పెట్టుబడి సాయంతోపాటు అన్నదాతకు అండగా ఉండేందుకు రైతుబీమాను కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేసింది. ప్రాజెక్టులను అనతి కాలంలో పూర్తిచేసి సాగునీటి రంది లేకుండా చేసి, వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చిన ఘనత తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది.
రైతు బతికేదెట్ల?
కాంగ్రెస్ సర్కారు అచ్చి ఏడాదైనా రైతులకు చేసిందేమీ లేదు. రైతు రుణమాఫీ పూర్తి చెయ్యలేదు. రైతు భరోసా ఇత్తలేదు. నీళ్లు అత్తలెవ్వు. కరెంటు సక్కగ ఉంటలేదు. ఇట్లయితే రైతు బతికేదెట్ల? ఇరువై ఏండ్ల కింద గిట్లనే ఉండేది. అప్పుడు రైతులను ఎవ్వలు పట్టిచుకోలె. వ్యవసాయం చెయ్యలేక రైతులు భూములు అమ్ముకున్నరు. పెట్టుబడి కూడా రాక అప్పులపాయిన్రు. అవి తీర్చే దారిలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నరు. ఇవన్నీ కండ్ల ముందే ఉన్నయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నయి. రైతు మంచిగుంటేనే రాజ్యం మంచిగుంటది. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారు మీదనే ఉంటది.
– పొన్నం రాములు, నారాయణపూర్(గంగాధర)
ఆదుకునేటోళ్లు లేరు
పదేండ్లపాటు ఏ రందీ లేకుండ ఎవుసం చేసుకున్నం. కేసీఆర్ సారు మాకు పెద్దదిక్కుగా ఉన్నడు. మా కోసం అన్ని పథకాలు పెట్టి ఇబ్బంది లేకుండా చూసుకున్నడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మాకు దికు లేకుటైంది. రైతులను ఆదుకునేటోళ్లు లేరు. ఎవరైనా రైతు సచ్చిపోతే బాధిత కుటుంబాన్ని మందలిచ్చెటోళ్లు లేరు. సాయం చేసేటోళ్లు లేరు. పదేండ్ల కింద ఎట్లుండెనో ఇప్పుడు గట్లనే తయారైతంది.
-సాయిళ్ల కొమురయ్య, రైతు, మొగిలిపాలెం (తిమ్మాపూర్)
ఇరువై ఏండ్ల కిందటి పరిస్థితి వచ్చింది
ఇరువై ఏండ్ల కింద పరిస్థితి ఎట్లుండేదో మళ్లీ అసోంటి పరిస్థితి వచ్చినట్టున్నది. అప్పుడు పొలం ఎయ్యాలంటే మొగులు మొఖాన చూసేది. చెరువులల్ల, బాయిలల్ల నీళ్లు ఉడేటియి కాదు. వాన పడితేనే పొలం ఏసేది. ఉన్న అరకొర నీళ్లతోని పంటలు కాపాడుకునెటోళ్లం. నీళ్లు లేక సగం పంట పొలంలోనే పొయ్యేది. పెట్టుబడి కూడా వచ్చేది కాదు. పెట్టుబడి మీద పడి అప్పుల పాలై చాలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. రైతు కుటుంబాలు రోడ్డున పడ్డా ఎవ్వలు పట్టించుకోలె. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎటువంటి కట్టం లేకుంట పంటలు సాగు చేసుకున్నం. మళ్ల కాంగ్రెస్ సర్కారు వచ్చి ఇరువై ఏండ్ల కిందటి కష్టాలను గుర్తుకు తెస్తంది. ఏడాది కాలంగా మాటలు చెప్పుడే తప్పితే రైతులకు చేసిందేమీ లేదు.
– సాగి సత్యనారాయణరావు, బూరుగుపల్లి (గంగాధర)