కోనరావుపేట, ఫిబ్రవరి 7 : యూరియా కోసం రైతులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా పడిగాపులు పడుతున్నా బస్తాలు దొరకక ఆగమవుతున్నారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని కొలనూర్ సింగిల్ విండో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బారులు తీరారు. యూరియా వచ్చిందని సింగిల్ విండో పరిధిలోని గ్రామాల్లోని రైతులకు సమాచారం ఇవ్వగా, శుక్రవారం ఉదయం 6 గంటలకే కార్యాలయానికి వచ్చి క్యూలైన్ కట్టారు. అధికారులు 10 గంటల ప్రాంతంలో వచ్చి ఒక లారీ లోడ్ మాత్రమే ఉందని, ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నామని టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికే క్యూలైన్లో 287 మంది రైతులు టోకెన్ కోసం తిండి, తాగు నీరు లేక ఎండలోనే నిరీక్షించారు. కాగా, అధికారులు క్రమ పద్ధతిలో టోకెన్లు ఇవ్వకపోవడంతో రైతులు ఒకరికొకరు గొడవకు దిగారు. చివరికు 200 మంది రైతులకు బస్తాలు ఇవ్వగా, మిగిలిన 87 మంది నిరాశతో వెనుదిరిగారు. పొద్దంతా ఎండలో ఉన్నా యూరియా బస్తాలు దొరకలేదని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన చెందారు.
నేను మూడెకరాల్లో నాటేసి రెండు నెలలు అయితంది. మా ఊరు పరిధిలోని కొలనూర్ సింగిల్ విండో గోదాంలో మొన్నటిదాక యూరియా లేదు. ఒక లారీ వచ్చిందంటే రైతులమంతా వచ్చినం. కానీ, ఇక్కడ ఒక్క బస్తా రెండు బస్తాలే ఇస్తున్నరు. అది కూడా పొద్దున వచ్చి లైన్ కడితేనే. ఎండలో తిండి లేక, తాగడానికి నీళ్లు లేక పొద్దంతా పడిగాపులు గాసినం. సాయంత్రానికి రెండు బస్తాలు ఇచ్చిన్రు. నాకు ఆరు బస్తాలు అవసరం. ఇప్పుడిచ్చిన రెండు బస్తాలు ఎటు సరిపోవు.